లక్ష్యాలు పూర్తికాకుంటే వేటు

ABN , First Publish Date - 2022-09-25T05:01:04+05:30 IST

జిల్లాలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను శతశాతం పూర్తిచేయాలని, లేదంటే వేటు తప్పదని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను హెచ్చరించారు. ఈకేవైసీ, భూ రీసర్వే, స్పందన, మ్యుటేషన్‌, జల్‌జీవన్‌ మిషన్‌, గృహ నిర్మాణం, తదితర అంశాలపై జేసీ ఎం.విజయసునీతతో కలిసి ఆయన శనివారం అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

లక్ష్యాలు పూర్తికాకుంటే వేటు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

- అధికారులను హెచ్చరించిన కలెక్టర్‌ శ్రీకేష్‌
- నరసన్నపేట వ్యవసాయశాఖ ఏడీ, ఎంఏవో సస్పెన్షన్‌
- సోంపేట ఏడీకి షోకాజ్‌ నోటీసు జారీ
అరసవల్లి, సెప్టెంబరు 24:
జిల్లాలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను శతశాతం పూర్తిచేయాలని, లేదంటే వేటు తప్పదని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను హెచ్చరించారు. ఈకేవైసీ, భూ రీసర్వే, స్పందన, మ్యుటేషన్‌, జల్‌జీవన్‌ మిషన్‌, గృహ నిర్మాణం, తదితర అంశాలపై జేసీ ఎం.విజయసునీతతో కలిసి ఆయన  శనివారం అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో 5.80లక్షల ఎకరాల భూమికి గాను ఇప్పటివరకు 5.20 లక్షల ఎకరాలకు ఈ-క్రాప్‌ పూర్తిచేసి, 81 శాతం మాత్రమే ప్రగతి సాధించారని చెప్పారు. 3.21లక్షల మందికి ఈకేవైసీ చేయాల్సి ఉండగా కేవలం 1.25 లక్షల మందికే చేయడంపై మండిపడ్డారు. ఈ-క్రాప్‌, ఈకేవైసీ పూర్తికాకపోతే ప్రభుత్వ పథకాలు మంజూరు కావని తెలిసినప్పటికీ నిర్లక్ష్యం వహించడంపై అసహనం వ్యక్తం చేశారు. పదే పదే ఆదేశాలు జారీ చేసినప్పటికీ నరసన్నపేట చివరి స్థానంలో ఉందని, సంబంధిత వ్యవసాయ శాఖ ఏడీ, ఏవోలను సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా సోంపేట ఏడీకి షోకాజ్‌ నోటీసును జారీ చేయాలని ఆదేశించారు. ఆదివారంలోగా ఈ-క్రాప్‌, అక్టోబరు 2వ తేదీలోగా ఈకేవైసీ పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. వీఆర్వో, వీఏఓ లాగిన్లలో పెండింగ్‌ లేకుండా చూసుకోవాలని, శని, ఆదివారాల్లో ప్రత్యేక దృష్టి సారించి ప్రగతిని సాధించాలని సూచించారు. జిల్లాలో సమగ్ర భూ సర్వే  201 గ్రామాల్లో జరిగిందని, యజమానులకు అక్టోబరు 2న భూ హక్కు పత్రాలను పంపిణీ చేస్తామని తెలిపారు.  మ్యుటేషన్లు, కోర్టు కేసుల్లో జిల్లా వెనుకంజలో ఉందన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి సహకారం తీసుకుని తహసీల్దార్లు, మునిసిపల్‌ కమిషనర్లు వాటిని త్వరగా పరిష్కరించుకోవాల న్నారు. సచివాలయానికి రూ.20లక్షల నిధులు మంజూరు చేస్తామని, చేపట్టాల్సిన పనుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. 30 మండలాలకు గాను 7 మండలాల్లోనే ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు పూర్తయ్యాయని,  మిగిలిన మండలాల్లో మూడు రోజుల్లో శతశాతం లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.  83,456 పేదల ఇళ్లకు 9,623  మా త్రమే పూర్తయ్యాయని, డిసెంబరు నెలాఖరుకు పూర్తిచేసుం దుకు చర్యలు తీసుకుంటున్నట్లు గృహనిర్మాణసంస్థ సంచాలకుడు ఎం.గణపతిరావు కలెక్టర్‌కు తెలిపారు. గృహ నిర్మాణాల్లో చివరి స్థానంలో ఉన్న ఇంజనీర్లపై వేటుతప్పదన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, ఆర్డీవో బి.శాంతి, జిల్లా వ్యవసాయాధికారి కె.శ్రీధర్‌, జిల్లా ఉద్యానవన అధికారి ప్రసాదరావు. జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్‌, డ్వామా, డీఆర్‌డీఏ పీడీలు  జీవీ చిట్టిరాజు, డీవీ విద్యాసాగర్‌,  తదితరులు పాల్గొన్నారు.

 


Updated Date - 2022-09-25T05:01:04+05:30 IST