నిలదీసినంత పనిచేశారు!

ABN , First Publish Date - 2022-11-30T23:58:54+05:30 IST

సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి జోగి రమేష్‌

నిలదీసినంత పనిచేశారు!
సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి జోగి రమేష్‌

నిలదీసినంత పనిచేశారు!

గృహనిర్మాణ శాఖ తీరుపై ఎమ్మెల్యేలు సీరియస్‌

జగన్న కాలనీ లేఅవుట్లలో సమస్యలపై ప్రశ్నలు

మంత్రి జోగి రమేష్‌ ఎదుటే ఏకరువు

‘గడపగడపకు’ వెళ్లలేకపోతున్నామని ఆవేదన

శ్రీకాకుళం, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): కక్కలేక.. మింగలేని పరిస్థితి జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులది. అంతా సవ్యంగా సాగుతున్నట్లు ప్రకటనలిస్తూనే.. క్షేత్రస్థాయిలో తమకు ఎదురవుతున్న సమస్యలు, ప్రజల నుంచి వస్తున్న నిలదీతలు, ఫిర్యాదులపై ప్రశ్నించడం అనివార్యంగా మారింది. ఇందుకు కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన గృహనిర్మాణ శాఖ సమీక్ష వేదికైంది. గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ ఎదుటే జిల్లా ప్రజాప్రతినిధులు సమస్యలను ఏకరువు పెట్టారు. గృహనిర్మాణ శాఖ పనితీరుపై దాదాపు నిలదీసినంత పనిచేశారు. సొంత పార్టీ ప్రజాప్రతినిధుల నుంచే ప్రశ్నలు ఎదురవ్వడంతో మంత్రి జోగి రమేష్‌ కాస్త విస్మయం చెందారు. బుధవారం జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి రమేష్‌ గార మండలంలోని జగనన్న లేఅవుట్‌ కాలనీని పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అజయ్‌జైన్‌తో కలిసి సమీక్షించారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పలరాజు, జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయతో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘2020లో ఎచ్చెర్ల నియోజకవర్గానికి 3,600 ఇళ్లకు ప్రతిపాదనలు పెడితే.. 1800 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయి. స్థానికంగా ఉన్న హౌసింగ్‌ సిబ్బంది స్పందిస్తున్నా.. బిల్లుల విషయానికి వచ్చేసరికి ఉన్నత స్థాయిలోనే రిజక్ట్‌ అవుతున్నాయి’ అని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. గడపగడపలో దీనిపైనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘జగనన్న లేవుట్లలో మౌలిక వసతులు లేవు. 143 లేఅవుట్లకు అసలు విద్యుత్‌ సదుపాయమే కల్పించలేదు. లబ్ధిదారుడికి 20 టన్నుల ఉచిత ఇసుక అందించడం లేదు. ఇలా అయితే ఇల్లు ఎలా కట్టేది’అని ప్రశ్నించారు. ఓటీఎస్‌ పేరిట డబ్బులు కట్టించుకున్నా.. ఇంతవరకూ ధ్రువపత్రాలు అందించలేదని ఫిర్యాదు చేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి పిరియా సాయిరాజ్‌ మాట్లాడుతూ ‘గృహనిర్మాణ శాఖలో ఇంజనీరింగ్‌ సిబ్బంది మధ్య సమన్వయం లేదు. వారి లోపం మాకు శాపంగా మారింది. కవిటి, సోంపేట మండలాల్లో గడపగడపకు కార్యక్రమానికి వెళితే లబ్ధిదారులు నిలదీస్తున్నారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా అయితే కష్టమని నిట్టూర్చారు. వీటిపై మంత్రి రమేష్‌ స్పందించారు. గృహ నిర్మాణంపై అలసత్వం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. లబ్ధిదారుడికి కచ్చితంగా 20 టన్నుల ఇసుక అందించాలని అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణం యజ్ఞంలా సాగించాలని.. డిసెంబరు 21 నాటికి సామూహిక గృహ ప్రవేశాలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్‌, రెడ్డి శాంతి, హౌసింగ్‌ పీడీ గణపతి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:59:14+05:30 IST

Read more