మహిళలతో మాటామంతీ!

ABN , First Publish Date - 2022-11-03T04:27:36+05:30 IST

ఎన్నికలకు సన్నద్ధమయ్యే క్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా వ్యూహానికి పదును పెడుతోంది.

మహిళలతో మాటామంతీ!

ఈ నెల 14 నుంచి నెలకు 3 లక్షల మందితో భేటీ

టీడీపీ మహిళా విభాగం నిర్ణయం

అమరావతి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలకు సన్నద్ధమయ్యే క్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా వ్యూహానికి పదును పెడుతోంది. నెలకు మూడు లక్షల మంది మహిళలను కలుసుకుని వారితో మాటా మంతీ నిర్వహించే వినూత్న, భారీ కార్యక్రమానికి తెలుగు మహిళ రాష్ట్ర కమిటీ రూపకల్పన చేసింది. దీనికి ‘తెలుగు మహిళ మాటా మంతీ’ అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 14వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత బుధవారమిక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో వెల్లడించారు. టీడీపీ అనుబంధ విభాగం ఇంత మంది ప్రజలను కలుసుకుని వారితో ముఖాముఖీ మాట్లాడే కార్యక్రమం చేపట్టడం ఇదే ప్రఽథమం. దీనిని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహిళా విభాగం ఈ కార్యక్రమానికి లోగోను కూడా రూపొందించి పార్టీ అధినేత చంద్రబాబు చేతులమీదుగా మంగళవారం ఆవిష్కరింపజేసింది కూడా. రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఒకేసారి ఈ మాటా మంతీని ప్రారంభిస్తారు. ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో ఒక్కో నెలలో ఒక అసెంబ్లీ స్థానాన్ని ఎంపిక చేసుకుని.. ఒక్కో వారంలో నాలుగేసి గ్రామాల్లో పర్యటిస్తారు. ఒక్కో గ్రామంలో కనీసం 150 మంది మహిళలను కలుసుకుంటారు. నెలలో సరాసరి 16-30 గ్రామాలను సందర్శించాలని నిర్ణయించారు. ఇందుకోసం తెలుగు మహిళ తరపున 150 బృందాలను ఎంపిక చేస్తున్నారు. సరాసరిన ఒక నెలలో రాష్ట్రమంతా కలిపి కనీసం మూడు లక్షల మంది మహిళలను కలుసుకోవాలని అనిత ఆశిస్తున్నారు. మొదటి నెల పురోగతి చూశాక కార్యక్రమాన్ని మరింత మెరుగుపరచి ఏడాది పాటు నిర్వహిస్తే 50 లక్షల మంది మహిళలను కలుసుకోగలమని అంచనా వేస్తున్నారు.

ఇవీ లక్ష్యాలు..

మాటామంతీ ద్వారా 2-3 రకాల రాజకీయ లక్ష్యాలను సాధించాలని భావిస్తున్నారు. మహిళలను నేరుగా కలిసి మాట్లాడితే వారి సమస్యలు, ప్రస్తుత ప్రభుత్వ పాలనపై వారి మనోగతం, వారి ఆకాంక్షలు, స్థానికంగా పార్టీ పరిస్థితి తదితరాలపై క్షేత్ర స్థాయి సమాచారం తెలుసుకోవచ్చు. ‘ఈసారి ఎన్నికల్లో గెలిస్తే మహిళలకు టీడీపీ ఏం చేస్తుంది.. మహిళలు ఏం కోరుకుంటున్నారన్నది ఈ కార్యక్రమ నిర్వహణ తర్వాత మేమే ఖరారు చేస్తాం. పార్టీ మేనిఫెస్టోలో మహిళల కోసం ఏం పెట్టాలన్నది మా విభాగం తరపున మేమే కసరత్తు చేసి పార్టీకి సూచనలు, సలహాలు ఇస్తాం. మహిళల నుంచి నేరుగా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని పార్టీకి అందిస్తాం’ అని అనిత వివరించారు. ఆమె బుధవారమిక్కడ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తో సమావేశమై కార్యక్రమాన్ని విజయవంతానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

Updated Date - 2022-11-03T04:27:36+05:30 IST
Read more