‘వివాద’ భూములనూ

ABN , First Publish Date - 2022-10-14T07:49:27+05:30 IST

ప్రభుత్వ రికార్డుల ప్రకారమే అవి వివాదాస్పద భూములు. అంటే, తిరిగి స్పష్టత వచ్చేవరకు వాటిపై ఎవరికీ హక్కు ఉండదు.

‘వివాద’ భూములనూ

  • 147ఎకరాల నక్కపల్లి భూములపై పెద్దల కన్ను
  • మార్కెట్‌ విలువ రూ.35 కోట్లపైమాటే
  • అనకాపల్లిలో జీపీఏ.. బెజవాడలో రిజిస్ట్రేషన్‌
  • తన కంపెనీకి రాయించుకున్న వైసీపీ నేత
  • దశాబ్దాలుగా అవి ‘వివాద’ జాబితాలోనే
  • సాగుచేసుకుంటున్న 2 గ్రామాల పేదలు 
  • అప్పట్లో వెలుగులోకి తెచ్చిన ‘ఆంధ్రజ్యోతి’
  • తాజాగా భూముల్లోకి వచ్చేందుకు యత్నం
  • సాగుదారులు అడ్డుకోవడంతో వెనక్కి...


ప్రభుత్వ రికార్డుల ప్రకారమే అవి వివాదాస్పద భూములు. అంటే, తిరిగి స్పష్టత వచ్చేవరకు వాటిపై ఎవరికీ హక్కు ఉండదు. అమ్మకాలు, కొనుగోళ్లు జరిపి చేసుకునే రిజిస్ర్టేషన్లు కూడా చెల్లవు. కానీ, ఇప్పుడు అవే భూములు చేతులు మారిపోతున్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని 147 ఎకరాలపై కన్నేశారు. మార్కెట్‌ రేటే ఈ భూములకు రూ.35 కోట్లకుపైగా పలుకుతోంది. వాటికి అనకాపల్లిలో జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (జీపీఏ) రాయించుకుని..దానికి విజయవాడలో రిజిస్ర్టేషన్‌ చేయించేశారు. దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న స్థానికులను గెంటేసి ఈ భూములను కొట్టేసేందుకు ఓ వైసీపీ నేత మాస్టర్‌ ప్లాన్‌ రచించారు! 

నక్కపల్లి, అక్టోబరు 13: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో సుమారు 147 ఎకరాల వివాదాస్పద భూములను ఓ వైసీపీ నేత అడ్డగోలుగా జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (జీపీఏ) చేయించుకున్నారు. ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఈ ప్రాంతంలో రిజిస్ర్టేషన్‌ విలువ ఎకరా రూ.7.65 లక్షలు, మార్కెట్‌ ధర ప్రకారం రూ.25 లక్షలు. ఈ లెక్కన జీపీఏ రూపంలో చేతులు మారిన ఈ భూముల విలువ రూ.35 కోట్లకుపైగా ఉంటుంది. సదరు నేత ప్రస్తుతం ఏపీ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కావడం గమనార్హం. ఆ వివరాల్లోకి వెళితే... నక్కపల్లి మండలం పెదదొడ్డిగల్లు రెవెన్యూ సర్వే నంబర్‌-1లో 334 ఎకరాల భూములు ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా పెదదొడ్డిగల్లు, సీతంపాలెం గ్రామాలకు చెందిన పేదలు ఈ భూములను సాగు చేసుకుంటూ, తమ పశువులు, మేకలు, గొర్రెలను మేపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. 1984లో స్థానిక సర్పంచ్‌, గ్రామ పెద్దలు సమావేశమై ఒక్కో కుటుంబం 75 సెంట్ల చొప్పున సాగు చేసుకోవాలని తీర్మానించి, వీరికి డి.పట్టాలు మంజూరు చేయాలంటూ అప్పటి నక్కపల్లి తాలూకా అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.


 అయితే ఈ సర్వే నంబరులో 1959 సర్వే సెటిల్‌మెంట్‌లో భాగంగా ఒక్కో గ్రామంలో 12 మంది చొప్పున రెండు గ్రామాల్లో 24 మంది పేర్లు సాగుదారులుగా రికార్డుల్లో నమోదయ్యాయని, అందువల్ల పట్టాలు ఇవ్వడం వీలుకాదని అధికారులు వెల్లడించారు. అయితే రెవెన్యూ రికార్డుల్లో సాగుదారులుగా పేర్లు నమోదైన వ్యక్తులు ఎవరూ లేకపోవడంతో సుమారు 450 మంది స్థానిక పేదలు ఈ భూముల్లో మామిడి, జీడిమామిడి తోటలు సాగు చేసుకుంటూ ఫలసాయాన్ని పొందుతున్నారు. అయితే, ఆరు దశాబ్దాల క్రితం సాగుదారులుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదైన వ్యక్తుల వారసులంటూ కొంతమందిని ఏడేళ్ల క్రితం తెరమీదకు తెచ్చారు. ఈ భూములను వారు విక్రయించేందుకు యత్నించారు. ఒక రియల్‌ ఎస్టేట్‌ సంస్థకుసేల్‌ అగ్రిమెంట్‌ రాసి, కొంత సొమ్మును అడ్వాన్స్‌గా తీసుకున్నారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు రావడం, స్థానికులు పెద్దఎత్తున ఆందోళనలు చేయడంతో భూముల అమ్మకం ప్రక్రియ ఆగిపోయింది. దీనిపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో సర్వే నంబరు-1లో ఉన్న భూములను డిస్‌ప్యూట్‌ (వివాదం)గా నోషనల్‌ ఖాతాలో నమోదు చేయించారు. స్థానిక నిరుపేదలు యథావిధిగా భూములను సాగు చేసుకుంటున్నారు. 


రెప్పపాటులో తలకిందులు...

వైసీపీ అధికారంలోకి రాగానే నక్కపల్లి భూములపై పెద్దల కన్ను పడింది. ఈసారి గుట్టుచప్పుడు కాకుండా భూమి చేతులు మారిపోయింది. రెవెన్యూ రికార్డుల్లో సాగుదారులుగా పేర్లు నమోదైన వ్యక్తుల వారసు లమంటూ తెరపైకి వచ్చిన పదకొండు మంది...పెదదొడ్డిగల్లు రెవెన్యూ సర్వే నంబరు-1లో 334 ఎకరాల్లోని 147 ఎకరాలను గత ఏడాది జూలై 14న విజయవాడ-2 సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఏపీ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కనుమూరి సుబ్బరాజు డైరెక్టర్‌గా ఉన్న ‘ఎస్‌ఆర్‌ఎస్‌వీఎల్‌ఎస్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ మల్టీట్రేడ్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ అనే సంస్థ పేరు మీద జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (జీపీఏ) కింద రిజిస్ర్టేషన్‌ చేశారు. ఈ విషయాన్ని అప్పట్లోనే ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో స్థానికంగా గ్రామ పెద్దలు, సాగుదారులు ఆందోళనకు దిగడంతో ఎవరూ ఆ భూముల జోలికి రాలేదు. రెవెన్యూ రికార్డుల్లో ఏళ్ల తరబడి డిస్‌ప్యూట్‌ భూములుగా ఉన్న వీటిని జీపీఏ రిజిస్ర్టేషన్‌కు కొద్ది గంటలకు ముందు ఆన్‌లైన్‌లో రికార్డులు టాంపరింగ్‌ చేసి దొడ్డిదారిన 1-బీలో చేర్చారని, అనంతరం యథావిధిగా డిస్‌ప్యూట్‌ ల్యాండ్స్‌గా చూపించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాత్ర ఉందని వాదిస్తున్నారు. 


అడ్డుకున్న గ్రామస్థులు

ఏడాది తరువాత ఈ నెల పదో తేదీన కొందరు...తహసీల్దార్‌ అనుమతి తీసుకోకుండా సర్వేయర్‌ను తీసుకుని భూముల్లోకి ప్రవేశించారు. 147 ఎకరాలకు హద్దులు నిర్ణయించి అధికార పార్టీ నేతకు అప్పగించేందుకు ప్రయత్నం చేశారు. వారిని సర్పంచ్‌ గొర్ల విజయలక్ష్మికుమారి, పలువురు గ్రామస్థులు, సాగుదారులు అడ్డుకున్నారు. అడుగు ముందుకు వేస్తే ఊరుకునేది లేదని, ఎవరి భూములు ఎవరికి అమ్మేస్తారని నిలదీయడంతో వారంతా వెనుతిరిగారు. ఈ నేపథ్యంలో పెదదొడ్డిగల్లు, సీతంపాలెం గ్రామాలకు చెందిన పెద్దలు, సాగుదారులు బుధవారం తహసీల్దార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. మూడున్నర దశాబ్దాల నుంచి ఎవరైతే ఈ భూముల్లో సాగులో ఉంటున్నారో వారికే హక్కులు కల్పించాలని, అక్రమ జీపీఏ రద్దు చేసి, సాగుదారుల పేర్లను ఆన్‌లైన్‌లో చేర్చాలని కోరారు.


రిజిస్ర్టేషన్‌ చెల్లదు

‘‘నక్కపల్లి మండలం పెదదొడ్డిగల్లు సర్వే నంబర్‌-1లో ఉన్న భూములపై పూర్తి స్పష్టత లేదు. 1-బీ, అడంగల్‌, ఎఫ్‌ఎంబీలలో వేర్వేరు వివరాలు ఉన్నాయి. ఇందులో అటవీశాఖ భూములు ఎన్ని ఉన్నాయో తేలాలి. రెవెన్యూకు సంబంధించి సబ్‌ డివిజన్‌ కూడా జరగలేదు. కాబట్టి గత ఏడాది 147 ఎకరాలకు సంబంధించి జరిగిన జీపీఏ రిజిస్ర్టేషన్‌ చెల్లదు. ఈ నెల పదో తేదీన సర్వేయర్‌ ఈ భూముల్లోకి వెళ్లినట్టు మాకు తెలియదు. మేమైతే వెళ్లమని చెప్పలేదు. పూర్తిస్థాయిలో మరింత లోతుగా రికార్డులు పరిశీలించి, కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తాం. అంతవరకూ ఈ భూములను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం’’

- సుబ్రహ్మణ్యశాస్ర్తి, నక్కపల్లి తహసీల్దార్‌ 


హక్కు మాకే ఉండాలి

‘‘30 ఏళ్లకుపైగా నక్కపల్లిలో భూములు సాగు చేస్తున్నాం. పూర్వం మా తాత, ఆ తరువాతమా తండ్రి ఈ భూముల్లో తోటలు వేసుకుని జీ జీవించారు. అటువంటిది మాకు తెలియకుండా మా పూర్వీకుల పేరుతో భూములు అమ్మేసినట్టు తెలిసి ఆశ్చర్యపోయాం. ఈ భూములపైసాగుదారులకే హక్కులు కల్పించాలి’’

- గొనగాల బాపూజీ, సాగుదారు

Updated Date - 2022-10-14T07:49:27+05:30 IST