మంత్రుల మాటకే దిక్కులేదు

ABN , First Publish Date - 2022-09-09T03:58:53+05:30 IST

జిల్లాలో సమస్యలు పేరుకుపోతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా సమీక్షా సమావేశం(డీఆర్సీ) జరగనుంది. ఈ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి బొ

మంత్రుల మాటకే దిక్కులేదు
జిల్లాపరిషత్‌ సమావేశ మందిరం


టిడ్కో ఇళ్ల డీడీలు ఇవ్వని వైసీపీ ప్రభుత్వం
కొద్దిమందికే ఇళ్లు ఇచ్చి మమ అనిపించిన వైనం
నత్తనడకన ప్రభుత్వ భవనాల నిర్మాణం
ముడిసరుకు ధరలు పెరగడమే కారణం
ఈ సమస్యలు ప్రస్తావించిన సీదిరి, ధర్మాన
నాలుగు నెలలైనా పట్టించుకోని సర్కారు
నేడు జడ్పీలో డీఆర్సీ సమావేశం

టిడ్కో ఇళ్ల కోసం చాలామంది డీడీలు కట్టారు. జగనన్న కాలనీల్లో వీరికి ఇళ్లు ఇస్తామన్నాం. వీరికి డీడీల మొత్తం వెనక్కి ఇవ్వాలి.
- మంత్రి సీదిరి

భవన నిర్మాణ ముడిసరుకు ధరలు పెరిగిపోయాయి. ఐరన్‌, సిమెంట్‌, ఇసుక ఎస్‌ఎస్‌ఆర్‌ ధరలు కుదరక కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ప్రభుత్వ భవనాల నిర్మాణం ముందుకెళ్లలేదు. ఈ విషయం నాకు తెలుసు. పనులు ప్రారంభించపోతే నిధులు వెనక్కిపోతాయి. నిధులు వెనక్కి వెళ్లకూడదు.
- మంత్రి ధర్మాన ప్రసాదరావు

జిల్లా పరిషత్‌ కార్యాలయంలో మే 9న జరిగిన డీఆర్సీ మీటింగ్‌లో ఆ ఇద్దరు మంత్రులు చెప్పిన మాటలివి.
నాలుగు నెలలు గడిచిపోయాయి. మంత్రులు మాటలు నీటిమూటలయ్యాయి. టీడ్కీ డీడీలు ఇప్పటికీ వెనక్కి ఇవ్వలేదు. ఇళ్లు కూడా కొద్దిమందికే అప్పగించారు. అలాగే భవన నిర్మాణ ముడిసరుకుకు ప్రభుత్వం ఇచ్చే ధరలు పెంచలేదు. దీంతో నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి శుక్రవారం డీఆర్సీ మీటింగ్‌ జరుగుతోంది. వీటిపై ఈ సమీక్షలో ఎలాంటి చర్చ జరుగుతుందో మరి!

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

జిల్లాలో సమస్యలు పేరుకుపోతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా సమీక్షా సమావేశం(డీఆర్సీ) జరగనుంది. ఈ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. వాస్తవానికి మూడునెలలకోసారి డీఆర్సీ నిర్వహించాలి. ఈ సారి ఒక నెల ఆలస్యంగా సమీక్ష జరగనుంది.  ఈ ఏడాది మే 9న జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. అప్పట్లో స్వయంగా అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే వివిధ సమస్యలపై ప్రస్తావించారు. కానీ, ఆ సమస్యలకు ఇంతవరకూ మోక్షం చూపలేదు. ఈసారైనా సమస్యల పరిష్కారానికి పాలకులు, అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లావాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

గతంలో చర్చించిన అంశాలివీ..
గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు టిడ్కో ఇళ్ల కోసం వేలాది రూపాయలను డీడీలు తీసి అధికారులకు అందించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోయింది. కానీ ఇంతవరకు పూర్తయిన టిడ్కో ఇళ్లను అప్పగించే విషయంతో తాత్సారం చేస్తోంది. డీడీలు ఇచ్చినవారిలో కొంతమందికి ఇళ్లను కేటాయించారు. కానీ, శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస మునిసిపాలిటీల్లో వేలాది మందికి ఇళ్లు మంజూరు చేయలేదు. డీడీలు వెనక్కి ఇవ్వడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారనే విషయాన్ని పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు గత సమీక్షలో వీటిని ప్రస్తావించారు.  అయినా ఇప్పటివరకు ఇళ్లు కేటాయించలేదు. డీడీల మొత్తం కూడా వెనక్కి ఇవ్వలేదు. దీంతో లబ్ధిదారులు చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకోవాల్సి వస్తోంది.

- గ్రామాలు.. మండలాల్లో సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్లు, ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్లు తక్కువగా ఉండడమే దీనికి కారణమని మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు గత డీఆర్సీలో ప్రస్తావించారు. కానీ ఇంతవరకు రేట్ల పరిస్థితిలో మార్పు రాలేదు. ఇప్పటికీ ప్రభుత్వ భవనాల నిర్మాణం నత్తనడకనే జరుగుతున్నాయి.
- ఇక పలువురు ప్రజాప్రతినిధులు.. గ్రామాల్లో ఉపాధిహామీ పనుల నిర్వహణకుగాను ఖాళీగా ఉన్న  క్షేత్రసహాయకుల పోస్టులు భర్తీచేయాలని కోరారు. కానీ పూర్తిస్థాయిలో భర్తీ జరగలేదు. పక్కగ్రామాల క్షేత్రసహాయకులు.. ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు.
- ఎచ్చెర్ల, చిలకపాలెంతోపాటు పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితమయ్యాయని.. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌ కింద పనులు చేపట్టాలని ప్రజాప్రతినిధులే కోరారు. కానీ అక్కడ భూగర్భ జలాల కాలుష్య నివారణకు తీసుకున్న చర్యలు లేవు. కొత్తగా బోర్లను కూడా వేయలేదు.
- జిల్లాలో ఇళ్ల నిర్మాణదారులకు ఇసుక కొరత వెంటాడుతోంది. జగనన్న కాలనీల్లో ఆశించినస్థాయిలో మౌలిక వసతులు లేవు. పునాదుల నుంచి గోడల దశలోనే నిలిచిపోయిన ఇళ్లు అత్యధికంగా ఉన్నాయి. ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు ఆశించినస్థాయిలో జరగడం లేదు.
- ఖరీఫ్‌ ముందే సాగునీటి వనరులను బాగుచేయాలని ప్రజాప్రతినిధులు కోరారు. ఇప్పటికీ అదే సమస్య రైతులను వెంటాడుతోంది. ముఖ్యంగా టెక్కలి, నందిగాం ప్రాంతాల్లో వంశధార కాలువలకు మరమ్మతులు చేపట్టలేదు. దీనిపై ఇటీవల రైతులు ఆందోళన చేశారు. ఆమదాలవలస మండలంలో సాగునీటి కాలువలను రైతులే బాగు చేసుకున్నారు.
- గతేడాదికి సంబంధించి ఉపాధిహమీ పథకంలో మెటీరియల్‌ కాంపోనెంట్‌తో చేపట్టాల్సిన పనులు పూర్తిచేయలేదు. దీంతో పనులు రద్దయ్యాయి.
- జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా ఆశించిన స్థాయిలో పనులు జరగడంలేదు. పల్లెల్లో కలుషిత నీటినే తాగుతున్నారు.
- ఎక్కడికక్కడ రోడ్లు పాడపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇలా జిల్లావాసులను వివిధ సమస్యలు వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొక్కుబడిగా కాకుండా.. సమస్యల పరిష్కారం దిశగా సమీక్ష నిర్వహించాలని జిల్లావాసులు కోరుతున్నారు.


Updated Date - 2022-09-09T03:58:53+05:30 IST