టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-08-31T08:55:15+05:30 IST

పోలీసుల వేధింపుల తాళలేక పల్నాడు జిల్లా గురజాల పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షుడు, బీసీ నేత మహంకాళి రాజు మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానిక వైసీపీ నేతల ఫిర్యాదుతో 4 రోజులుగా రాజును

టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం

పోలీసుల వేధింపులు తాళలేక పురుగుల మందు తాగిన రాజు

గురజాల పోలీస్‌ స్టేషన్‌లో ఘటన

టీడీపీ నేతల ఆందోళన


గురజాలటౌన్‌, ఆగస్టు 30: పోలీసుల వేధింపుల తాళలేక పల్నాడు జిల్లా గురజాల పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షుడు, బీసీ నేత మహంకాళి రాజు మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానిక వైసీపీ నేతల ఫిర్యాదుతో 4 రోజులుగా రాజును విచారణ పేరుతో ప్రతి రోజూ స్టేషన్‌కు తీసుకొచ్చి వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొంటూ.. పోలీ్‌సస్టేషన్‌ ఆవరణలోనే పురుగుమందు తాగారు. దీంతో రాజును స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రాజు ఆత్మహత్యాయత్నం గురించి తెలుసుకున్న టీడీపీ నేతలు పెద్దసంఖ్యలో స్థానిక బ్రహ్మనాయుడు సెంటర్‌కు చేరుకుని ఆందోళన చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ నేతలు ఫిర్యాదులు చేయడం.. టీడీపీ నేతలను  స్టేషన్‌కు పిలిపించి వేధించడం పోలీసులకు పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.   ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో గురజాల డీఎస్పీ మెహర్‌ జయరాం ప్రసాద్‌ ఆందోళనకారులతో చర్చించారు. కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నాయకులు శాంతించారు. ధర్నాలో టీడీపీ మండల కన్వీనర్‌ జమ్మిగుంపుల లక్ష్మీనారాయణ, పట్టణ కన్వీనర్‌ అడపా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 


మూల్యం తప్పదు: యరపతినేని

వైసీపీ నాయకుల సంతోషం కోసం టీడీపీ కార్యకర్తలు, నాయకులను పోలీసులు వేధింపులకు గురిచేస్తే తగిన మూల్యం తప్పదని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. ఇప్పటికైనా పోలీసులు పద్ధతులు మార్చుకుని శాంతి భద్రతలు కాపాడాలని సూచించారు.

Read more