వంశధార తీరం.. జనసంద్రం

ABN , First Publish Date - 2022-03-19T04:46:23+05:30 IST

వంశధార నదీ తీరం.. భక్తజన సంద్రమైంది. హిరమండలం మేజర్‌ పంచాయతీ సుభలయి మెట్టపై వెలసిన వెంకటేశ్వరస్వామి చక్రతీర్థ స్నానాలు వంశధార నదిలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మూడు రోజులపాటు నిర్వహించిన డోలోత్సవాల్లో

వంశధార తీరం..  జనసంద్రం
వెంకటేశ్వర స్వామి వారికి చక్రతీర్థ స్నానాలు నిర్వహిస్తున్న భక్తులు

వంశధార తీరం..  జనసంద్రం

 ఘనంగా వెంకటేశ్వరస్వామి చక్రతీర్థ స్నానాలు 

హిరమండలం, మార్చి 18 : వంశధార నదీ తీరం.. భక్తజన సంద్రమైంది. హిరమండలం మేజర్‌ పంచాయతీ సుభలయి మెట్టపై వెలసిన వెంకటేశ్వరస్వామి చక్రతీర్థ స్నానాలు వంశధార నదిలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మూడు రోజులపాటు నిర్వహించిన డోలోత్సవాల్లో భాగంగా చివరి రోజున శ్రీభూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను గరుడ వాహనంపై ఊరేగించారు. మంగళవాయిద్యాలతో వంశధార నదీ తీరానికి తీసుకెళ్లి.. చక్రతీర్థ స్నానాలు చేయించారు. ఈ అపురూప ఘట్టాన్ని చూసేందుకు హిరమండలం, కొత్తూరు, పాతపట్నం, ఎల్‌.ఎన్‌.పేట మండలాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై కె.మధుసూదనరావు ఆధ్వర్యంలో 25మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కాగా, వసతి సదుపాయం లేక మండుటెండలో భక్తులు ఇబ్బందులు పడ్డారు. సుభలయి గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు అన్నదానం చేశారు. 

 వైభవంగా.. కూర్మనాథుని డోలోత్సవాలు

శ్రీకూర్మం (గార),  మార్చి 18: మూడు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీకూర్మనాథుని డోలోత్సవాలు శుక్రవారం వైభవంగా ముగిశాయి.  చివరిరోజు స్వామివారి ఉత్సవమూర్తులను మేళతాళాలతో తిరువీధి నిర్వహించి గ్రామసమీపంలోని డోలో మండపానికి తీసుకువెళ్లారు. అక్కడ ఊయల్లో  ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ వంశపారంపర్య ఽధర్మకర్తలు విజయనగరం పూసపాటి గజపతుల గోత్రనామాలు బుక్కా, భర్గుండలతో పూజలు చేశారు. అనంతరం  ఉత్సవమూర్తులను ఆలయానికి తీసుకువెళ్లారు. వేలాదిమంది భక్తులు సముద్రంలో పవిత్రస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు.  ప్రధాన అర్చకులు సీతారామనరసింహాచార్యులు, ఈవో ఎస్‌.విజయ్‌కుమార్‌, సర్పంచ్‌ గోరు అనిత, వైస్‌ఎంపీపీ బరాటం రామశేషు, ట్రస్ట్‌బోర్డుసభ్యులు డబ్బీరు వాసుదేవరావు, పాన్నాడ రుషి, పూడి కమల, అనుపోజు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. సీఐ అంబేద్కర్‌, గార ఎస్‌ఐ కె.లక్ష్మి బందోబస్తు నిర్వహించారు.  

 కన్నులపండువగా  చక్రపెరుమాళ్‌.. 

కవిటి: బెజ్జిపుట్టుగలో చక్రపెరుమాళ్‌స్వామి డోలోత్సవాలు కన్నులపండువగా నిర్వహించారు. శుక్రవారం  ఉద్దానంతోపాటు ఒడిశా లోని పలు ప్రాంతాల నుంచి   అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు  ఇబ్బందులు లేకుండా పోలీసులు, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.  


Read more