లక్ష్యం చేరని సాగు

ABN , First Publish Date - 2022-10-01T10:01:13+05:30 IST

‘‘గత రెండేళ్లుగా పంట ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది కూడా బాగా వస్తుంది’’ ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలు ఇవి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ ముగింపు దశకు వచ్చినా.. పత్తి, మిర్చి మినహా ఇతర పంటలేవీ పూర్తి స్థాయిలో సాగులోకి రాలేదు. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగానే కురిసినా..

లక్ష్యం చేరని సాగు

ఖరీఫ్‌ సీజన్‌లో పంటలు తగ్గుముఖం

9 లక్షల ఎకరాల్లో పడని విత్తనం

సాధారణ విస్తీర్ణం కంటే 10-15ు తక్కువ

4.40 లక్షల ఎకరాల్లో నాట్లు వేయని వైనం

పత్తి, మిర్చి మినహా ఇతర పంటలదీ అదేతీరు


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

‘‘గత రెండేళ్లుగా పంట ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది కూడా బాగా వస్తుంది’’ ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలు ఇవి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ ముగింపు దశకు వచ్చినా.. పత్తి, మిర్చి మినహా ఇతర పంటలేవీ పూర్తి స్థాయిలో సాగులోకి రాలేదు. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగానే కురిసినా.. సాధారణ విస్తీర్ణం కంటే 10-15ు తక్కువగా పంటలు వేశారు. ఖరీ్‌ఫలో పంటలన్నీ కలిపి 96.42 లక్షల ఎకరాల్లో సాగవుతాయన్నది ప్రభుత్వ అంచనా. ఇప్పటికే 92.05 లక్షల ఎకరాలు సాగులోకి రావాల్సి ఉంది. కానీ 82.82 లక్షల ఎకరాలే (90ు) సాగులోకి వచ్చాయి. మరో 15 రోజుల్లో రబీ సీజన్‌ వస్తున్న పక్షంలో దాదాపు 9 లక్షల ఎకరాల్లో ఇంకా విత్తనమే పడలేదు. నిరుడు ఇదే సమయానికి 83.03 లక్షల ఎకరాల్లో పంటలు సాగులో ఉన్నాయి. గతేడాదితో పోల్చినా సాగు కాస్త తక్కువగానే ఉంది. వరి నాట్లు, చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజల సాగుకు తరుణం మించిపోయింది. నైరుతి రుతుపవనాల తిరోగమనం మొదలై, సెప్టెంబరు నెల ముగియడంతో నూరుశాతం పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది ముందస్తుగా సాగునీరు విడుదల చేసినా.. ఇప్పటికీ 100ు వరి నాట్లు పడలేదు. 40.75 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.


ఇప్పటికే 38.97లక్షల ఎకరాల్లో వరి సాగులోకి రావాల్సి ఉంది. కానీ 34.57లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. 4.40లక్షల ఎకరాల్లో నాట్లే పడలేదు. కోనసీమ జిల్లాలో లక్షా88 వేల ఎకరాల్లో వరిసాగు కావాల్సి ఉండగా, లక్షా 44 వేల ఎకరాల్లోనే నాట్లు వేశారు. అక్కడ కొంతమంది రైతులు పంట విరామం పాటించడం వల్ల సాగు తగ్గినట్లు తెలుస్తోంది. అలాగే గోదావరి, కృష్ణా డెల్టాలతో పాటు పెన్నా, నాగార్జునసాగర్‌, వంశధార, నాగావళి పరిధిలో వరి సాగు కాస్త తగ్గింది. 


సీమ జిల్లాలోనూ తగ్గిన సాగు 

రాయలసీమలో అధికంగా సాగయ్యే చిరుధాన్యాల పంటల సాగు 15% పైగా తగ్గింది. జొన్న, సజ్జ, రాగి, మొక్కజొన్న, ఇతర పంటలు కలిపి 5.27 లక్షల ఎకరాల్లో తృణ, చిరుధాన్యాల సాగు లక్ష్యంగా వ్యవసాయ శాఖ నిర్ధేశించింది. ఈ పాటికే 4.87 లక్షల ఎకరాల్లో విత్తనం పడాల్సి ఉంది. కానీ 4.15 లక్షల ఎకరాల్లోనే విత్తనం వేశారు. కంది, మినుము, పెసర, ఉలవ పంటలు కూడా తగ్గాయి. అపరాల పంటల లక్షం 8.87 లక్షల ఎకరాలు కాగా... ఇప్పటికే 7.77 లక్షల ఎకరాల్లో విత్తనం వేయాల్సి ఉంది. కానీ 6.22 లక్షల ఎకరాల్లోనే సాగువుతున్నాయి. నూనెగింజల పంటలన్నీ కలిపి 19.32లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం కాగా... ఇప్పటికే 17.95 లక్షల ఎకరాల్లో విత్తనం పడాల్సి ఉంది. ప్రస్తుతానికి 15.02లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. ఇందులో వేరుశనగ 16.85 లక్షల ఎకరాలకు గాను 13.25 లక్షల ఎకరాల్లోనే వేశారు. సీమ జిల్లాల్లో వేరుశనగ సాగు 60-80% మధ్యే ఉంది. 


మిల్లెట్స్‌ బోర్డు ఏమైందో?

చిరుధాన్యాలు, తృణధాన్యాల సాగును పెంచేందుకు ప్రస్తుత ప్రభుత్వం మిల్లెట్స్‌ బోర్డును ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవోలు కాగితాలకే పరిమితమయ్యాయి. రెండేళ్ల క్రితమే చిరుధాన్యాలు, కాయధాన్యాల బోర్డులు ఏర్పాటు చేసింది. చిరుధాన్యాలు, తృణధాన్యాలు సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలిస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. వరి, సుబాబుల్‌ వంటి పంటలకు ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలను ప్రోత్సహించాలని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. అయితే, అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవనే విమర్శలున్నాయి. చిరుధాన్యాల విత్తనాల పంపిణీని పెంచకపోవడం, ఆ పంటల మార్కెటింగ్‌పై అవగాహన కల్పించకపోవడం వల్ల రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. 


కారణాలెన్నెన్నో... 

ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గడానికి పలు కారణాలున్నాయి. పంటల  పెట్టుబడులు బాగా పెరిగాయి. అందుకు తగినట్టుగా గిట్టుబాటు ధరలు లేవు. గతేడాది ప్రభుత్వం పూర్తి స్థాయిలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. కొనుగోలు చేసిన వాటికి సకాలంలో డబ్బులు చెల్లించలేదు. దీనికితోడు డెల్టాలో కాలువల వ్యవస్థ సరిగాలేదు. ఇక మెట్ట ప్రాంతంలో పత్తి, మిర్చి మినహా ఇతర పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. చిరుధాన్యాల పంటలకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహకం లేదు. ఈ ప్రతికూల పరిణామాలు పంటలు సాగుపై ప్రభావం చూపాయి.  

Read more