అది భూ కబ్జాదారుల గర్జన: అనిత

ABN , First Publish Date - 2022-10-14T08:01:07+05:30 IST

వైసీపీ విశాఖలో నిర్వహిస్తోంది ప్రజా గర్జన కాదు. భూ కబ్జాదారుల గర్జన. విశాఖలో అయినకాడికి భూములను దోచుకొన్న బడాబాబుల బల ప్రదర్శన.

అది భూ కబ్జాదారుల గర్జన: అనిత

‘‘వైసీపీ విశాఖలో నిర్వహిస్తోంది ప్రజా గర్జన కాదు. భూ కబ్జాదారుల గర్జన. విశాఖలో అయినకాడికి భూములను దోచుకొన్న బడాబాబుల బల ప్రదర్శన. తమ దోపిడీని ప్రజలు ఛీ కొట్టకుండా రాజధాని ముసుగు వేసి వారిని మభ్యపెట్టడానికి చేస్తున్న నాటక ప్రదర్శన’’ అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. విశాఖలో రోజుకు ఒకటి చొప్పున బయటకు వస్తున్న భూ కుంభకోణాలు, వైసీపీ పెద్దల మహా మాయలు చూసి రాష్ట్రం మొత్తం నివ్వెరపోతోందన్నారు. విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ అపూర్వ సహోదరులని, వీరిద్దరినీ ఆదర్శంగా తీసుకొని వైసీపీ నేతలు మరి కొంతమంది వేల ఎకరాలు లాగించారని ఆరోపించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడటానికి, రైల్వే జోన్‌ సాధించడానికి ఇటువంటి గర్జనలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అమరావతి రైతులపై ఒక కర్ర లేపితే తాము వంద కర్రలు లేపుతామని హెచ్చరించారు. 


భూ కుంభకోణాలపై హైకోర్టు జడ్జితో విచారణ: బొండా

‘‘విశాఖ నగరం, దాని చుట్టుపక్కల భారీగా చోటు చేసుకొంటున్న భూ కుంభకోణాలపై విచారణ జరపడానికి సీఎం ఎందుకు భయపడుతున్నారు? వైసీపీ ఎంపీలు ఒకరితో ఒకరు పోటీపడి ఆస్తులు కబ్జాలు పెడుతున్నారని వెలుగులోకి వస్తున్నా సీఎం కిక్కురుమనడం లేదు. ఉత్తరాంధ్రపై మాటల్లో ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తున్న జగన్‌రెడ్డికి అక్కడ రూ.వేల కోట్లలో జరుగుతున్న భూ దోపిడీని అడ్డుకోవడానికి మాత్రం చేతులు రావడం లేదు’’ అని టీడీపీ విమర్శించింది. సీఎం జగన్‌కి నిజంగా విశాఖ బ్రాండ్‌ ఇమేజిని కాపాడాలని ఉంటే... ఈ భూ దందాలపై హైకోర్టు సిటింగ్‌ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా డిమాండ్‌ చేశారు. 

Read more