కట్టడిపై కసి!

ABN , First Publish Date - 2022-08-31T07:59:34+05:30 IST

మీరు ఇచ్చిన హామీని నెరవేర్చండి’ అని అడిగిన తమనే నేరస్థులుగా నిలబెట్టడంపై సీపీఎస్‌ ఉద్యోగులు రగిలిపోతున్నారు. రోజూ..

కట్టడిపై కసి!

రగిలిపోతున్న సీపీఎస్‌ ఉద్యోగవర్గం

ప్రభుత్వ ఉద్యోగుల్నే నేరస్థుల్ని చేస్తారా?

పోలీసులను పంపి ఇబ్బందిపెడతారా?

సాధారణ పౌరుల్లా మేం తిరగబడలేం..

కానీ టైం వచ్చినప్పుడు వదిలిపెట్టం

కుటుంబాలపైనా తీవ్రమైన వేధింపులు

గత ఉద్యమాల్లో చూడని పెడధోరణి ఇది

ఉద్యోగుల ఫైర్‌.. ఆగని అణచివేతపై భగ్గు


అమరావతి, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): ‘మీరు ఇచ్చిన హామీని నెరవేర్చండి’ అని అడిగిన తమనే నేరస్థులుగా నిలబెట్టడంపై సీపీఎస్‌ ఉద్యోగులు రగిలిపోతున్నారు. రోజూ ఇళ్లకు పోలీసులను పంపుతూ, ఇంట్లోవాళ్లను ఇబ్బందిపెడుతూ, ఆఫీసులకు ఫోన్‌ చేసి బెదిరిస్తూ.. తరగతి గదుల్లోనే తిష్ఠ వేస్తూ, పోలీ్‌సస్టేషన్లలో అర్ధరాత్రి వరకు ఉంచుతూ, ఉద్యమాన్ని విరమించుకోకతప్పని పరిస్థితికి బలవంతంగా నెట్టేశారని తీవ్ర ఆక్రోశావేశాలను వెళ్లగక్కుతున్నారు. పరాకాష్ఠగా భారీఎత్తున అరెస్టులకు తెగబడి ఉద్యమ అడుగును కర్కశంగా అణచివేశారని మండిపడుతున్నారు. అయితే.. తాత్కాలికంగా తగ్గినా.. ప్రభుత్వంతో ఏదో ఒకరోజు తాడోపేడో తేల్చుకుని తీరుతామన్న కసి పలువురు ఉద్యోగుల్లో వ్యక్తం అవుతోంది.


ప్రభుత్వంపై తిరగబడడానికి తాము సాధారణ పౌరులంకాదని... అవకాశం వచ్చినప్పుడు చూసుకొందామని అంతర్గత సంభాషణల్లో ఉద్యోగ వర్గాలు బలంగా అనుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు సెప్టెంబరు 1న జరగాల్సిన చలో విజయవాడ, సీఎం ఇంటి ముట్టడిని ఉద్యోగులు తాత్కాలికంగా వాయిదా వేసుకున్నా.. వారిపై నిర్బంధకాండ మాత్రం కొనసాగుతూనే ఉంది. అరెస్టు చేసిన చాలామంది ఉద్యమ నేతలను ఇంకా విడుదల చేయలేదు. పోలీ్‌సస్టేషన్లలోని ఉద్యోగులు ఇప్పటికీ ఇళ్లకు చేరుకోలేదు. ఒకవేళ మెరుపు ఉద్యమాన్ని జరిపి.. విజయవాడను ఉద్యోగులు ముట్టడిస్తారేమోనన్న గుబులు ప్రభుత్వం, పోలీసులను వెంటాడుతున్నదా అన్న అనుమానాలు ఆగని అణచివేత చర్యలు రేకెత్తిస్తున్నాయి. 


కుటుంబాలనూ లాగారు...

జగన్‌ ఎన్నికల్లో సీపీఎస్‌ రద్దుపై ఇచ్చిన హామీ అమలులో మూడేళ్లు అవుతున్నా అతీగతీ లేదు. దీంతో  సెప్టెంబరు 1న సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమాలకు సిద్ధం కాగా, వారిపైకి సర్కారు కనీవినీ ఎరుగని స్థాయిలో పోలీసులను ప్రయోగించి నానా ఇక్కట్లకు గురి చేసింది. సీపీఎస్‌ ఉద్యోగులు ఏదో తప్పు చేసినట్లుగా ఇళ్లకు, కార్యాలయాలకు పోలీసులను పంపించడం,  వారిని నీడలా వెంటాడడంపై సీపీఎస్‌ ఉద్యోగుల్లు భగ్గుమంటున్నారు. సీపీఎస్‌ ఉద్యోగ సంఘాల నేతలు ఉపాధ్యాయులైతే పాఠశాలల వద్ద వారితోపాటు పోలీసులు వారిని అనుసరించి ఉన్నారు. దీనిపై ఉపాధ్యాయ వర్గాల్లో ఆగ్రహం నెలకొంది.


ఇదేం సంస్కృతి  అంటూ రగిలిపోతున్నారు. జగన్‌ సర్కార్‌పై సీపీఎస్‌ ఉద్యోగుల కుటుంబసభ్యుల్లోనూ వ్యతిరేకత గూడుకట్టుకుంది. ఉద్యమ అణచివేతకు ఎక్కువగా ఈసారి ఉద్యోగుల కుటుంబసభ్యులు లక్ష్యంగా మారారు. గతంలో ఏ ఉద్యమం చేసినా ఉద్యోగుల వరకే ప్రభుత్వ చర్యలు పరిమితమయ్యేవి. కుటుంబ సభ్యుల జోలికి వెళ్లేవారు కాదు. జగన్‌ సర్కార్‌ మాత్రం కుటుంబ సభ్యులను సైతం బయటకు లాగింది. గ్రామ/వార్డు సచివాలయ పోలీసులను రోజూ వారి ఇళ్లకు పంపించింది. ‘చలో విజయవాడకు వెళ్లొద్దని మీ ఆయనకు చెప్పండి’ అని... ‘ఉద్యమం అంటే ఇబ్బందులు ఉంటాయి. మీ ఆవిడకు చెప్పి ఉద్యమంనుంచి విరమించుకునేలా చూడండి’ అని.. వారితో తీవ్ర ఒత్తిడికి గురిచేశారు. 


వాయిదా వేసుకున్నా...

సీఎంఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన ఏపీసీపీఎ్‌సయూఎస్‌ ఆ కార్యక్రమాన్ని విరమించుకుంది. చలో విజయవాడకు పిలుపునిచ్చిన ఏపీసీపీఎ్‌సఈఏ కూడా వాయిదా వేసుకుంది. అయినా జగన్‌ సర్కార్‌ సీపీఎస్‌ ఉద్యోగులపై నిర్భందకాండను కొనసాగిస్తూనే ఉందని పలువురు ఉద్యోగుల వాపోతున్నారు. వాయిదా వేసుకున్నాం అన్నా..వినడంలేదని చెబుతున్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో పలు చోట్ల సీపీఎస్‌ ఉద్యోగుల బైండోవర్లు కొనసాగుతున్నాయి. ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. స్టేషన్లకు తీసుకువచ్చిన సీపీఎస్‌ ఉద్యోగులను  పంపించి వేయమని ఆదేశించామని పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే, కింది స్థాయిలో అందుకు భిన్నమైన వాతావరణం  ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 


విడుదల చేయాలి...

రాష్ట్ర వ్యాప్తంగా పోలీ్‌సస్టేషన్లలో ఉన్న సీపీఎస్‌ ఉద్యోగులను విడుదల చేయాలని, కేసులను ఎత్తివేయాలని డీజీపీని కోరినట్లు ఉద్యమ సంఘాలైన ఏపీసీపీఎ్‌సయూఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం దాస్‌, ఏపీసీపీఎ్‌సఈఏ రాష్ట్ర అధ్యక్షుడు రోంగల అప్పల్రాజు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నప్పటికీ రాష్ట్రంలో సీపీఎస్‌ ఉద్యోగుల అరెస్టులు ఆగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.  సీపీఎస్‌ ఉద్యోగులను  బైండోవర్లు చేసి పోలీసు స్టేషన్లకు తీసుకెళ్లడం మానుకోవాలని రోంగల అప్పల్రాజు కోరారు.


‘‘చలో విజయవాడను సెప్టెంబరు 1వ తేదీన నిర్వహించాలనేది ఈ రోజున తీసుకున్న నిర్ణయం కాదు. మూడు నెలల కిందటే మేము పిలుపు ఇచ్చాం. సెప్టెంబరు 1 అనేది సీపీఎస్‌ ఉద్యోగుల బ్లాక్‌ డే. ఆ రోజున సమావేశాలు నిర్వహించుకున్నాం. ఆ క్రమంలోనే చలో విజయవాడకు మేం పోలీసుల అనుమతుల కోసం దరఖాస్తు చేశాం. అయితే, కొంతమంది వేరే పిలుపునిచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరించడంతో కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. అయినప్పటికీ సీపీఎస్‌ ఉద్యోగుల మీద నిర్బంధాలు ఆగటం లేదు. బైండోవర్‌ కేసులు ఉపసంహరించి నిర్బంధంలో ఉన్న వారిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాం’’ అన్నారు. 


రేపు కలెక్టరేట్ల వద్ద నిరసనలు : బండి శ్రీనివాసరావు

సీపీఎస్‌ రాష్ట్రంలో మొదలైన సెప్టెంబరు 1ని విద్రోహదినంగా పాటిస్తున్నట్టు ఏపీజేఏసీ చైర్మన్‌, సెక్రటరీ జనరల్‌ బండి శ్రీనివాసరావు, జి హృదయరాజులు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆ రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లను కోరారు. సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ రద్దుకు వివిధ రూపాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై పోలీసుల నిర్భందం తగదని, కేసులు ఎత్తివేసి, సీపీఎస్‌ ఉద్యోగులను సతాయించడం మానుకోవాలని డిమాండ్‌ చేశారు. 


‘చలో’కు మళ్లీ సన్నాహాలు

విజయవాడ సీపీకి ఉద్యమనేతల ఫోన్లు 

సీపీఎస్‌ సమస్యలపై వాయిదాపడిన సెప్టెంబరు 1 నిరసన కార్యక్రమాలను సెప్టెంబరు 11న నిర్వహించేందుకు ఏపీసీపీఎ్‌సఈఏ అగ్ర నాయకత్వం సిద్ధమవుతోంది. వినాయక చవితి తర్వాత విజయవాడ పోలీసులను కలిసి ఆ రోజున ధర్నాచౌక్‌లో బహిరంగ సభ జరుపుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరనుంది. ఈ మేరకు మంగళవారం విజయవాడ పోలీసు ఉన్నతాధికారులతో ఏపీసీపీఎ్‌సఈఏ అగ్రనేతలు ఫోన్‌లో మాట్లాడారు. కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహిస్తామని, శాంతిభద్రతల పూర్తి బాధ్యత తాము తీసుకుంటామని మౌఖికంగా హామీ ఇచ్చారు. చలో విజయవాడను తాత్కాలికంగా వాయిదా వేసిన నేపథ్యంలో, సీపీఎస్‌ ఉద్యోగులపై నోటీసులు, బైండోవర్ల పరంపరను తక్షణం నిలిపివేయాల్సిందిగా డీజీపీ కార్యాలయాన్ని లేఖ రూపంలో ఏపీసీపీఎ్‌సఈఏ అగ్రనేతలు కోరారు. 

Updated Date - 2022-08-31T07:59:34+05:30 IST