గడువు 19 నెలలే!

ABN , First Publish Date - 2022-09-29T08:22:16+05:30 IST

గడువు 19 నెలలే!

గడువు 19 నెలలే!

మీ పనితీరు మార్చుకోవలసిందే: జగన్‌

గడప గడపకు 27 మంది వెళ్లడం లేదు

వీరిలో మంత్రులు బుగ్గన, రోజా, వనిత, విశ్వరూప్‌, దాడిశెట్టి కూడా ఉన్నారు

6 నెలల ముందు అభ్యర్థులను ప్రకటిస్తా

ఓడిపోయేవారికి అవకాశమివ్వను

175 నియోజకవర్గాల్లోనూ పీకే టీమ్‌

వర్క్‌షాపులో ముఖ్యమంత్రి స్పష్టీకరణ


అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ‘గడప గడపకు’ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం బాగోలేదని సీఎం జగన్‌ మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. గత వర్క్‌షాపులో కూడా ఇదే  చెప్పాన ని.. ఇప్పుడూ చెబుతున్నానని.. తక్షణమే సరిచేసుకోవాల ని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు 19 నెలలే గడువుందని గుర్తుచేశారు. బుధవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గడప గడపకు కార్యక్రమంపై వర్క్‌షాపు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గడప గడపకు ఎమ్మెల్యేలు వెళ్లకుండా తమ కుటుంబ సభ్యులను పంపుతున్నారని.. ఇది సరికాదని చెప్పారు. ‘అదేవిధంగా ఒక్కో వార్డులో 2 రోజులు పర్యటించాల్సి ఉంటే.. కొందరు ఎమ్మెల్యేలు ఒక పూటలోనే ముగించేస్తున్నారు. ఒకే వార్డులోని కొన్ని వీధుల్లో తిరుగుతూ ఇంకొన్ని వీధుల్లో తిరగకుండా పోతే ప్రజలేమనుకుంటారు? వారు వైసీపీకి ఓటేస్తారా? ప్రతి ఎమ్మెల్యే ప్రతి గడపా తొక్కాల్సిందేనని. వార్డుల్లో ప్రజలతో కలసి సహపంక్తి భోజనాలు చేయాలి’ అని స్పష్టం చేశారు. ఎన్నికలకు మరో 19 నెలల గడువు మాత్రమే మిగిలి ఉందని గుర్తించాలన్నారు. ఈలోగా ప్రతి గడపా తొక్కకుంటే ఎలాగని ప్రశ్నించారు. ఐదుగురు మంత్రులు సహా 27 మంది గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనడం లేదని చెప్పారు. మంత్రుల్లో బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆర్‌కే రోజా, పినిపె విశ్వరూప్‌, హోం మంత్రి తానేటి వనిత, దాడిశెట్టి రాజా ఉన్నారని.. మంత్రులే ఇలా వ్యవహరిస్తే ఎలాగని మండిపడ్డారు. పది మంది ఎమ్మెల్యేలు తమ వారసులు బరిలో దిగుతారంటూ తమకు తాముగా ప్ర కటనలు ఇచ్చేసుకుంటే.. ఇక అధిష్ఠానం ఎందుకన్నారు. డిసెంబరులో ‘గడప గడపకు’ వర్క్‌షాపు నిర్వహిస్తానని.. ఆలోగా ఎమ్మెల్యేలంతా పనితీరును మెరుగుపరచుకోవాలని జగన్‌ సూచించారు. 87 శాతం మందికి ప్రభుత్వ లబ్ధి అందుతోందని చెప్పారు.  ఎమ్మెల్యేలుగా ఓడిపోతే గౌరవం తగ్గుతుందని.. గ్రాఫ్‌ పెంచుకునేందు కు అన్ని అస్ర్తాలూ ఉన్నాయని చెప్పారు. అధికారం ఉంటేనే మంచి చేయగలమని.. లేదంటే చేయలేమన్నారు. 175 లక్ష్యంగా పెట్టుకుని కష్టపడదామన్నారు.


సొంత సర్వేల ద్వారానే!

ఎన్నికలకు 6 నెలల ముందు సొంత సర్వేల ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేస్తామని జగన్‌ స్పష్టం చేశారు. ఓడిపోయేవారికి టికెట్లు ఉండవని తేల్చిచెప్పారు. అయి తే టికెట్లు దక్కని వారు దిగులు చెందాల్సిన పనిలేదని.. వారికి ఎమ్మెల్సీ పదవులిస్తానని.. నామినేటెడ్‌ పోస్టులూ ఉంటాయన్నారు. ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) టీమ్‌కు చెందిన ఐప్యాక్‌ ప్రతినిధులు 175 నియోజకవర్గాల్లోనూ ఉంటారని ఎమ్మెల్యేలకు సీఎం చెప్పారు. ఎన్నికలయ్యేవరకు వారు నియోజకవర్గాల్లోనే తిరుగుతూ ప్రజాభిప్రాయా న్ని ఎప్పటికప్పుడు తనకు చేరవేస్తుంటారని అన్నారు. ప్రత్యర్థులపై రాజకీయంగా ఎలా ఎదురుదాడి చేయాలో సూచిస్తూ ఉంటారని.. ప్రతిపక్షాల విమర్శలకు ఎలా అడ్డుకట్ట వేయాలో కూడా నేర్పుతారని.. ప్రెస్‌ కాన్ఫరెన్సుల్లో ఎలా మాట్లాడాలో వివరిస్తారని తెలిపారు.


డుమ్మా కొడుతోంది వీరే..!

మంత్రులు.. బుగ్గన, ఆర్‌కే, విశ్వరూప్‌, తానేటి వనిత, దాడిశెట్టి రాజా. ఎమ్మెల్యేలు.. ఆళ్ల నాని, పి.అనిల్‌కుమార్‌, బాలినేని శ్రీనివాసరెడ్డి, గ్రంధి శ్రీనివాస్‌, ధనలక్ష్మి, అదీ్‌పరాజ్‌, చిట్టిబాబు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, చక్రపాణిరెడ్డి సహా 22 మంది.

Updated Date - 2022-09-29T08:22:16+05:30 IST