వైద్యమేది మహాప్రభో!

ABN , First Publish Date - 2022-09-25T06:19:03+05:30 IST

ఏవోబీ సరిహద్దు శివారు బలపం పంచాయతీ ఆదివాసీలకు సర్కారు వైద్యం అందని ద్రాక్షగా తయారైంది. తాజాగా కోరుకొండ వైద్యాధికారి ఉద్యోగానికి రాజీనామా చేయడంతో ప్రజలకు వైద్య సేవలు దూరమయ్యాయి.

వైద్యమేది మహాప్రభో!
కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

- బలపం పంచాయతీ వాసులకు వైద్య సేవలు దూరం

- వైద్యాధికారి రాజీనామా చేసినా భర్తీ కాని పోస్టు

- చికిత్స కోసం పొరుగు పీహెచ్‌సీలకు వెళుతున్న రోగులు

చింతపల్లి, సెప్టెంబరు 24: ఏవోబీ సరిహద్దు శివారు బలపం పంచాయతీ ఆదివాసీలకు సర్కారు వైద్యం అందని ద్రాక్షగా తయారైంది. తాజాగా కోరుకొండ వైద్యాధికారి ఉద్యోగానికి రాజీనామా చేయడంతో ప్రజలకు వైద్య సేవలు దూరమయ్యాయి. రోగులకు కేవలం దిగువ స్థాయి సిబ్బంది నామమాత్రపు చికిత్స అందిస్తున్నారు. దీంతో వైద్యుల చికిత్స కోసం పొరుగు పీహెచ్‌సీకి వెళ్లాల్సిన దయనీయ స్థితిని ఎదుర్కొంటున్నారు. చింతపల్లి మండలంలో శివారు పంచాయతీ బలపం. పంచాయతీ పరిధిలో ఉన్న 33 గ్రామాలతోపాటు తమ్మంగుల, కుడుముసారి పంచాయతీ పరిధిలో ఉన్న మరో 12 గ్రామాల ప్రజల కోసం కోరుకొండ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సుమారు 20 ఏళ్ల కిందట ఏర్పాటు చేశారు. కోరుకొండ మావోయిస్టు పార్టీకి కంచుకోటగా పేరొందింది. చింతపల్లి మండల కేంద్రానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సెల్‌ సిగ్నల్స్‌ అందుబాటులో లేవు. దీంతో కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించేందుకు వైద్యులు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. వైద్య ఆరోగ్యశాఖ, ఐటీడీఏ అధికారులు వైద్యాధికారిని నియమించినప్పటికి వారంలో నాలుగు రోజులు ప్రాంతీయ రోగులకు అందుబాటులో ఉండడం గగనమైపోతుంది. కోరుకొండ పీహెచ్‌సీ పరిధిలో రెండు రెగ్యులర్‌ వైద్యాధికారి పోస్టులు ఉన్నాయి. ఒక్కటి కూడా గత ఐదేళ్లగా భర్తీ కావడంలేదు. దీంతో కాంట్రాక్టు వైద్యులతో ఐటీడీఏ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కాలం నెట్టుకొస్తున్నారు. ఏడాది కిందట కోరుకొండ పీహెచ్‌సీ వైద్యాధికారిగా నియమితులైన సంతోష్‌కుమార్‌.. జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోణంగి గోపాలక్రిష్ణలు ఆకస్మిక తనిఖీలు చేసే సమయంలో విధుల్లో లేరు. స్థానికులు సైతం వైద్యాధికారి వారంలో రెండు రోజులు మాత్రమే విధులకు హాజరవుతున్నారని కలెక్టర్‌, పీవోలకు ఫిర్యాదు చేశారు. దీంతో వైద్యాధికారికి వేతనాలు నిలిపివేసి షోకాజు నోటీసులు జారీచేశారు. తాజాగా ఐదు రోజుల కిందట వైద్యాధికారి సంతోష్‌కుమార్‌ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి లేఖను అందజేసి విధులకు దూరమయ్యారు. 

రోగులకు దూరమైన వైద్యుల సేవలు

కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ఆదివాసీలకు ప్రస్తుతం వైద్యుల సేవలు పూర్తిగా దూరమయ్యాయి. వివిధ వ్యాధులతో పీహెచ్‌సీకి వచ్చే రోగులకు స్టాఫ్‌నర్సులే చికిత్స అందించి పంపిస్తున్నారు. కోరుకొండ పీహెచ్‌సీకి ఆదివారం, సోమవారం అత్యధిక సంఖ్యలో రోగులు వస్తున్నారు. ఇతర రోజుల్లో 50 నుంచి 60 మంది రోగులు చికిత్స కోసం వస్తుంటారు. పీహెచ్‌సీలో వైద్యులు లేకపోవడంతో కొంత మంది రోగులు కోరుకొండకు సుమారు 14కిలోమీటర్ల దూరంలో ఉన్న లోతుగెడ్డ పీహెచ్‌సీకి వెళ్లి చికిత్స పొందుతున్నారు. గర్భిణులు సైతం ప్రసవం కోసం లోతుగెడ్డ పీహెచ్‌సీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

వైద్యాధికారి పోస్టు భర్తీ అయ్యేనా?

కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి పోస్టు భర్తీ చేస్తారా?, దిగువ స్థాయి ఉద్యోగులతోనే రోగులకు చికిత్స అందిస్తారా? అనే సందేహాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్న 36 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 19 వైద్యుల పోస్టులు ఇప్పటి వరకు ఖాళీగా వున్నాయి. వైసీపీ ప్రభుత్వం కొన్నేళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో వైద్యుల పోస్టుల భర్తీని నిలిపివేసింది. నూతన రిక్రూట్‌మెంట్‌లో నియమితులైన వైద్యులు గిరిజన ప్రాంతాల్లో విధులు నిర్వహించేందుకు ఆసక్తి చూపడంలేదు. తాజాగా కోరుకొండ పీహెచ్‌సీ వైద్యాధికారి రాజీనామా చేయడంతో వైద్యుల ఖాళీల సంఖ్య 20కి చేరింది. గతంలో ఐటీడీఏ తాత్కాలిక పద్ధతిలో అత్యవసర పరిస్థితుల్లో వైద్యుల పోస్టులను భర్తీ చేసేది. తాజాగా ఐటీడీఏలో నిధుల కొరత ఏర్పడడం వల్ల ప్రాజెక్టు అధికారి తాత్కాలిక పద్ధతిలో వైద్యుల పోస్టులను భర్తీచేసే సాహసం చేయడంలేదు. నూతన వైద్యుల నియామకాలకు రెండు నెలల కిందట వెలువడిన ప్రకటన నేటికీ కార్యరూపం దాల్చలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో కోరుకొండ పీహెచ్‌సీ వైద్యాధికారి పోస్టు భర్తీ చేయాలంటే జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. పొరుగు పీహెచ్‌సీ నుంచి వైద్యులను డిప్యూటేషన్‌పై నియమించడంగాని, తాత్కాలిక పద్ధతినైనా వైద్యాధికారిని నియమించడం మినహా మరో ప్రత్యామ్నాయ మార్గం కనిపించడం లేదని పలువురు అంటున్నారు.

Read more