వైసీపీ పాలనలో రైతులకు కన్నీరే

ABN , First Publish Date - 2022-12-12T23:35:52+05:30 IST

‘పండించిన ధాన్యం విక్రయించేందుకు అన్నదాతలు అవస్థలు పడేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వైసీపీ పాలనలో రైతులకు కన్నీరే మిగులుతోంది. ఇది మంచిది కాదు’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

వైసీపీ పాలనలో రైతులకు కన్నీరే
సమావేశంలో మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు

- ధాన్యం కొనుగోలు నిబంధనలతో హడల్‌

- అన్నదాతలకు అండగా ఉంటాం

- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

నరసన్నపేట, డిసెంబరు 12: ‘పండించిన ధాన్యం విక్రయించేందుకు అన్నదాతలు అవస్థలు పడేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వైసీపీ పాలనలో రైతులకు కన్నీరే మిగులుతోంది. ఇది మంచిది కాదు’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరుతో అన్యాయానికి గురవుతున్న అన్నదాతలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. సోమవారం నరసన్నపేటలోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడింది. గతంలో కంటే రైతుల ఆత్మహత్యలు పెరిగాయని కేంద్రప్రభుత్వమే పార్లమెంట్‌లో తెలిపింది. మూడున్నరేళ్లలో వైసీపీ నేతలు జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా అదనంగా సాగునీరు ఇవ్వలేకపోయారు. జిల్లాలో 12.5లక్షల మెట్రిక్‌ టన్నులు ధాన్యం పండుతాయని వ్యవసాయ, గణాంక శాఖ అధికారులు నివేదిక ఇస్తే.. ప్రభుత్వం కేవలం 4.5 మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేయడం తగదు. రైతుభరోసా కేంద్రాలు పనికి మాలిన కేంద్రాలు. రైతుల దగ్గరకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేయడం లేదు. రైతులు ధాన్యం ఇచ్చినా.. ఏ మిల్లుకు పంపించాలో తెలియక రోజంతా వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. గోనె సంచులు, రవాణా చార్జీలు, హమాలీ వేతనాలు రైతులే చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి మిల్లును మ్యాపింగ్‌ చేసి ధాన్యం కొనుగోలు చేసేలా ఉండాలి. బ్యాంకు డిపాజిట్‌ ఒక్కొక్క మిల్లరుకు ఒక్కో విధంగా ఎందుకు ఉందో తెలియజేయాలి. రైతుల ఇబ్బందులను క్షేత్రస్థాయిలో కలెక్టర్‌ పరిశీలించాలి. ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేయాలి. లేదంటే రైతుల తరపున టీడీపీ ఉద్యమిస్తుంది’ అని అచ్చెన్న తెలిపారు. అంతుకుముందు ఇటీవల మృతి చెందిన బలగ నాగేశ్వరరరావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, తెలుగు రైతు కార్యదర్శి జల్లు చంద్రమౌళి, శిమ్మ చంద్రశేఖర్‌, రోణంకి కృష్ణంనాయుడు, కిల్లి వేణుగోపాలస్వామి, బెవర రాము, ఉణ్న వెంకటేశ్వరరావు, పీస కృష్ణ, కింజరాపు రామారావు, నియోజవర్గ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T23:35:54+05:30 IST