రేషన్‌ బియ్యంపై నిఘా

ABN , First Publish Date - 2022-09-18T05:13:24+05:30 IST

రేషన్‌ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ హెచ్చరించారు. శనివారం ఆయన జిల్లాలో పర్యటించారు. శ్రీకాకుళం నగరంలో ఎండీయూ వాహనాల ద్వారా చేపడుతున్న బియ్యం పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.

రేషన్‌ బియ్యంపై నిఘా
గార : మిల్లర్ల సంఘ ప్రతినిధులతో మాట్లాడుతున్న కమిషనర్‌ అరుణ్‌కుమార్‌

- అక్రమ రవాణా చేస్తే చర్యలు
- పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌
కలెక్టరేట్‌/గార, సెప్టెంబరు 17:
రేషన్‌ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ హెచ్చరించారు. శనివారం ఆయన జిల్లాలో పర్యటించారు. శ్రీకాకుళం నగరంలో ఎండీయూ వాహనాల ద్వారా చేపడుతున్న బియ్యం పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. గార మండలంలో రామచంద్రాపురం, గార, శ్రీకూర్మంలోని రైస్‌ మిల్లులను తనిఖీ చేశారు. బియ్యం తయారీ విధానాన్ని పరిశీలించారు. లెవీ బియ్యం సేకరణలో రైతులు మిల్లులకు ధాన్యం తీసుకురావడం, నిల్వ చేయడం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర రైస్‌ మిల్లర్ల సంఘం కార్యదర్శి ఆర్‌వీఎస్‌ వెంకటేశ్వరరావు (వాసు) కమిషనర్‌కు వివరించారు. ఎండీయూ ఆపరేటర్లకు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను ఆ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

ఆర్‌బీకేల ద్వారానే ధాన్యం కొనుగోలు
రైతుభరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోలు చేపడతామని, అలాగే  ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ (ఎఫ్‌టీఓ) ద్వారా 21రోజుల్లో రైతు ఖాతాల్లోకి నగదు జమచేస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ తెలిపారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇక నుంచి రైతులు తమ ధాన్యాన్ని మిల్లర్లకు  అందజేయాల్సిన అవసరం లేదన్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా వాటిని కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. వలంటీర్లు రూట్‌ ఆఫీసర్లగా వ్యవహరిస్తారని, ధాన్యం తూనిక వేస్తారని చెప్పారు. అనంతరం ఎఫ్‌టీఓ జనరేట్‌ చేస్తారని, దీనివల్ల రైతులు ఇచ్చిన ప్రతి గింజకు చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. సమావేశంలో జేసీ ఎం.విజయసునీత, పౌరసరఫరాల అధికారి డీవీ రమణ, మేనేజర్‌ పి.జయంతి తదితరులు పాల్గొన్నారు.

 

Read more