ప్రతి గ్రామంలోనూ పనులు

ABN , First Publish Date - 2022-06-07T05:56:14+05:30 IST

‘జిల్లాలో అన్ని గ్రామాల్లోనూ ప్రతి వారం పనులు చేపట్టాలి. పనులపై ఎప్పటికప్పుడు నివేదిక అందజేయాలి’ అని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ప్రతి గ్రామంలోనూ పనులు
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

ఎప్పటికప్పుడు నివేదిక అందించండి
కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌
కలెక్టరేట్‌, జూన్‌ 6:
‘జిల్లాలో అన్ని గ్రామాల్లోనూ ప్రతి వారం పనులు చేపట్టాలి. పనులపై ఎప్పటికప్పుడు నివేదిక అందజేయాలి’ అని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘ఆగస్టు నాటికి గ్రామ సచివాలయాలు, సెప్టెంబరు నాటికి రైతుభరోసా కేంద్రాలు, అక్టోబరు నాటికి హెల్త్‌క్లినిక్‌లో పూర్తి చేయాలి. పనులు అప్పగించి రెండేళ్లు కాగా.. కొన్ని ప్రాంతాల్లో ఏ ఒక్కటీ ప్రారంభం కాకపోవడం అధికారుల అసమర్థత నిదర్శనం. కొన్నిచోట్ల పనులు ప్రారంభించినా లక్ష్యాలను అధిగమించకపోవడంతో జిల్లా చివరి స్థానానికి చేరుకుంటోంద’ని అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ‘జిల్లాకు పదివేల టన్నుల సిమెంట్‌ బస్తాలు మంజూరయ్యాయి. మార్చి వరకు పెండింగ్‌ బిల్లులు కూడా చెల్లించాం. ఇంకా ఏదైనా సమస్య ఉంటే చెప్పండి. జిల్లాలో 47 గ్రామ సచివాలయాలు, 143 రైతుభరోసా కేంద్రాలు, 169 డిజిటల్‌ లైబ్రరీల పనులు ప్రారంభించండి. ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యటించి.. పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవ’ని కలెక్టర్‌ హెచ్చరించారు.

‘నాడు-నేడు’ కు రూ.129 కోట్లు మంజూరు
జిల్లాలో నాడు-నేడు పథకం కింద  రూ.129 కోట్లతో  79 పనులు మంజూరు చేశామని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ తెలిపారు. సోమవారం జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ‘నాడు-నేడు’ పనుల ఫొటో ప్రదర్శనను ఆయన తిలకించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘జిల్లాలో 480 కిలోమీటర్ల మేర రహదారుల పనులకు రూ.129కోట్లు మంజూరయ్యాయి. స్టేట్‌ హైవేకి సంబంధించి 25 పనులకు 178.92 కిలోమీటర్లు, మేజర్‌ డిస్ర్టిక్ట్‌  రహదారులకు సంబంధించి 54 పనులు 302 కి.మీ. ఉన్నాయి. ఇందులో తొమ్మిది స్టేట్‌ హైవే, 14 మేజర్‌ డిస్ర్టిక్ట్‌ రోడ్డు పనులు పూర్తిచేశాం. మిగిలిన పనులు జూలై 31 నాటికి పూర్తి చేయాలి’ అని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ ఎం.విజయసునీత, జడ్పీ సీఈవో బి.లక్ష్మిపతి, డీపీవో రవికుమార్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కె. కాంతిమణి,  ఇంజనీరింగ్‌  అధికారులు పాల్గొన్నారు.  



Updated Date - 2022-06-07T05:56:14+05:30 IST