జగన్‌.. పిరికి ఫ్యాక్షనిస్టు

ABN , First Publish Date - 2022-08-31T08:06:35+05:30 IST

‘జగన్‌ ఓ పిరికి ఫ్యాక్షనిస్టు. మా కార్యకర్త ఓ ట్వీటు పెడితే వందలాది మంది పోలీసుల్ని పంపిస్తాడు. ఓ టీడీపీ నాయకుడు ప్రెస్‌మీట్‌ పెడితే అతడి ఇల్లు ధ్వంసం చేసేందుకు వాళ్ల కుక్కల్ని పంపిస్తాడు’ అని టీడీపీ జాతీయ ప్రధాన

జగన్‌.. పిరికి ఫ్యాక్షనిస్టు

ట్వీట్‌ పెడితే వందల మంది పోలీసులు: లోకేశ్‌

ప్రెస్‌మీట్‌ పెడితే ఇల్లు ధ్వంసానికి కుక్కల్ని పంపుతాడు

60 మంది నేతలపై దొంగ కేసులు.. 5 వేల మంది 

కార్యకర్తలపైనా.. అయినా భయపడేది లేదు

మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే

ఎలా బతకాలనుకుంటున్నావ్‌ జగన్‌రెడ్డీ

ఐపీఎస్‌ అయినా వదిలిపెట్టం.. దాక్కున్నా లాక్కొస్తాం

చిత్తూరు జైలులో టీడీపీ నాయకులకు లోకేశ్‌ పరామర్శ


చిత్తూరు, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ‘జగన్‌ ఓ పిరికి ఫ్యాక్షనిస్టు. మా కార్యకర్త ఓ ట్వీటు పెడితే వందలాది మంది పోలీసుల్ని పంపిస్తాడు. ఓ టీడీపీ నాయకుడు ప్రెస్‌మీట్‌ పెడితే అతడి ఇల్లు ధ్వంసం చేసేందుకు వాళ్ల కుక్కల్ని పంపిస్తాడు’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ దుయ్యబట్టారు. ఇటీవల కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సమయంలో సుమారు 60 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టగా.. ఆరుగురు చిత్తూరు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నారు. అలాగే పూతలపట్టు మండలం వేపనపల్లెలో ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబును నిలదీసిన ఓ యువకుడిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసిన ఘటనలో అతడికి మద్దతుగా నిలిచిన టీడీపీ నాయకులపై కేసులు పెట్టారు. వారిలో పది మంది ఇదే జైలులో ఉన్నారు. వీరందరినీ మంగళవారం అక్కడ లోకేశ్‌ పరామర్శించారు.


ఆయనతోపాటు ఎమ్మెల్సీ దొరబాబు, హోంశాఖ మాజీ మంత్రి చినరాజప్పను మాత్రమే జైలు అధికారులు లోపలకు అనుమతిచ్చారు. అనంతరం జైలు బయట లోకేశ్‌ మీడియాతో మాట్లాడారు. వేపనపల్లె వెళ్లి అక్రమ కేసులకు భయపడొద్దని బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. జగన్‌ లాంటి ఫ్యాక్షనిస్టు సీఎం అయితే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో, రాష్ట్రానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లుతోందో 2019 ఎన్నికల ముందు చంద్రబాబు పదే పదే చెప్పారని లోకేశ్‌ గుర్తుచేశారు. జగన్‌కు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదన్నారు. రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాజ్యాంగం అమలు కావడం లేదని.. మైన్లు కొట్టేయడానికి మనుషుల్ని చంపేసిన జగన్‌ తాత రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. ఇంకా ఏమన్నారంటే..


బ్రదర్‌ జగన్‌రెడ్డీ.. 

ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తే, అక్కడ అన్నక్యాంటీన్‌ను ప్రారంభించాలనుకుంటే వైసీపీ కుక్కల్ని పంపించి ఇబ్బందులు పెట్టారు. 60 మంది టీడీపీ నాయకులపైన, 5 వేల మంది కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టారు. అయినా భయం మా బయోడేటాలో లేదు బ్రదర్‌ జగన్‌రెడ్డీ.


మళ్లీ అధికారంలోకి వచ్చేది టీడీపీయే. ఎలా బతకాలనుకుంటున్నావ్‌? నువ్వు ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసినప్పుడు నాలుగు రోప్‌ పార్టీలతోపాటు భద్రత ఏర్పాటు చేసింది మా నాయకుడే కదా! మరి ఇప్పుడు ఎందుకంత భయపడుతున్నావు? మా ఓపికను పరీక్షించొద్దు. యుద్ధానికి మేం సిద్ధం. పోలీసులు ఐపీసీకి బదులు జగన్‌ పీనల్‌ కోడ్‌ (జేపీసీ) అమలు చేస్తున్నారు. వైసీపీ కుక్కలు మమ్మల్ని కరిచినా, మా తలలు పగలగొట్టినా పోలీసులు మా వాళ్ల మీదే హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. తిరిగి అధికారంలోకి వచ్చేది మేమే. మీరు రాష్ట్రం వదిలిపోలేరు. చట్టాన్ని ఉల్లంఘించిన ఏ అధికారి అయినా, చివరికి ఐపీఎస్‌ అధికారి అయినా వదిలిపెట్టం. దాక్కున్నా లాక్కొస్తాం. పోలీసులు జీవితాంతం కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. వారి మీద ప్రైవేటు కేసులు బనాయిస్తాం. ఆధారాలుంటే వాళ్లను సర్వీసు నుంచి డిస్మిస్‌ కూడా చేస్తాం.
అన్నం పెట్టడు.. పెట్టనివ్వడు..

జగన్‌ అధికారంలోకి వచ్చాక 210 అన్న క్యాంటీన్లను ఒక్కసారిగా మూతేశారు. సొంత చెల్లికి, తల్లికి అన్నం పెట్టలేనివాడు, మెడ పట్టి బయటకు గెంటేసినవాడు.. రాష్ట్ర ప్రజలకు ఎలా అన్నం పెట్టగలడు? మంగళగిరిలో నేను అన్న క్యాంటీన్‌ ప్రారంభిస్తే, 60 మంది కార్యకర్తల్ని అర్ధరాత్రి అరెస్టు చేశారు. కుప్పంలో మంగళవారం ఉదయం క్యాంటీన్‌ను మళ్లీ ధ్వంసం చేశారు. కుప్పం పర్యటనలో చంద్రబాబుకు భద్రత లేదు. ఎస్పీ ఏంచేస్తున్నాడు..? గాడిదలు కాస్తున్నాడా? వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ ఇంటికెళ్లి టీ తాగుతాడు. మంత్రి, ఆయన కొడుకు ఎంపీ కలిసి ఎస్పీ ఇంట్లో భోజనం చేస్తారు. రహస్య మంతనాలు ఉంటాయా? లేదా డబ్బులు మారుతున్నాయా..? నేరుగా ఎస్పీనే అడుగుతున్నా. కేవలం ఆయన చేతగానితనం వల్ల కుప్పం చంద్రబాబు పర్యటనలో వైసీపీ కుక్కలు రెచ్చిపోయాయి.

Read more