టీడీపీ నాయకుడిపై విప్‌ కాపు దాడి

ABN , First Publish Date - 2022-10-03T09:38:32+05:30 IST

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటి బిల్లులపై నిలదీసిన టీడీపీ నాయకుడిపై ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి చేయి చేసుకున్నారు. పైగా ప్రభుత్వ విప్‌పైనే బాధితుడు దాడికి యత్నించాడంటూ పోలీసులకు రివర్స్‌

టీడీపీ నాయకుడిపై విప్‌ కాపు దాడి

‘గడపగడప’లో ఇంటి బిల్లులు అడగటంపై అసహనం 

కాపుపైనే దాడికి  యత్నించారని రివర్స్‌ ఫిర్యాదు

పోలీసుల అదుపులో బాధితుడు.. పోలీసుస్టేషన్‌కు టీడీపీ శ్రేణులు


గుమ్మఘట్ట, అక్టోబరు 2: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటి బిల్లులపై నిలదీసిన టీడీపీ నాయకుడిపై ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి చేయి చేసుకున్నారు. పైగా ప్రభుత్వ విప్‌పైనే బాధితుడు దాడికి యత్నించాడంటూ పోలీసులకు రివర్స్‌ ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం భైరవాన్‌తిప్ప గ్రామంలో ఆదివారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. గ్రామస్థులు, బాధితుడు మూర్తి తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలో ఆదివారం గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. కాపు రామచంద్రారెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందిస్తూ టీడీపీ నాయకుడు మూర్తి ఇంటికి చేరుకున్నారు.  కరపత్రాన్ని ఆయన చేతిలో పెడుతూ ఫొటో దిగేందుకు ప్రయత్నించగా, నిరాకరించారు. తాను నిర్మించుకున్న ఇంటికి మూడేళ్లుగా బిల్లులు అందలేదని, అవి చెల్లించేలా చూడాలని కోరారు. దీంతో మాజీ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు చేతకానితనం వల్ల ఇప్పుడు తాము అనిపించుకోవాల్సి వస్తోందంటూ రామచంద్రారెడ్డి అసహనం వ్యక్తంచేశారు.


మాజీలను దూషించడం మాని, ప్రస్తుత ఎమ్మెల్యేగా బిల్లులు ఇప్పించాలని మూర్తి డిమాండ్‌ చేయడంతో సహనం కోల్పోయిన రామచంద్రారెడ్డి.. మూర్తిపై చేయి చేసుకున్నారు. తప్పించుకునే క్రమంలో మూర్తి చేతి గోర్లు రామచంద్రారెడ్డికి తగిలాయి. దీంతో ఆయన మరింత రెచ్చిపోయారు. కాగా, రామచంద్రారెడ్డిపై దాడికి యత్నించారంటూ మూర్తిపై వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని, రాయదుర్గం పోలీసుస్టేషన్‌కు తరలించడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా అక్కడికి తరలివెళ్లారు.

Read more