వేతన యాతన

ABN , First Publish Date - 2022-11-16T00:08:11+05:30 IST

గ్రామాలు, పట్టణాలను శుభ్రంగా ఉంచే కార్మికులకు సరిగ్గా వేతనాలు చెల్లించడం లేదు. గ్రీన్‌ అంబాసీడర్లుగా పిలవబడే కార్మికులకు మే నెల నుంచి జీతాలు నిలిచిపోయాయి. దీంతో వారు కుటుంబాలతో పడుతున్న బాధలు అన్నీఇన్నీ కావు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా పంచాయతీల్లో ప్రతి 1000 మంది జనాభాకు ఒక గ్రీన్‌ అంబాసిడర్‌ను, 3 వేల మంది జనాభాకు ఒక ఫెసిలిటేటర్‌ను నియమించారు.

వేతన యాతన
గ్రీన్‌ అంబాసీడర్లు ఆందోళన చేస్తున్న దృశ్యం

వేతన యాతన

జీతాల్లేని గ్రీన్‌ అంబాసిడర్లు

ఏడు నెలలుగా వేతనాలు పెండింగ్‌

తాజాగా 15వ ఆర్ధిక సంఘం నిధుల నుంచి ఇవ్వాలంటూ ఆదేశాలు

భగ్గుమంటున్న సర్పంచ్‌లు

(ఎచ్చెర్ల)

గ్రామాలు, పట్టణాలను శుభ్రంగా ఉంచే కార్మికులకు సరిగ్గా వేతనాలు చెల్లించడం లేదు. గ్రీన్‌ అంబాసీడర్లుగా పిలవబడే కార్మికులకు మే నెల నుంచి జీతాలు నిలిచిపోయాయి. దీంతో వారు కుటుంబాలతో పడుతున్న బాధలు అన్నీఇన్నీ కావు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా పంచాయతీల్లో ప్రతి 1000 మంది జనాభాకు ఒక గ్రీన్‌ అంబాసిడర్‌ను, 3 వేల మంది జనాభాకు ఒక ఫెసిలిటేటర్‌ను నియమించారు. గ్రీన్‌ అంబాసిడర్‌కు రూ.6 వేలు, ఫెసిలిటేటర్‌కు రూ.7,500లను వేతనంగా నిర్ణయించారు. అయితే నియమించిన కొద్ది నెలలకే ఫెసిలిటేటర్లను తొలగించారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ నుంచి గ్రీన్‌ అంబాసిడర్లకు జీతాలు చెల్లిస్తామని ప్రకటించినా.. ఆచరణలో మాత్రం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. దీంతో వీరికి వేతన కష్టాలు మొదలయ్యాయి. జిల్లాలో 948 గ్రామ పంచాయతీలు ఉండగా, ఒక్కో పంచాయతీలో ఇద్దరేసి, ముగ్గురేసి వంతున గ్రీన్‌ అంబాసిడర్లు పనిచేస్తున్నారు.

రూ.10 వేల జీతం ఒట్టిమాటేనా?

గతేడాది జనవరి నుంచి గ్రీన్‌ అంబాసిడర్లకు నెలకు రూ.10 వేల వంతున చెల్లిస్తామన్న ప్రభుత్వ ఆదేశాలు అమలు కావడం లేదు. నెలకు 10 వేల రూపాయల వేతనం వస్తే ఇంకాస్త మెరుగైన జీవనం సాగించవచ్చని ఆశపడ్డారు. ఇప్పటివరకూ చెల్లిస్తున్న రూ.6 వేల వేతనాన్నైనా ఏ నెలకు ఆ నెల చెల్లిస్తే అదే పదివేలు అంటున్నారు. వేతనాలు సకాలంలో అందక వీరంతా ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

సర్పంచ్‌ల పెదవివిరుపు

15వ ఆర్ధిక సంఘం నిధుల నుంచి గ్రీన్‌ అంబాసిడర్లకు వేతనాలు చెల్లించాలని డీపీవోల నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిపై సర్పంచ్‌లు గుర్రుమంటున్నారు. ఆర్ధిక సంఘం నిధులతో సీసీ రోడ్లు, డ్రైయిన్‌ల నిర్మాణం, బోర్ల మరమ్మతులను చేపట్టాల్సి ఉంది. అలాగే ఇదే నిధులతోనే విద్యుత్‌ బార్జీలను చెల్లించాల్సి ఉంది. తాజాగా గ్రీన్‌ అంబాసిడర్లకు కూడా వేతనాలు చెల్లించాలన్న ఆదేశాలు రావడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఇలాగైతే పంచాయతీల నిర్వహణ కష్టమని భావిస్తున్నారు. ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలని సర్పంచ్‌లు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రభుత్వమే నేరుగా అందించాలి

గ్రామ పంచాయతీలతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా గ్రీన్‌ అంబాసిడర్లకు వేతనాలు చెల్లించాలి. ప్రభుత్వం ప్రకటించినట్టు నెలకు రూ.10 వేలవంతున చెల్లిస్తే వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినట్టువుతుంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి.

-అల్లుపల్లి రాంబాబు, సర్పంచ్‌, బుడగట్లపాలెం

ఆదేశాలు వచ్చాయి

గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితుల మెరుగునకు పనిచేస్తున్న గ్రీన్‌ అంబాసిడర్లకు వేతనాలను 15వ ఆర్ధిక సంఘం నిధుల నుంచి చెల్లించాలని ఇప్పటికే అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు వేతనాల చెల్లింపునకు అవసరమైన చర్యలు తీసుకుంటాం.

- కె.ఈశ్వరి, ఈవోపీఆర్డీ, ఎచ్చెర్ల

Updated Date - 2022-11-16T00:08:11+05:30 IST

Read more