జగన్ ఫైర్ కాదు ఫ్లవర్... : TDP ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2022-03-16T17:16:00+05:30 IST

జంగారెడ్డిగూడెం ఘటనకు సంబంధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

జగన్ ఫైర్ కాదు ఫ్లవర్... : TDP ఎమ్మెల్యేలు

అమరావతి: జంగారెడ్డిగూడెం ఘటనకు సంబంధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ... జగన్ రెడ్డి ఫైర్ కాదు ఫ్లవర్ అని ప్రజలకు అర్థమైపోయిందన్నారు. కల్తీసారా మరణాలపై నిలదీస్తే వరుసగా మూడు రోజులు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని మండిపడ్డారు. కల్తీసారా తయారీలో వైసీపీ నేతల పాత్ర ఉన్నందుకే సభలో సీఎం తప్పుడు ప్రకటనలు చేశారన్నారు. జంగారెడ్డి గూడెంలో కల్తీసారా లేదని సీఎం చెప్తే, ఉందని ఆర్డీవో, ఎస్సీబీ, పోలీసులు నిరూపించారని తెలిపారు. 27 మంది అమాయకుల చావుకు ముఖ్యమంత్రే కారణమని వ్యాఖ్యలు చేశారు. కల్తీసారాపై నమోదైన ఎఫ్ఐఆర్‌లకు సంబంధించి సీఎం జగన్ ఏం సమాధానం చెప్తారని అనగాని ప్రశ్నించారు. 


 విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ... 27 మంది కల్తీసారాతో చనిపోతే, సభలో సీఎం సహజ మరణాలంటూ అతివినయం ప్రదర్శించారని విమర్శలు గుప్పించారు. సభలో సీఎం అసత్యాలు చెప్పినందుకు ఆయనపై సభాహక్కుల నోటీసు ఇచ్చామని తెలిపారు. అబద్ధాలు చెప్పిన సీఎంపై స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. 


ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ... కల్తీసారాపై సమాధానం చెప్పలేకే భయపడి మమ్మల్ని రోజూ సస్పెండ్ చేస్తున్నారని తెలిపారు. అధికారికంగా నాటుసారా కేసులు నమోదవుతున్న సాక్ష్యాలు ఉంటే,  ముఖ్యమంత్రి ఎలా అసత్యాలు చెప్తున్నారని నిలదీశారు. మత్తు కోసం వివిధ రసాయినాలు నాటుసారాలో వాడబట్టే అవయువాలు త్వరగా దెబ్బతిని చనిపోతున్నారని తెలిపారు. 


ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ మాట్లాడుతూ.. అసెంబ్లీ గౌరవ సభ కాదు కౌరవ సభ అని మరోసారి రుజువైందని వ్యాఖ్యలు చేశారు. రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతున్నా సభను తప్పుదోవ పట్టించిన సీఎంకు సస్పెన్షన్ ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. 


రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాట్లాడుతూ... ఆడబిడ్డలకు న్యాయం చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి వారి పుస్తెళ్ళు తెంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్ కంటే ముందు వస్తానన్న జగన్ గత 3 ఏళ్లలో ఏ ఒక్క మహిళకు న్యాయం చేయలేదన్నారు. తమ అవినీతి బయటపడుతుందనే సభలో కాల్తీ సారా అంశం చర్చకు రాకుండా తమను సస్పెండ్ చేస్తున్నారని మండిపడ్డారు. 

Read more