బంగారం దుకాణంలో చోరీ

ABN , First Publish Date - 2022-11-30T00:05:43+05:30 IST

కోటబొమ్మాళి మెయిన్‌రోడ్డులో స్వామివారి సందులోని ఓ బంగారు దుకాణంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ జరిగింది.

బంగారం దుకాణంలో చోరీ

టెక్కలి (కోటబొమ్మాళి): కోటబొమ్మాళి మెయిన్‌రోడ్డులో స్వామివారి సందులోని ఓ బంగారు దుకాణంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తంగుడు నాగభూషణ్‌కి చెందిన బంగారం దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు కోసి లోపలకు ప్రవేశించి 220 గ్రాముల బంగారం, 25 కిలోల వెండి సామగ్రీ అపహరించారు. మంగళవారం ఉదయం 9 గంటలకు యథావిధిగా దుకాణానికి వెళ్లిన యజమాని తంగుడు నాగభూషణ్‌ తాళాలు కోసి ఉండడాన్ని గమనించారు. వెంటనే పోలీస్‌లకు సమాచారం అందించారు. టెక్కలి సీఐ చంద్రమౌళి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి ఎస్‌ఐలు షేక్‌ ఖాదర్‌ బాషా, మధుసూధనరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్‌ ఘటనా స్థలం నుంచి వైశ్యవీధి గుండా దొంగలు వెళ్లినట్టు సూచించింది. క్లూస్‌ టీం ఆధారాలు సేకరించింది. దుకాణానికి షట్టర్‌ లేకుండా చెక్క తలుపులు ఉండటం, సీసీ కెమెరాలు లేకపోవడం, వీఽధిలో ఉన్న షాపులకు సీసీ కెమెరాలున్నటికీ అవి పనిచేయకపోవడం వల్ల చోరీకి సులభతరమైందని పోలీసులు భావిస్తున్నారు. బాధితుడు నాగభూషణ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - 2022-11-30T00:05:44+05:30 IST