కొత్త బార్‌ పాలసీని నిలిపేయండి!

ABN , First Publish Date - 2022-07-27T09:04:23+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన బార్‌ పాలసీ -2022, దానికి అనుగుణంగా జారీచేసిన నిబంధనలను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు

కొత్త బార్‌ పాలసీని నిలిపేయండి!

రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించండి

హైకోర్టులో 516 మంది ఓనర్ల పిటిషన్లు

మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న కోర్టు


అమరావతి, జూలై 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన బార్‌ పాలసీ -2022, దానికి అనుగుణంగా జారీచేసిన నిబంధనలను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, ప్రస్తుత దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్‌ పరిశీలించాక తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేసింది. విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది.


యజమానుల వాదన ఇదీ..: రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 17న తీసుకువచ్చిన నూతన బార్‌ పాలసీ-2022తో పాటు దానికి అనుగుణంగా తీసుకొచ్చిన నిబంధనలను సవాల్‌ చేస్తూ దాదాపు 516 మంది బార్‌ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నిబంధనలు పూర్తి ఏకపక్షంగా ఉన్నాయని, చట్ట, రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరారు. నూతన బార్‌ పాలసీకి అనుగుణంగా తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేయాలని అభ్యర్థించారు. బార్‌ లైసెన్సింగ్‌ నిబంధనలు-2017లోని రూల్‌ 15 ప్రకారం పిటిషనర్ల బార్‌ లైసెన్స్‌లను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, ఓ. మనోహర్‌రెడ్డి, ఎం.రవీంద్రనాథ్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘ఏపీ ఎక్సైజ్‌ చట్టం నిబంధనలు-2017 ప్రకారం బార్‌లు నడుపుకొనేందుకు పిటిషనర్లకు ఫామ్‌-2బీ లైసెన్స్‌లు ఇచ్చారు. ఈ ఏడాది జూన్‌ 30న బార్‌ లైసెన్స్‌ల గడువు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో 2నెలలు పొడిగించింది. నూతన బార్‌ పాలసీ దరఖాస్తు ఫీజును 10లక్షలుగా నిర్ణయించారు. నూతన బార్‌ పాలసీ ప్రకారం పట్టణ స్థానిక సంస్థలు, నగరపంచాయితీల పరిధిలో ఎక్కువ కోట్‌ చేసిన వారిని హెచ్‌-1గా నిర్ణయిస్తారు. హెచ్‌-1 గా నిలిచినవారు కోట్‌ చేసిన మొత్తంలో 90ు పైగా కట్టేవారిని అర్హులుగా నిర్ణయించి బార్‌ లైసెన్స్‌లు జారీ చేయబోతున్నారు. ప్రైమ్‌ ఏరియాలో బార్‌ లైసెన్స్‌ పొందినవారిని, నగర-పట్టణ శివారులో బార్‌ లైసెన్స్‌ పొందేవారిని ఒకేగాటిన కట్టడం అన్యాయం’’ అని వివరించారు.  


లాభం లేకపోతే మానేయండి!

ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘మీకు లాభసాటిగా లేకపోతే ధరఖాస్తు చేసుకోవడం మానేయండి? ధరఖాస్తు చేయాలని మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయలేదు కదా?’’ అని పిటిషనర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. మద్యం లైసెన్సింగ్‌ వ్యవహారంలో సమానత్వ హక్కు ప్రస్తావన ఉత్పన్నం కాదని తెలిపింది. 2017లో తీసుకొచ్చిన నిబంధనలు ఉనికిలో లేనప్పుడు.. లైసెన్స్‌ల పునరుద్ధరణకు అర్హులమని ఎలా చెబుతారని ప్రశ్నించింది. సీనియర్‌ న్యాయవాదులు వాదనలు కొనసాగిస్తూ.. ‘నూతన మద్యం పాలసీలో త్రీ, ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు, మైక్రో బ్రేవరీలు నిర్దిష్ట లైసెన్సింగ్‌ రుసుము, నాన్‌ రిఫండబుల్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి 2017 నిబంధనల ప్రకారం నడుపుకొనేందుకు వెసులుబాటు ఇచ్చారు. సాధారణ హోటళ్లలో నడిచే బార్ల కోసం భారీ మొత్తంలో ఫీజులు చెల్లించి బిడ్డింగ్‌లో పాల్గొనాల్సి వస్తోంది. 2017 నిబంధనల ప్రకారం పిటిషనర్ల బార్‌ లైసెన్స్‌లు పొడిగించండి’’ అని కోరారు.


ధర్మాసనం  స్పందిస్తూ.. ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసిన తర్వాత అన్ని విషయాలపై లోతుగా విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. సీనియర్‌ న్యాయవాదులు స్పందిస్తూ.. ‘‘బుధవారం నుంచి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పిటిషనర్లు ధరఖాస్తు చేసుకొనేందుకు రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తం తిరిగి ఇవ్వరు. నూతన పాలసీకి అనుగుణంగా లైసెన్స్‌లు ఖరారు చేయకుండా ఆదేశించండి. యథాతథ స్థితిని పాటించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి’’ అని అభ్యర్ధించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని వ్యాఖ్యానించింది. మద్యం వ్యాపారంలో ఉన్నవారు ఎవరూ నష్టపోరని తెలిపింది. మద్యం పాలసీ వ్యవహారంలో ప్రభుత్వ నిర్ణయాలపై కోర్టులు అరుదుగా జోక్యం చేసుకుంటాయని తెలిపింది. బార్‌ లైసెన్స్‌లు న్యాయస్థానాలు ఇవ్వలేవని తెలిపింది. మద్యం ఆరోగ్యానికి హానికరమని, మత్తుకూడా ఇస్తుందని తాము జోక్యం చేసుకోబోమని వ్యాఖ్యానించింది.

Read more