బాదుడు కాదు దంచుడే

ABN , First Publish Date - 2022-04-14T07:56:09+05:30 IST

పన్నులేయడంలో పద్ధతులు మారిపోయాయి. గతంలో ఎప్పుడైనా పన్నులు వేయడం అంటే...అప్పటికే ఉన్న పన్నుల మీద ఎంతో కొంత శాతం పెంచడం అన్నట్లుగా ఉండేది. కానీ..

బాదుడు కాదు దంచుడే

మూడేళ్లుగా వదలకుండా రోకలిపోట్లు..

పన్నులు, చార్జీలు, ధరల్లో కొత్త పద్ధతులు..

గతంలో పెంచితే ఐదు, పదో శాతం

ఒక్కసారీ విద్యుత్‌చార్జీలు పెంచని టీడీపీ..

ఇప్పుడు ఏది పట్టుకున్నా రెట్టింపు పెంపు..

శ్లాబులు మార్చి భారీగా షాక్‌

ఆస్తిపన్ను 15% పెంచి 5000కోట్ల భారం..

ఆర్టీసీ చార్జీలు రెండు సార్లు పెంపు..

సిమెంట్‌, స్టీల్‌ ధరలు ఆకాశంలో

అయినా జీఎస్‌టీపైనే సర్కారుకు దృష్టి..

చెప్పేదొకటి చేసేదొకటిగా జగనన్న పాలన


(అమరావతి, ఆంధ్రజ్యోతి)

పన్నులేయడంలో పద్ధతులు మారిపోయాయి. గతంలో ఎప్పుడైనా పన్నులు వేయడం అంటే...అప్పటికే ఉన్న పన్నుల మీద ఎంతో కొంత శాతం పెంచడం అన్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పాత పద్ధతులు తీసి పక్కనపెట్టేశారు. పెంపులో హద్దులేంటన్నట్లుగా వ్యవహరించారు. ప్రజలు ఇబ్బందులు పడతారేమో, విమర్శలు వస్తాయేమో అన్న కనీస ఆందోళన కూడా లేకుండా కొత్త కొత్త పద్ధతుల్లో పన్నులేసేసే విధానాన్ని తీసుకొచ్చారు. ఉదాహరణకు మద్యం ధరలు పెరిగాయంటే ఎప్పుడైనా ఒక ఐదుశాతం లేకుంటే ఇంకొంత శాతం పెంచడం గత 40ఏళ్లలో చూసిన పరిస్థితి. కానీ జగన్‌ ప్రభుత్వం ఏకంగా 90శాతం వరకు ధరలు పెంచేసింది. ఆస్తి పన్నుల విషయంలోనూ ప్రభుత్వం ఇదే విధానంలో వెళ్లింది. గతంలో ఆస్తి పన్ను పెంచాలంటే...అప్పుడు ఇంటి పన్ను రూ.100ఉంటే...ఒక ఐదుశాతం పెంచి రూ.105చేసేవారు. కానీ ఇప్పుడలా కాదు....ఆ ఇంటివిలువను లెక్కించి దానిపై పన్ను వేయాలనే కొత్త విధానం తీసుకొచ్చారు. ఇంటి విలువను లెక్కించేందుకు రిజిస్ర్టేషన్‌ విలువలను పరిగణనలోకి తీసుకుని...వాటిపై ఆస్తి పన్ను బాదేశారు. అంటే ఈ పన్నులు విపరీతంగా పెంచేసేందుకు ఈ సరికొత్త విలువ ఆధారిత పన్ను తీసుకొచ్చారు. ఇసుక విషయంలోనూ అంతే. గతంలో ఉన్న ఉచిత ఇసుక విధానం కంటే మరింత మంచి పద్ధతి తీసుకొస్తామని ఎన్నికల ముందు ఊదరకొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక...ఉచిత ఇసుకను తీసేసి....ఇసుకపై కూడా మోయలేనంత భారం మోపేశారు. ఉచిత ఇసుక తీసేసి...టన్ను రూ.475 చేశారు. ఆ తర్వాత స్టాక్‌పాయింట్లని పెట్టి దాన్ని రూ.675కు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఒక ప్రైవేటు సంస్థకు మొత్తం ఇసుకను గంపగుత్తగా అమ్ముకునేందుకు ఇచ్చేశారు. ఏ సందర్భంలో చూసుకున్నా గతం కంటే ఏకంగా నాలుగైదు రెట్ల ధరల భారాన్ని ప్రజలపై పడేశారు. ఇవేకాదు...విద్యుత్‌ చార్జీలు, ఆర్టీసీ బస్సు చార్జీలు, రిజిస్ర్టేషన్‌ చార్జీలు, వాహన రిజిస్ర్టేషన్‌ చార్జీలు, సహజ గ్యాస్‌ ధరలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, వృత్తి పన్ను, ఆఖరికి చెత్తపన్ను...ఇలా ఏదీ వదలకుండా బాదిపడేసింది. బాదుడే బాదుడు అనే స్థాయిని మించి దంచుడు స్థాయికి పన్నుల దెబ్బల్ని తీసుకెళ్లిపోయింది. సిమెంటు, స్టీల్‌లాంటి వస్తువుల ధరలు భారీగా పెరిగిపోతున్నా...అందులోనూ తనకొచ్చే జీఎ్‌సటీ పెరుగుతుందని అనుకుంది తప్ప నియంత్రించలేదు.

మద్యం రెట్టింపు.. ఇసుక నాలుగింతలు..

ప్రతిపక్షంలో ఉండగా జగన్‌ తాను చేసిన పాదయాత్రలో ఎక్కడికెళ్లినా ఒక ఊకదంపుడు అంశాన్ని చెప్పేశారు. పన్నుల పెంపుమీద, ధరల పెరుగుదల మీద ‘బాదుడే బాదుడు...’ అంటూ ఒక సెటేర్‌ వేసేవారు. ‘‘కరెంటు చార్జీలు తీసుకుంటే బాదుడే బాదుడు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తీసుకుంటే బాదుడే బాదుడు. ఇంటిపన్నులు తీసుకుంటే బాదుడే బాదుడు. ఆర్టీసీ చార్జీలు తీసుకుంటే బాదుడే బాదుడు... చివరకు నీటి పన్ను తీసుకున్నా బాదుడే బాదుడు. పొరపాటున ఈ పెద్దమనిషి చంద్రబాబుకి మళ్లీ ఓటేస్తే బాదుడే బాదుడు’’...అని ఎన్నికలకు ముందు అనేక సభల్లో జగన్‌రెడ్డి విమర్శించారు. వాస్తవానికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా విద్యుత్‌ ధరలను పెంచలేదు. అయినా అవీ, ఇవీ అని లేకుండా అన్నింటిపైనా బాదుడే...బాదుడు అంటూ చెవులు హోరెత్తేలా ప్రచారం చేశారు. కానీ తీరా అధికారంలోకి వచ్చాక చేసిందేంటి? గత ప్రభుత్వ హయాంలో పెంచని విద్యుత్‌ చార్జీలను శ్లాబ్‌లలో మార్పులు చేసి పెంచేశారు. దాదాపు రూ.1500కోట్ల భారాన్ని ప్రజలపై మోపారు. మద్యం ధరలను విపరీతంగా పెంచడం ద్వారా పేదలు, కార్మికవర్గంపై రూ.9వేల కోట్ల భారం మోపారు. ఆస్తి విలువ ఆధారంగా ఇంటిపన్ను, ఆస్తి పన్నులను వేయడం ద్వారా రూ.4వేల కోట్లకు పైనే ప్రజలపై భారాలు వేశారు. మున్సిపాలిటీల్లో డ్రైనేజీ, నీటి పన్ను ఏటా 5శాతం పెంచి...రూ.2వేల కోట్ల భారం వేశారు. ఆర్టీసీ చార్జీలను వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండుసార్లు పెంచారు. మొదటిసారి పెంచినప్పుడు పల్లె వెలుగు బస్సులపై కిలోమీటరుకు 10పైసలు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు 20పైసలు, అదేవిధంగా విజయవాడ-హైదరాబాద్‌, విజయవాడ-విశాఖపట్నం... ఇలా దూరప్రాంతాలకు వెళ్లే బస్సు చార్జీలు 10నుంచి 25శాతం వరకూ పెంచారు. ఫలితంగా సామాన్య ప్రయాణికులపై సుమారు రూ.900కోట్ల భారం పడింది. మళ్లీ ఇప్పుడు తాజాగా పెట్రోల్‌, డీజిల్‌ సెస్‌ పేరుతో రూ.720కోట్లు ప్రజల జేబులకు చిల్లులు పెట్టేశారు. ఉచిత ఇసుకను తీసేసి ఇసుకను అమ్మడం మొదలుపెట్టిన ప్రభుత్వం తద్వారా ప్రజలపై రూ.5 వేల కోట్ల మేర భారం పడేలా చేసిందని అంచనా. భూములు, ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, స్థలాల రిజిస్ర్టేషన్‌ విలువలను రెండుసార్లు పెంచింది. ఈ పెంపుతో రూ. 800 కోట్ల మేర ప్రజలపై భారం పడింది. తాజాగా కొ త్త జిల్లాల్లో మళ్లీ రిజిస్ర్టేషన్‌ ధరలను పెంచింది. 15 నుంచి 75శాతం వరకు పెంచేసిన ఈ చార్జీల వల్ల మరో రూ.700కోట్ల మేర ప్రజలు జేబులకు చిల్లు పడినట్లే. మరోవైపు పెట్రోల్‌ , డీజిల్‌లపై అదనపు సెస్‌లు విధించడం ద్వారా రూ.1000కోట్లు ప్రజలనుంచి లాగేశారు. పరిశ్రమలకు ఎనర్జీ డ్యూటీ ఆరు పైసల నుంచి రూపాయికి పెంచడం ద్వారా.. ఆ రంగంపై రూ.2వేల కోటపైనే భారం మోపారు. మరోవైపు సిమెంటు, స్టీల్‌, నిత్యావసర ధరలు కూడా ఽపెరిగిపోయాయి.  ఉదాహరణకు 2019నాటికి సిమెంటు ధర బస్తాకు రూ.260 ఉంటే ఇప్పుడది రూ.400ల వరకు కూడా వెళ్లింది. అదేవిధంగా స్టీల్‌ ధర టన్ను రూ.45 వేలుంటే ఇప్పుడు ఏకంగా రూ.80 వేలకు చేరిపోయింది. దీనివల్ల ఎన్నివేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం పడిందో అంచనా వేయడం కూడా కష్టమైన పనే!

చెత్తనూ వదల్లేదు..

వైసీపీ ప్రభుత్వం వచ్చాక రేషన్‌ దుకాణాల ద్వారా పేదలకు ఇచ్చే కందిపప్పు, పంచదారలనూ వదల్లేదు. కందిపప్పుపై కిలోకు రూ.27, పంచదారపై కిలోకు రూ. 10 పెంచేశారు. తద్వారా ప్రజలపై ప్రతి నెల రూ. 747కోట్ల భారం వేసింది. మరోవైపు సహజ వాయువు ధరను 10శాతం పెంచింది. చివరకు రైతులపై విధించే నీటితీరువాని రెట్టింపు చేసింది. చివరకు చెత్తమీద కూ డా పన్నువేసింది. ఇంటికి రూ.120, రెస్టారెంట్లకు రూ. 1,000, షాపింగ్‌మాల్స్‌, లాడ్జీలకు రూ.2000, ఫంక్షన్‌ హాల్స్‌కు రూ.15000ల చొప్పున చెత్తపన్ను విధించింది. Read more