విదేశీ ఉద్యోగాల పేరిట టోకరా

ABN , First Publish Date - 2022-01-29T03:45:40+05:30 IST

విదేశీ ఉద్యోగాల పేరిట ఓ సంస్థ నిరుద్యోగులకు టోకరా వేసింది. వెల్ఫేర్‌, స్టోర్‌ కీపర్‌, స్టోర్‌ ఇన్‌చార్జిల పోస్టుల భర్తీ చేస్తామని ఇంటర్వ్యూలు చేసింది. వీసా, విమాన టికెట్ల కోసం 44 మంది నిరుద్యోగుల వద్ద రూ.24లక్షలు వసూలు చేసింది. ఆపై రాత్రికి రాత్రే కార్యాలయానికి తాళం వేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. న్యాయం చేయాలని వేడుకున్నారు. వివరాల్లోకి వెళితే.. దుబాయ్‌, అబుదాబీలోని శ్యాంసంగ్‌, డ్రాగన్‌ ఆయిల్‌ కంపెనీల్లో ఉద్యోగాలంటూ ఒక సంస్థ నిరుద్యోగుల

విదేశీ ఉద్యోగాల పేరిట టోకరా
ఇచ్ఛాపురం రూరల్‌ పోలీసు స్టేషన్‌ వద్ద ఆందోళన చేస్తున్న లొద్దపుట్టి బాధితులు

- 44 మంది నుంచి రూ.24 లక్షలు వసూలు

- రాత్రికి రాత్రే మూత పడిన సంస్థ

- పోలీసులను ఆశ్రయించిన బాధితులు

(ఇచ్ఛాపురం రూరల్‌, జనవరి 28)

విదేశీ ఉద్యోగాల పేరిట ఓ సంస్థ నిరుద్యోగులకు టోకరా వేసింది. వెల్ఫేర్‌, స్టోర్‌ కీపర్‌, స్టోర్‌ ఇన్‌చార్జిల పోస్టుల భర్తీ చేస్తామని ఇంటర్వ్యూలు చేసింది. వీసా, విమాన టికెట్ల కోసం  44 మంది నిరుద్యోగుల వద్ద రూ.24లక్షలు వసూలు చేసింది. ఆపై రాత్రికి రాత్రే కార్యాలయానికి తాళం వేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. న్యాయం చేయాలని వేడుకున్నారు. వివరాల్లోకి వెళితే.. దుబాయ్‌, అబుదాబీలోని శ్యాంసంగ్‌, డ్రాగన్‌ ఆయిల్‌ కంపెనీల్లో ఉద్యోగాలంటూ ఒక సంస్థ నిరుద్యోగులను నిండా ముంచేసింది. ఉద్యోగాల భర్తీకి తక్షణమే పేర్లు నమోదు చేసుకోవాలని ప్రకటించింది. ఈ మేరకు ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టికి చెందిన 26 మంది, కేదారిపురానికి చెందిన 13 మంది, ఒడిశా రాష్ట్రానికి చెందిన మరో ఐదుగురు ఈ ప్రకటన చూశారు. అందులో ఉన్న నెంబర్‌కు ఫోన్‌ చేయగా.. విశాఖలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా ఉన్న ‘అరౌండ్‌ ది వరల్డ్‌’ అనే సంస్థ కార్యాలయానికి రావాలని ప్రకటనదారులు సూచించారు. ఈ మేరకు ఈ యువకులంతా  మొదట రిజిష్ట్రేషన్‌ ఫీజు కింత కొంత మొత్తం చెల్లించారు. అనంతరం గాజువాకలోని గ్రీన్‌ ఆపిల్‌ హోటల్లో ఈ నెల 18, 20, 22వ తేదీలలో 10 మందికి గ్రూపు చొప్పున ఇంటర్వ్యూలు నిర్వహించారు. జీతాలు భారీగానే ఉంటాయని, ముందుగా కొత్తవారు రూ.45వేలు, సీనియర్స్‌ రూ.55వేలు చెల్లించాలని సూచించారు. ఈ మేరకు నిరుద్యోగులంతా సొమ్ములు చెల్లించారు. తర్వాత ఇచ్ఛాపురంలోనే వైద్య పరీక్షలు చేసి ఆ డాక్యుమెంటేషన్‌ను 7080678042 అనే నెంబరుకు పంపించారు. అనంతరం వారికి వీసా, విమాన టికెట్స్‌ కూడా ఇచ్చి డబ్బులు తీసుకున్నారు. తర్వాత ఇచ్ఛాపురం నుంచి ముంబయి వెళ్లేందుకు కోణార్క్‌ ట్రైన్‌ టిక్కెట్లు కోసం ఒక్కొక్కరి నుంచి రూ.1500 వసూలు చేశారు. మరో రెండు రోజుల్లో విదేశాలకు వెళ్లనున్నామని యువకులంతా సంబరపడ్డారు. ప్రయాణానికి సన్నద్ధమయ్యే ముందు ఈ నెల 25న సంబంధిత వ్యక్తులకు ఫోన్‌ చేయగా.. స్విచ్ఛాప్‌ అని సమాధానం రావడంతో బాధితులంతా విశాఖలోని కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ తాళాలు వేసి ఉండడంతో వారంతా లబోదిబోమన్నారు. బుధవారం అక్కడి నాలుగో పట్టణ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు వచ్చి తాళాలు తీసి లోపలున్న పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో 38 మంది పాస్‌పోర్టులు లభించాయి. మిగతా ఆరుగురి పాసుపోర్టులు గల్లంతయినట్లు బాధితులు తెలిపారు. అనంతరం గురువారం గ్రామానికి వచ్చేశారు. శుక్రవారం ఇచ్ఛాపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో సంబంధిత వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. తామంతా సుమారు రూ.24లక్షలు చెల్లించి మోసపోయామని వాపోయారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదైన నేపథ్యంలో.. ఈ ఫిర్యాదును విశాఖపట్నం నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌కు రిఫర్‌ చేస్తున్నామని ఎస్‌ఐ హైమావతి తెలిపారు. 


ప్రకటన చూసి మోసపోయాం  

పేపర్‌లో వచ్చిన ప్రకటన చూసి గ్రామంలోని కొంతమంది వ్యక్తులు ముందు ఇంటర్వ్యూకు వెళ్లడంతో నేను ఇంటర్వ్యూకి వెళ్లాను. మంచి జీతం ఆశ చూపడంతో పాటు భవిష్యత్‌ బాగుంటుందని గ్రామంలో అప్పుచేసి డబ్బులు కట్టాను. రూ.60 వేలు వరకు ఖర్చయింది. ఇప్పుడు ఇలా జరగడంతో అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడంలేదు.

- ఆసి రామచంద్ర, బాధితుడు, లొద్దపుట్టి.


గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదు

మేము గతంలో విదేశాలకు వెళ్లి వచ్చినవారిమే. గతంలో ఎప్పుడూ ఇలాంటి మోసాలు జరగకలేదు. వెల్డర్‌గా ఉద్యోగానికి రూ.55 వేలు, ఇతర ఖర్చులు మరో రూ. 15వేలు వరకు అయ్యాయి. మా గ్రామానికి చెందిన వారికే ఇలా జరగడంతో ఒక్కసారిగా అందరం ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.

- ఉప్పాడ షణ్ముఖరావు, బాదితుడు, లొద్దపుట్టి.Read more