ఏపీకి ఏకైక రాజధాని అమరావతే!: సుజనా చౌదరి

ABN , First Publish Date - 2022-09-19T10:06:41+05:30 IST

: ‘‘ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని అమరావతి మాత్రమే. దానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అలా చేయాలంటే పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలి తప్ప శాసనసభకు ఎలాంటి అధికారం లేదు’’ అని కేంద్ర మాజీమంత్రి, బీజేపీ నేత

ఏపీకి ఏకైక రాజధాని అమరావతే!: సుజనా చౌదరి

ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 18: ‘‘ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని అమరావతి మాత్రమే. దానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అలా చేయాలంటే పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలి తప్ప శాసనసభకు ఎలాంటి అధికారం లేదు’’ అని కేంద్ర మాజీమంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆదివారం ఆయన మాట్లాడారు. ‘‘2014లో అసెంబ్లీలో ఉన్న 175మంది ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలు... పార్టీలకు అతీతంగా అమరావతి రాజఽధానిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ఏదైనా అభ్యంతరం ఉంటే ఆరోజే అసెంబ్లీలో నిలుపుదల చేయాల్సి ఉంటుంది. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు ఆ రోజు అసెంబ్లీలో అమరావతి రాజధానికి అనుకూలంగా ఉన్నామని చెప్పి ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో ఆంధ్రకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. రాజధాని విషయంపై హైకోర్టు తీర్పు ఇచ్చిన ఆరు నెలల తర్వాత ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించడం ఏమిటి? ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగబద్ధంగా ఉంటేనే నిలబడుతుంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించక తప్పదు. సీఎం చెప్పినట్లుగా ఏపీకి 3రాజధానులు ఉండవు.


రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతే ఉంటుంది. మూడు రాజధానుల చట్టం చేయాలంటే పార్లమెంట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు కూడా న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నందున కేంద్రం జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకుండా పోయింది. రోజురోజుకూ అవినీతి పెరిగిపోతుంది. ఈ అవినీతిని అంతం చేసేందుకు ప్రజానీకం తమ ఓటు హక్కును సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. కుటుంబ, ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రానికి, దేశానికి నష్టం తప్ప లాభం లేదు. బీజేపీని రాష్ట్రంలో ఆదరించాలి’’ అని సుజనా కోరారు. 

Updated Date - 2022-09-19T10:06:41+05:30 IST