‘ప్రోత్సాహక’మేదీ?

ABN , First Publish Date - 2022-11-24T00:01:13+05:30 IST

జిల్లాలో ఏకగ్రీవ పంచాయతీలన్నీ ప్రోత్సాహక నగదు కోసం ఎదురు చూస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1,190 పంచాయతీలు ఉండగా 137 పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

  ‘ప్రోత్సాహక’మేదీ?
మారడికోట ఏకగ్రీవ పంచాయతీ

- ఏకగ్రీవ పంచాయతీలకు అందని నజరానా

- 20 నెలలైనా జమకాని నిధులు

- అభివృద్ధికి నోచుకోని పల్లెలు

(మెళియాపుట్టి)

మెళియాపుట్టి మండలంలోని మారడికోట పంచాయతీకి సర్పంచ్‌గా భాగ్యం శ్రీనివాస్‌ను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎనుకున్నారు. ఇది జరిగి 20 నెలలు అవుతుంది. కానీ, ఇంతవరకు ప్రభుత్వం ఏకగ్రీవ నిధులు పైసా కూడా ఇవ్వలేదు. ఒకపక్క నగదు ప్రోత్సాహకం అందక.. మరోపక్క ఆర్థిక సంఘం నిధులు లేక ఈ పంచాయతీలో అభివృద్ధి కరువైంది. కాలువలు లేక వీధుల్లోనే మురుగు నిలిచిపోతుంది. గ్రామంలో అధికంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నా శుద్ధజలాలు అందడం లేదు. కనీసం ఏకగ్రీవ నిధులైనా వస్తే తాగునీటి సౌకర్యం కల్పించుకోవాలని గ్రామస్థులు ఎదురుచూస్తున్నారు.

------------------

మెళియాపుట్టి మండలంలో మరో ఏకగ్రీవ పంచాయతీ సుందరాడలోనూ ఇదే దుస్థితి. పంచాయతీలో అధిక సమస్యలు ఉన్నా నిధులు లేక ఎలాంటి పనులు జరగడం లేదు. ప్రభుత్వం ఏకగ్రీవ నిధులను విడుదల చేస్తే గ్రామంలో కాలువలు, సీసీ రోడ్లు, రక్షిత పథకం నిర్మించుకుంటామని గ్రామస్థులు చెబుతున్నారు.

------------------

....ఇలా జిల్లాలో ఏకగ్రీవ పంచాయతీలన్నీ ప్రోత్సాహక నగదు కోసం ఎదురు చూస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1,190 పంచాయతీలు ఉండగా 137 పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవమయ్యే 5 వేల జనాభా గల పంచాయతీలకు రూ.15 లక్షలు, రెండు వేల జనాభా పైబడిఉంటే రూ10.లక్షలు, రెండు వేల లోపు జనాభా ఉండే పంచాయతీలకు రూ.5లక్షలు ప్రోత్సాహకం అందిస్తామని ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పింది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలోని 137 ఏకగ్రీవ పంచాయతీలకు సంబంధించి 17 పంచాయతీలకు రూ.10లక్షలు, మిగిలిన వాటికి రూ.5 లక్షలు చొప్పున జమ కావలసి ఉంది. కానీ, ఇంతవరకు పైసా కూడా అందకపోవడంతో ఏకగ్రీవ సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. ఒకపక్క కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సంఘం నిధులను లాగేసుకొని, మరోపక్క ఏకగ్రీవ నిధులనూ ఇవ్వకపోతే పంచాయతీల అభివృద్ధి ఎలా సాధ్యమని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది సర్పంచ్‌లు తమ సొంత డబ్బులతో అత్యవసర పనులు చేస్తున్నా సకాలంలో బిల్లులు రావడం లేదని వాపోతున్నారు. మరికొంతమంది సర్పంచ్‌లు ఎన్నికల ముందు గ్రామ అభివృద్ధికి లక్షలాది రూపాయలు ఇచ్చారు. ప్రభుత్వం ప్రోత్సాహక నిధులు అందిస్తే కొంతమేర రికవరీ చేసుకోవచ్చునని వీరు భావించారు. ఇప్పుడు వీరంతా ఆందోళన చెందుతున్నారు. ఇటీవల జిల్లాకు తొలివిడత కింద మంజూరైన రూ.7.90కోట్లను 67 పంచాయతీలకు జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో అధికంగా అధికార పార్టీలో పలుకుబడి ఉన్న సర్పంచ్‌లకే జమయినట్టు తెలుస్తోంది. దీంతో మిగిలిన సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు.

బయటకు వెళ్లలేకపోతున్నాం

ప్రోత్సాహక నిధులు వస్తే పంచాయతీని అభివృద్ధి చేసుకోవాలని అనుకున్నాం. కానీ, 20 నెలలు అవుతున్నా డబ్బులు రాలేదు. దీంతో అభివృద్ధి పనులు చేయలేక బయటకు వెళ్లలేకపోతున్నాం.

- భాగ్యంశ్రీనివాసరావు, సర్పంచ్‌, మారడికోట

అధికారులకు విన్నవించాం

ఏకగ్రీవ పంచాయతీల నిధుల కోసం ప్రభుత్వానికి ఇప్పటికే చాలాసార్లు విన్నవించాం. మొదటివిడతగా కొన్ని పంచాయతీలకు నిధులు వచ్చాయి. మిగతా పంచాయతీలకు త్వరలోనే జమవుతాయి.

-పి.చంద్రకూమారి, ఎంపీడీవో మెళియాపుట్టి

Updated Date - 2022-11-24T00:01:19+05:30 IST