బయటపడిన బండారం!

ABN , First Publish Date - 2022-09-10T08:30:30+05:30 IST

‘ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత!’ ఇది తరచూ జరిగేదే! హైదరాబాద్‌, చెన్నై తదితర విమానాశ్రయాల్లో బంగారం స్వాధీనం చేసుకోవడం సర్వసాధారణం! కానీ..

బయటపడిన బండారం!

 • బంగారంతో దొరికిన కీలక అధికారి భార్య
 • సీన్‌ కట్‌ చేస్తే ఆ అధికారితో ‘వసూల్‌ రాజా’కు లింకు
 • రిటైర్‌ అయ్యాక ‘వసూల్‌ రాజా’ ద్వారా ఆ అధికారికి పోస్టు
 • మూడుసార్లు దుబాయ్‌కి వెళ్లి వచ్చిన అధికారి సతీమణి
 • ప్రతిసారీ విజయవాడలోనే ఆమె ల్యాండింగ్‌
 • ‘సేఫ్‌ పాసేజ్‌’కు సహకరించిన సిబ్బంది?
 • ఈసారి బంగారంపై దుబాయ్‌ నుంచే సమాచారం
 • హైదరాబాద్‌ నుంచి ప్రత్యేకంగా వచ్చిన  డీఆర్‌ఐ టీమ్‌
 • గన్నవరంలో అదుపులోకి తీసుకున్న అధికారులు
 • సుదీర్ఘంగా కొనసాగుతున్న విచారణ
 • రక్షించేందుకు రంగంలోకి దిగిన వసూల్‌ రాజా!
 • హైదరాబాద్‌, ఢిల్లీ స్థాయిలో డీఆర్‌ఐపై ఒత్తిళ్లు
 • పట్టుకుంది 970 గ్రాములే అని ప్రకటన
 • ఆ మాత్రానికి డీఆర్‌ఐ ఉన్నతాధికారులు వస్తారా?
 • విమానాశ్రయ, విమాన సిబ్బందిపైనా అనుమానాలు


(అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత!’ ఇది తరచూ జరిగేదే! హైదరాబాద్‌, చెన్నై తదితర విమానాశ్రయాల్లో బంగారం స్వాధీనం చేసుకోవడం సర్వసాధారణం! కానీ... ఈసారి విజయవాడ విమానాశ్రయంలో బంగారం దొరికింది. దుబాయ్‌ నుంచి వస్తున్న ఒక మహిళ ‘భారీ’గా బంగారం తీసుకొస్తున్నట్లు సమాచారం అందింది. ఏకంగా హైదరాబాద్‌ నుంచి డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు రంగంలోకి దిగారు. గురువారం రాత్రి విజయవాడ విమానాశ్రయంలో బంగారంతో సహా ఆమెను పట్టుకున్నారు. ఆ తర్వాతే.... అసలు కథ మొదలైంది. ‘నేను ఫలానా. నాకు ఫలానా ఐఏఎ్‌సలు తెలుసు. ఐపీఎస్‌ అధికారులూ తెలుసు’ అని ఆమె టకటకా కొన్ని పేర్లు చెప్పారు. దొరికిన ప్రతివాళ్లూ ఇలా పెద్దల పేర్లు చెప్పడం మామూలే కదా అని డీఆర్‌ఐ అధికారులు భావించారు. కానీ... నిజంగానే ఆమెను రక్షించేందుకు బడాబడా వ్యక్తులు రంగంలోకి దిగారు. కేసును నీరుగార్చేందుకు ఒత్తిళ్లు మొదలుపెట్టారు. ముఖ్యమంత్రికి దగ్గరగా ఉంటూ... మిడిల్‌ కేడర్‌ ఐఏఎ్‌సగా ఉన్నప్పటికీ... మొత్తం పెత్తనం చెలాయిస్తూ, ధనాధన్‌ దందాలతో చెలరేగిపోతున్న ‘వసూల్‌ రాజా’ కూడా నేరుగా రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఆయనతోపాటు మరో ఉన్నతాధికారి కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.


బయటపడిందిలా!

విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం... దుబాయ్‌ నుంచి వస్తూ భారీగా బంగారం తీసుకొచ్చిన ఆ మహిళ పేరు నీరజారాణి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో కీలక విభాగంలో పని చేస్తున్న అధికారి సతీమణి. నిజానికి... ఆయన ఎప్పుడో రిటైర్‌ అయ్యారు. కానీ... ‘వసూల్‌ రాజా’ ఆయనను తీసుకొచ్చి పోస్టు కట్టబెట్టారు. రెండేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత మరోసారి పొడిగింపు ఇచ్చారు. ముఖ్యనేతకు సన్నిహితంగా పనిచేస్తున్న ‘వసూల్‌ రాజా’ దుబాయ్‌ కేంద్రంగా కూడా వ్యాపార లావాదేవీలు మొదలుపెట్టినట్లు ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆయన మనుషులు తరచూ దుబాయ్‌తోపాటు ఇతర గల్ఫ్‌దేశాలకు వెళ్లివస్తున్నారు. అక్కడి నుంచి భారీ మొత్తంలో అక్రమంగా బంగారం తీసుకొస్తున్నట్లు సమాచారం. వారు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో కాకుండా విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టులోనే దిగుతుంటారు. ఎందుకంటే... ఇక్కడ తనిఖీలు తక్కువ. మరోవైపు... వసూల్‌ రాజా తన మనుషులకు అసలు తనిఖీలే జరగకుండా ‘సేఫ్‌ పాసేజ్‌’ కల్పిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. కానీ... ఈసారి కథ అడ్డం తిరిగింది.


నేరుగా ఢిల్లీకే సమాచారం...

నీరజారాణి వద్ద భారీగా బంగారం బిస్కట్లు ఉన్నట్లు దుబాయ్‌ విమానాశ్రయంలోనే అధికారులు గుర్తించారు. ఫలానా విమానంలో, ఫలానా ప్రయాణికురాలి వద్ద బంగారం ఉన్నట్లు ఢిల్లీలోని డీఆర్‌ఐకి సమాచారం పంపించారు. గురువారం సాయంత్రానికి హైదరాబాద్‌ నుంచి డీఆర్‌ఐ అధికారులు, సిబ్బందితో కూడిన బృందం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. దుబాయ్‌ నుంచి దిగిన నీరజారాణి వద్ద బంగారం గుర్తించి... ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నేరుగా హైదరాబాద్‌ నుంచే డీఆర్‌ఐ అధికారులు రావడంతో... ఈసారి ‘సేఫ్‌ పాసేజ్‌’ కుదరలేదు.


ఇంతకీ ఎంత బంగారం?

‘దుబాయ్‌ నుంచి వచ్చిన ఒక మహిళ నుంచి 970 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నాం’ అని డీఆర్‌ఐ ఒక ప్రకటన విడుదల చేసింది. పైనుంచి వచ్చిన ఒత్తిళ్లను భరించలేక కేసు తీవ్రతను తగ్గించేందుకే... పట్టుకున్న బంగారాన్ని బాగా తగ్గించి చూపుతున్నట్లు తెలిసింది. ఎందుకంటే... విజయవాడలో డీఆర్‌ఐ అధికారులున్నప్పటికీ, ఈసారి నేరుగా హైదరాబాద్‌కు చెందిన బృందమే తరలి వచ్చింది. అందులోనూ... జాయింట్‌ డైరెక్టర్‌, అదనపు డైరెక్టర్‌ స్థాయి అధికారులు ఈ బృందానికి నేతృత్వం వహించినట్లు సమాచారం. కేవలం 970 గ్రాముల బంగారం పట్టుకునేందుకు ఇంత హడావుడి అవసరం లేదని చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆమె కోట్ల విలువైన బంగారాన్ని తరలిస్తున్నట్లు తెలిసింది.


ఇది మూడోసారి...

నీరజారాణి ఇప్పటికి మూడుసార్లు దుబాయ్‌కి వెళ్లివచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఆమె విజయవాడలో దిగిన ప్రతిసారీ...  విమానాశ్రయ సిబ్బంది, విమాన సిబ్బంది ‘సేఫ్‌ పాసేజ్‌’కు సహకరించినట్లు తెలిసింది. విమాన సంస్థల్లోని ఉద్యోగులు, అధికారులకు భారీగా తాయిలాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెతోపాటు ఎయిర్‌పోర్టు, విమాన సిబ్బందిని కూడా డీఆర్‌ఐ  ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. విజయవాడలోని డీఆర్‌ఐ కార్యాలయంలో ఈ విచారణ కొనసాగుతోంది. 


భారీగా ఒత్తిళ్లు.... 

నీరజారాణి గన్నవరం విమానాశ్రయంలో బంగారంతో సహా దొరికిపోయినట్లు తెలియగానే వసూల్‌ రాజాతోపాటు మరో ముఖ్య అధికారి రంగంలోకి దిగినట్లు తెలిసింది. ‘పన్ను కట్టించుకుని వదిలేయండి’ అంటూ రాష్ట్ర అధికారిక కేంద్రంతోపాటు హైదరాబాద్‌, ఢిల్లీ నుంచి కూడా డీఆర్‌ఐపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. కిలోలోపు బంగారం పట్టుబడితే పన్ను ఎగవేత కేసుగా పరిగణించి కస్టమ్స్‌ డ్యూటీ కట్టించుకుంటారు. కేసు తీవ్రత అంతగా ఉండదు. అంతకుమించితే... స్మగ్లింగ్‌ కింద బలమైన కేసు పెడతారు. భారీ విలువతో కూడిన అక్రమ రవాణా ఉంటే తప్ప... డీఆర్‌ఐ రంగంలోకి దిగదు. నీరజారాణిని గురువారం రాత్రి నుంచి డీఆర్‌ఐ అధికారులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అంటే... విషయం తేలిగ్గా తీసుకునేది కాదని, భారీ స్థాయిలో బంగారం అక్రమ రవాణా జరిగే ఉంటుందని భావిస్తున్నారు. ఆమెను డీఆర్‌ఐ అధికారులు విచారిస్తుండగా అమరావతిలోని ఓ ప్రభుత్వ వాహనం నుంచి ఆమెకు భోజనాలు వెళ్లినట్టు తెలిసింది. ఆమె డీఆర్‌ఐ అధికారుల అదుపులో ఉండగా... ఆమె భర్త మాత్రం సచివాలయంలో బిజీబిజీగా ఉన్నారు.


విజయవాడకే ఎందుకు...

హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఫ్లైట్‌ కనెక్టివిటీ ఎక్కువ. అదే సమయంలో... తనిఖీలు కూడా ముమ్మరంగానే జరుగుతాయి. అందుకే... బంగారం తరలింపునకు విజయవాడను ఎంచుకున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ‘వసూల్‌ రాజా’ కీలకమైన స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. చెకింగ్‌ సమయంలో ఇబ్బందిరాకుండా అన్నీ చూసుకోవడానికి మనుషులు ఉంటారన్న నమ్మకంతోనే ఈ రూట్‌ను ఎంచుకున్నట్లు తెలిసింది.

Read more