టెన్షన్‌.. టెన్షన్‌!

ABN , First Publish Date - 2022-04-10T08:06:50+05:30 IST

మంత్రివర్గ ప్రక్షాళనపై...

టెన్షన్‌.. టెన్షన్‌!

  • కొలిక్కి రాని ‘మంత్రివర్గ’ కూర్పు
  • శనివారం రోజంతా సీఎం జగన్‌ కసరత్తు
  • ఒత్తిళ్లు, అలకలు, బెదిరింపులతో సతమతం
  • ‘ఏకపక్షం’గా నిర్ణయాలు తీసుకోలేని అశక్తత
  • ‘ఉద్వాసన’ తీరుపై సీఎం ముందే అసంతృప్తి
  • ఇలాగైతే రాజకీయాలు చేయలేమన్న ఓ నేత
  • రాజ్‌భవన్‌కు చేరిన రాజీనామాలు, నేడు ఆమోదం
  • నేటి మధ్యాహ్నం కొత్త మంత్రుల జాబితా విడుదల


(అమరావతి - ఆంధ్రజ్యోతి): మంత్రివర్గ ప్రక్షాళనపై... అంతన్నారు, ఇంతన్నారు! అప్పుడన్నారు, ఇప్పుడన్నారు! రెండు నెలలుగా కసరత్తు జరుపుతూనే ఉన్నారు. సోమవారం ఉదయం 11.31 గంటలకే ప్రమాణ స్వీకారం! కానీ... శనివారం సాయంత్రం దాకా మంత్రివర్గ కూర్పుపై ముఖ్యమంత్రి జగన్‌ ‘కసరత్తు’ చేస్తూనే ఉన్నారు. కులాల సమీకరణలు, నాయకత్వ లక్షణాలు, సీనియర్‌ నేతలు  ఎదురు తిరిగితే తలెత్తే పరిణామాల వంటివి బేరీజు వేసుకుంటూనే ఉన్నారు. ఈనెల 7న సీఎం జగన్‌ కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేసి... మంత్రులందరి నుంచి రాజీనామాలు తీసుకున్నారు. ‘మీలో కొందరు సోమవారం మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తారు’ అని తెలిపారు. ‘సీనియర్లకు మళ్లీ చాన్స్‌’ అని సంకేతాలు పంపారు. పాత మంత్రులందరితో రాజీనామాలు చేయించి... కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలన్నది జగన్‌ ప్రణాళిక. కానీ... దాదాపు రెండు రోజులు రాజీనామా పత్రాలను జగన్‌ తనవద్దే పెట్టుకున్నారు. వాటిని గవర్నర్‌ వద్దకు పంపడంలో డోలాయమానం ప్రదర్శించారు. ఎట్టకేలకు... శనివారం రాత్రి 7.30గంటల సమయంలో రాజీనామాల ఫైలు రాజ్‌భవన్‌కు చేరింది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో మంత్రుల రాజీనామాలను గవర్నర్‌ ఆమోదిస్తారని తెలుస్తోంది.


కదలని కులాల లెక్కలు

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై జగన్‌ వేస్తున్న కులాల లెక్కలు ముందుకు కదలడం లేదని తెలుస్తోంది. ఎవరిని విస్మరిస్తే ఏం జరుగుతుందో, ఎలాంటి విమర్శలు ఎదురవుతాయో అనే ఆందోళన కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. శనివారం రోజంతా మంత్రివర్గ కూర్పుపై జగన్‌ కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఇది ఆదివారం నాటికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. తర్వాత మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న నేతలకు జగన్‌ స్వయంగా ఫోన్‌ చేస్తారు. ఆపై మంత్రివర్గ జాబితాను అధికారికంగా వెల్లడిస్తారు. ప్రమాణ స్వీకారానికి ఒకరోజు ముందు వరకూ జగన్‌ ఎవరిని మంత్రులుగా నియమించాలన్న అంశంపైనే మల్లగుల్లాలు పడాల్సి వస్తోంది. రాజకీయంగా పరిస్థితులు ఎంత సంక్లిష్టంగా మారాయో చెప్పేందుకు ఇది నిదర్శనమని అధికారపక్ష నేతలు అంటున్నారు. గతంలో జగన్‌ ఏకపక్షంగా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా... శిరోధార్యంగా భావించే నేతలు ఇప్పుడు నేరుగా ఆయనముందే అసంతృప్తి స్వరం వినిపిస్తున్నారని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. 


చిత్తూరు జిల్లాకు చెందిన ఒక సీనియర్‌ నేత కుమారుడు శనివారం తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలిశారు. ‘తొలగింపు’లకు సంబంధించిన నిర్ణయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘‘మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలనుకుంటే.. అందరినీ కొత్త వారితో నింపేయండి. లేదంటే.. పాతవారిలో కీలక నేతలను కొనసాగించండి. నలుగురిని ఉంచుతాం, నలుగురిని తీసేస్తామంటే కుదరదు. ఇలాగైతే రాజకీయాలు చేయలేం’’ అని ఆయన సూటిగా చెప్పినట్లు చర్చ జరుగుతోంది. పాత, కొత్తల కలయికతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని వైసీపీ కీలక నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ‘‘బీసీలకు ప్రాధాన్యం ఉంటుంది. మహిళలకు సముచిత స్థానం లభిస్తుంది. ఆదివారం మధ్యాహ్నం తర్వాత కొత్త మంత్రుల జాబితా వెలువడుతుంది. జాబితా ఖరారయ్యాక వారికి ముఖ్యమంత్రి జగన్‌ ఫోన్లు చేస్తారు’’ అని సజ్జల తెలిపారు. 


జోరుగా ఏర్పాట్లు...

సోమవారం ఉదయం 11.31 గంటలకు సచివాలయంలోని రెండో బ్లాకుకు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. జీఏడీ ప్రొటోకాల్‌ అధికారులు ఆహ్వానితులకు పాసులనూ సిద్ధం చేశారు. సీటింగ్‌ ఏర్పాట్లతో సహా .. ఇతర ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నారు. 

Updated Date - 2022-04-10T08:06:50+05:30 IST