అను‘గృహమెప్పుడో?

ABN , First Publish Date - 2022-12-12T00:05:39+05:30 IST

జిల్లాలో వేలాది మంది టిడ్కో ఇళ్ల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తూనే ఉన్నారు. పట్టణ పేదల కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస, పలాస- కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాల్టీలో 8 వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

అను‘గృహమెప్పుడో?
పాత్రునివలసలో టిడ్కో ఇళ్లు

టిడ్కో ఇళ్లకు కానరాని మోక్షం

ఏళ్ల తరబడి లబ్ధిదారుల ఎదురుచూపు

ఈ నెలలోనే ఇచ్చేస్తామని పాలకుల ప్రకటనలు

క్షేత్రస్థాయిలో పూర్తికాని నిర్మాణాలు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. అదిగో.. ఇదిగో.. అంటూ పాలకులు, అధికారులు చెబుతున్నారు. తాజాగా డిసెంబరు నాటికి పూర్తిస్థాయిలో నిర్మాణాలు చేపట్టి.. ఇళ్లు అప్పగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇంకా ఇళ్ల నిర్మాణ పనులు పూర్తికాలేదు. మౌలిక వసతులు కానరావడం లేదు. దీంతో తమకు ఎప్పటికి అను‘గృహం’ లభిస్తుందోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.

........................

జిల్లాలో వేలాది మంది టిడ్కో ఇళ్ల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తూనే ఉన్నారు. పట్టణ పేదల కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస, పలాస- కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాల్టీలో 8 వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2019 నాటికి మూడో వంతు ఇళ్లు పూర్తిచేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో మిగిలిన ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. వైసీపీ ప్రభుత్వం ఏజెన్సీలకు బిల్లులు మంజూరు చేయలేదు. ఫలితంగా మూడున్నరేళ్లు గడిచినా లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో ఇళ్లు సమకూరలేదు. టీడీపీ హయాంలో పూర్తయిన ఇళ్లను కొద్ది నెలల కిందట లబ్ధిదారులకు అందజేశారు. మొత్తంగా 3,536 ఇళ్లు మాత్రమే కేటాయించారు. కేవలం పాత్రునివలస వద్ద నిర్మించిన 1,280 ఇళ్లకు మాత్రమే లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు. మిగిలిన మూడు పట్టణాల్లో 2,256 ఇళ్లు పంపిణీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం తాత్సారం చేయడంతో ఏజెన్సీలు పట్టించుకోవడం లేదు. డిసెంబరు నాటికి ఇళ్లు పూర్తిచేసి అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. ఆ దిశగా చర్యలు కానరావడం లేదు. మౌలిక వసతులు కూడా కల్పించినా దాఖలాలు లేవు. నిర్మాణాలతో పాటు రుణ ప్రక్రియ కూడా పూర్తికాలేదు. దీంతో ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా ఇళ్లు పంపిణీ చేసే పరిస్థితి కానరావడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇళ్ల కోసం తమవంతుగా అప్పు చేసి డీడీలు చెల్లించామని పేర్కొంటున్నారు. వాటికి ఇప్పుడు వడ్డీలు చెల్లించలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మెరుగుపడని సౌకర్యాలు

శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు మిగతా మునిసిపాల్టీల్లో టిడ్కో ఇళ్ల వద్ద సౌకర్యాలు, మౌలిక వసతులు మెరుగుపడలేదు. తాగునీరు, రహదారులు, విద్యుత్‌ సౌకర్యం సక్రమంగా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శ్రీకాకుళం నగర వాసులకోసం పాత్రునివలస వద్ద 1,280 ఇళ్లు నిర్మించారు. వీటికి సంబంధించి పట్టాలను పంపిణీ చేశారు. కానీ ఇళ్లు అప్పగించలేదు. ఇంకా 624 ఇళ్ల నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఇక్కడి ప్రజలకు తాగునీటిని అందించేందుకు, డ్రైనేజీ వ్యవస్థ కోసం రూ.15కోట్లు మంజూరైంది. వీటి పనులలో వేగవంతం లేదు. దీంతో నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బోరు బావుల నుంచి మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు.

- పలాసలో 912, ఇచ్ఛాపురంలో 816, ఆమదాలవలసలో 528 ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ ఇళ్లు ఇప్పట్లో లబ్ధిదారులకు పంపిణీ చేసే పరిస్థితి లేదు. ఇచ్ఛాపురంలో ఇంకా ప్లాస్టింగ్‌లు పూర్తికాలేదు. లోపల గచ్చులు చేపట్టలేదు. వర్షం కురిస్తే మాత్రం నీరు నిల్వ చేరిపోతోంది. ఆమదాలవలసలో కొన్ని ఇళ్లు ఇంకా పునాదుల స్థాయిలోనే ఉన్నాయి. పలాసలో కూడా పూర్తిస్థాయిలో ఇళ్ల నిర్మాణాలు జరగలేదు. ఎప్పటికి పూర్తవుతాయో అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు.

అందని రుణాలు

బ్యాంకు రుణాలు మంజూరులోనూ జాప్యమవుతోంది. జిల్లాలో సుమారు 8వేల మంది లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 2,500 మందికి మాత్రమే అందజేశారు. మరో వెయ్యి మందికి రుణాలు అందజేయడంలో బ్యాంకులు తాత్సారం చేస్తున్నాయి. టీడీపీ హయాంలో బ్యాంకులతో చేసుకున్న ఒప్పందాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడంతో ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. కొత్తగా రుణాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన రుణాలను చెల్లించాలని బ్యాంకులు లబ్ధిదారులపై ఒత్తిడి చేస్తున్నాయి. కాగా.. లబ్ధిదారులు వాయిదాలు చెల్లించేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఇళ్లు ఇవ్వకుండా వాయిదాలు ఎలా కడతామంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు వాయిదాలు, మరోవైపు తమ వంతుగా డీడీల రూపంలో చెల్లించిన సొమ్ములకు వడ్డీలు, ఇంకోవైపు అద్దె ఇంటి భారాన్ని ఎలా మోయగలమంటూ లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు.

Updated Date - 2022-12-12T00:05:41+05:30 IST