తీసుకెళ్లి బయటపడేయండి!

ABN , First Publish Date - 2022-09-17T10:18:02+05:30 IST

తీసుకెళ్లి బయటపడేయండి!

తీసుకెళ్లి బయటపడేయండి!

టీడీపీ సభ్యులపై స్పీకర్‌ ఆగ్రహం

జన్మలో మీరు మారరంటూ వ్యాఖ్యలు

బలవంతంగా సభ నుంచి తీసుకెళ్లిన మార్షల్స్‌

పలుమార్లు ధరలపై చర్చకోరిన విపక్ష సభ్యులు

విరామం తర్వాత చూద్దామని స్పీకర్‌ వెల్లడి

చివరకు సస్పెన్షన్‌ కొరడా.. 14 మంది బయటకు

సభలో లేనివారి పేర్లూ ప్రస్తావన.. గందరగోళం మధ్యే బిల్లులకు ఓకే


అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాల రెండోరోజు శుక్రవారం ధరల పెరుగుదలపై చర్చించాలని పట్టుబట్టిన టీడీపీ సభ్యులపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు జన్మలో మారరంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ సభ్యులు.. ధరలపై చర్చ జరగాల్సిందేనని పేర్కొంటూ.. పోడియంను చుట్టుముట్టారు. దీంతో మొత్తం 14 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేశారు. వారు వెళ్లకపోవడంతో.. ‘తీసుకెళ్లి బయట పడేయండి!’ అంటూ.. మార్షల్స్‌ను గద్దించారు. దీంతో రంగంలోకి దిగిన మార్షల్స్‌.. ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. 


ముందు ‘ఉ..’ అని!

శుక్రవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే పెరిగిన ధరల(బాదుడే బాదుడు)పై చర్చకు అనుమతించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని వాయిదా తీర్మానం ఇచ్చారు. స్పీకర్‌ దాన్ని తిరస్కరిస్తూనే.. ప్రశ్నోత్తరాల అనంతర విరామం తర్వాత చూద్దామని హామీ ఇచ్చారు. విరామం అనంతరం సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ ఎమ్మెల్యేలు ధరలపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో స్పీకర్‌ మాట్లాడుతూ.. చర్చకు అనుమతిస్తానని చెప్పలేదని, నిర్ణయం వెల్లడిస్తానన్నానని అన్నా రు. ఆ వెంటనే ధరలపై చర్చను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. పెంచిన ధరలు, పన్నులు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పోడియంపైకి వెళ్లి స్పీకర్‌కు కొద్ది దూరంలో ఉండి ఇసుక ధరలు, విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలు, చెత్త పన్ను తగ్గించాలని నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. అయితే.. ఈ నినాదాల మధ్యే నాలుగు బిల్లులను స్పీకర్‌ పాస్‌ చేశారు. బిల్లులు ఆమోదించిన అనంతరం పారిశ్రామిక రంగంపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. చర్చకు సహకరించాలని స్పీకర్‌ కోరగా.. ధరలపై చర్చ చేపట్టాలని టీడీపీ ఎమ్మెల్యేలు విన్నవించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న శాసనసభా వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి విపక్ష సభ్యుల ఆందోళనకు ఒక శాశ్వత పరిష్కారం ఉండాలని, ప్రతిరోజూ ఇలాగే చేస్తున్నారని అన్నారు. వెంటనే వారిని సస్పెండ్‌ చేయాలని చీఫ్‌ విప్‌ ప్రసాదరాజు తీర్మానం ప్రవేశపెట్టారు. దానికి స్పీకర్‌ ఆమోదం తెలిపారు. ఆ వెంటనే అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవాని, బెందాళం అశోక్‌, బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, గణబాబు, జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్‌, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్‌, అనగాని సత్యప్రసాద్‌, డోలా బాలవీరాంజనేయస్వామిలను సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ టీడీపీ సభ్యులు సభను వీడేందుకు అంగీకరించకపోవడంతో మార్షల్స్‌తో బలవంతంగా వారిని బయటికి పంపేశారు.

టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే పంచాయతీరాజ్‌ చట్టం సవరణ బిల్లు, రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్‌ సవరణ బిల్లు, సివిల్‌ సర్వీసెస్‌ రద్దు బిల్లు, అగ్రికల్చరల్‌ ఉత్పత్తుల బిల్లులు ఈ తరహాలో ఆమోదం పొందాయి. 


లేని సభ్యుల సస్పెన్షన్‌!

టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేసే సమయంలో ప్రభుత్వ పక్షంలో తీవ్ర గందరగోళం కనిపించింది. సభలో లేని సభ్యుల పేర్లను కూడా ప్రస్తావించింది. స్పీకర్‌.. సస్పెండ్‌ చేసిన వారిలో.. నందమూరి బాలకృష్ణ, గద్దె రామ్మోహన్‌ పేర్లను ప్రస్తావించారు. అయితే.. వారు సభలో లేకపోవడంతో.. జాబితాలో వారి పేర్లు లేవని సవరించారు. అసలు సభలో ఎవరు ఉన్నారో కూడా గుర్తించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని టీడీపీ ఎద్దేవా చేసింది.

Updated Date - 2022-09-17T10:18:02+05:30 IST