-
-
Home » Andhra Pradesh » Srikakulam » Vasudeva Brahmotsavalu from today-MRGS-AndhraPradesh
-
నేటి నుంచి వాసుదేవుని బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2022-02-20T04:58:25+05:30 IST
మందస వాసుదేవుని వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

27 వరకు నిర్వహణకు ఏర్పాట్లు
మందస, ఫిబ్రవరి 19: మందస వాసుదేవుని వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తిచేశారు. తొలిరోజు ఆదివారం ఆంజనేయస్వామి ఆలయంలో అభిషేకం, సుందరకాండ పారాయణం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 21న వాసుదేవ పెరుమాళ్ అభిషేక మహోత్సవం, జీయర్‌స్వాముల అనుగ్రహభా షణం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ
- 22న ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ఠ, విశేష గరుడపూజ, హనుమద్వాహన సేవ, శ్రీరామ పూజ, చక్రపెరుమాళ బృందంతో శాస్త్రీయ సంగీత విభావరి
- 23న యాగశాలలో విశేష హోమాలు, కల్ప వృక్షసేవ, సాయంత్రం ఆరంగి వెంకటరావుతో శాస్త్రీయ సంగీత విభావరి
- 24న భూసమేత వాసుదేవస్వామి కల్యాణం, కోలాటం, పలాస బృందంతో అన్నమయ్య సంకీర్తనలు, గ్రామవీధుల్లో తిరువీధి - 25న యాగశాలలో హోమాలు, పొన్నచెట్టు వాహనసేవ, అశ్వవాహన సేవ, దోపిడీ ఉత్సవం, సీతా స్వయంవరం అన్న ఒడియా నాటకం
- 26న రథోత్సవం, చక్రతీర్ధం, అవభృద స్నానం, పుష్పయాగం
- 27న వాసుదేవపెరు మాళ్ అభిషేకం, సప్తావరణం, ఏకాంతసేవ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చరిత్ర
14వ శతాబ్దంలో వాసుదేవ ఆలయాన్ని మందస రాజులు అభివృద్ధి చేశారు. 17వ శతాబ్దం వరకూ మంజూష (మందస) సంస్థానాదీశులు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. 1779-1823 మధ్య కాలంలో 45వ రాజు లక్ష్మణరాజమణిదేవ్ ఆలయ వైభవాన్ని పెంచుతూ ఏటా తొమ్మిది రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. త్రిదండి చినజీయర్‌స్వామి శ్రీకూర్మం నుంచి పూరీ వరకూ పాదయాత్ర నిర్వహించిన సమయంలో ఈ ఆలయాన్ని చూసి చలించిపోయారు. ఒడిశాకు చెందిన శిల్ప కళాకారులను రప్పించి ఆలయాన్ని పునర్నిర్మించారు. 2010 ఫిబ్రవరి 5న నూతన శిల్పాలతో ఆలయాన్ని నిర్మించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. అప్పటి నుంచి ఏటా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తూనే ఉన్నారు.