ఖర్చు ఎక్కువ.. కమీషన్‌ తక్కువ

ABN , First Publish Date - 2022-12-09T23:46:43+05:30 IST

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్తవిధానం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఎసీఎస్‌) పాలిట శాపంగా మారింది. మిల్లర్లు, మధ్యవర్తులు చేసే పని పీఏసీఎస్‌లపై పడింది. ఓవైపు నిర్వహణ ఖర్చు పెరుగుతుండగా.. మరోవైపు ప్రభుత్వం అరకొరగా కమీషన్‌ చెల్లిస్తోంది.

ఖర్చు ఎక్కువ.. కమీషన్‌ తక్కువ

- పీఏసీఎస్‌లపై ధాన్యం కొనుగోలు భారం

(మెళియాపుట్టి)

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్తవిధానం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఎసీఎస్‌) పాలిట శాపంగా మారింది. మిల్లర్లు, మధ్యవర్తులు చేసే పని పీఏసీఎస్‌లపై పడింది. ఓవైపు నిర్వహణ ఖర్చు పెరుగుతుండగా.. మరోవైపు ప్రభుత్వం అరకొరగా కమీషన్‌ చెల్లిస్తోంది. దీంతో ఆర్థిక భారం మోయలేమని నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. సిబ్బంది జీతాలు, నిర్వహణకే ప్రభుత్వం ఇస్తున్న కమీషన్‌ సరిపోతుందని, ఇప్పుడీ ధాన్యం కొనుగోలు ఎలా చేపట్టాలని ప్రశ్నిస్తున్నారు. కమీషన్‌ పెంచాలని కోరుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 371 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించింది. వీటిలో 191 కేంద్రాలను 49 పీఏసీఎస్‌ సంఘాలకు అప్పగించింది. మిగతావి మార్కెట్‌ శాఖ, జీసీసీ, ఇతర ఏజెన్సీలకు ఇచ్చింది. జిల్లాలో ధాన్యం కోనుగోలు అధికంగా పీఏసీఎస్‌లు ద్వారానే జరుగుతున్నాయి. రైతుల నుంచి సేకరించిన ధాన్యం ఆన్‌లైన్‌లో నమోదు చేసి మిల్లర్లకు పంపేవరకూ పీఏసీఎస్‌లదే బాధ్యత. రైతుభరోసా కేంద్రాల్లో టెక్నికల్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, సహాయకులను నియమించి వారికి పీఏసీఎస్‌ల ద్వారానే జీతాలు ఇవ్వాలి. టెక్నికల్‌ అసిస్టెంట్‌కు నెలకు రూ.10,800, డేటాఎంట్రీ ఆపరేటర్‌కు రూ.8వేలు, ఇద్దరు సహాయకులకు రూ.6వేలు చొప్పున జీతం చెల్లించాలి. దీంతో పీఏసీఎస్‌ పరిధిలో ఒక రైతుభరోసా కేంద్రం నిర్వహణకు రూ.30,800 ఖర్చువుతుంది. కాటా, తేమశాతం మిషన్లను కూడా ఇవే కోనుగోలు చేయాల్సి ఉంది.

క్వింటాకు 60 పైసలే మిగులు

పీఏసీఎస్‌ల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తే క్వింటాకు ప్రభుత్వం రూ.31.60 పైసలు కమీషన్‌ ఇస్తుంది. ఇందులో ఆరు రూపాయలు ఇన్‌కంటాక్స్‌ రూపంలో కట్టాలి. హమాలీలకు క్వింటాకు రూ.25 ఇవ్వాలి. ఈ ఖర్చులన్నీ పోతే పీఏసీఎస్‌లకు కేవలం రూ.60 పైసలే మిగులుతుంది. గతేడాది కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం ఇటీవల కమీషన్‌ చెల్లించింది. 2020లో జరిగిన కొనుగోలుకు సంబంధించి ఇంకా చెల్లించలేదు. ప్రభుత్వం కమీషన్‌ పెంచడంతో పాటు కళాసీల కూలి డబ్బులను సివిల్‌ సప్లయ్‌ ద్వారా ఇవ్వాలని పీఏసీఎస్‌ కార్యదర్శులు కోరుతున్నారు.

ప్రభుత్వం ఇస్తుందే..

ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏజెన్సీలకు ప్రభుత్వం ఇస్తున్న కమీషన్‌నే చెల్లిస్తున్నాం. గతేడాదికి సంబంధించిన కమీషన్లు ఇస్తున్నాం. ఈ ఏడాది కమీషన్‌ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తాం.

- భీమారావు, సీఎస్‌డీటీ, పాతపట్నం.

Updated Date - 2022-12-09T23:46:46+05:30 IST