అంతన్నారు.. ఇంతన్నారు!

ABN , First Publish Date - 2022-11-25T00:17:06+05:30 IST

వంశధార నదిపై నేరడి బ్యారేజీ నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. నేరడి బ్యారేజీతోపాటు అనుబంధ కట్టడాలకు సంబంధించి 2017లో తుది ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలు వంశధార నది మిగులు జలాలను 50:50 నిష్పత్తిలో వినియోగించేందుకు మార్గం సుగమమైంది. అయితే దీనిపై ఒడిసా ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది.

అంతన్నారు.. ఇంతన్నారు!
నేరడి బ్యారేజీ నిర్మించాల్సింది ఇక్కడే...

గత ఏడాది ఒడిసా సీఎంను కలిసిన సీఎం జగన్‌

ఇప్పటికీ ఎటూ తేలని.. నేరడి ప్రాజెక్టు

ఆ స్థానంలో ఎత్తిపోతల పథకం

గడువు దాటినా పూర్తికాని ఉద్దానం ప్రాజెక్టు పనులు

(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి/ హిరమండలం)

ఇచ్ఛాపురంలో కిడ్నీరోగుల కోసం రూ.765కోట్లతో వంశధార రిజర్వాయర్‌ నుంచి నీటిని ఇచ్ఛాపురం తెప్పించేందుకు ప్రాజెక్టును తీసుకువచ్చాం. పలాసలో రూ.50 కోట్లతో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ నిర్మాణ పనులు చేపడుతున్నాం. వంశధార ప్రాజెక్టులో నేరడి బ్యారేజీ విషయమై ఇప్పటికే ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో మాట్లాడాను.

- నరసన్నపేట వేదికగా సీఎం జగన్‌ బుధవారం చేసిన వ్యాఖ్యలివి.

ఇదీ వాస్తవం

టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల ఆస్పత్రికి బీజం పడింది. పలాస రైల్వేకాలనీలో 2018 అక్టోబరు 17న ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వంశధార నదిపై నేరడి బ్యారేజీ నిర్మాణంతో పాటు అనుబంధ కట్టడాలకు 2017లో తుది ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే దీనిపై ఒడిసా ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది.

........................................

వంశధార నదిపై నేరడి బ్యారేజీ నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. నేరడి బ్యారేజీతోపాటు అనుబంధ కట్టడాలకు సంబంధించి 2017లో తుది ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలు వంశధార నది మిగులు జలాలను 50:50 నిష్పత్తిలో వినియోగించేందుకు మార్గం సుగమమైంది. అయితే దీనిపై ఒడిసా ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది. నేరడి బ్యారేజీ నిర్మాణం పూర్తిచేస్తే వంశధార నీటిని వరదకాలువలోకి మళ్లించి హిరమండలం రిజర్వాయర్‌లోకి 19.05 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు అవకాశం ఏర్పడేది. తద్వారా రబీ సీజన్‌లోనూ పుష్కలంగా సాగునీరు విడుదలయ్యేది. ఈ నేపథ్యంలో గత ఏడాది నవంబరు 9న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను సీఎం జగన్‌, అధికారులు కలిశారు. నేరడి బ్యారేజీకి అడ్డంకుల తొలగింపుపై చర్చించారు. కానీ ఇప్పటికీ దీనిపై ఒడిశా ప్రభుత్వం అనుకూలంగా చర్యలు తీసుకోలేదు. సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పి ఉండడంతో.. అది తేలేవరకు బ్యారేజీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వీలుపడదు. ఇద్దరు సీఎంలు చేసిన చర్చలు విఫలమైనట్టే. కానీ దీనిపై వైసీపీ ప్రచార ఆర్భాటాలు చేస్తూనే ఉంది. ఇదిలా ఉండగా, నేరడి స్థానంలో ప్రత్యామ్నాయంగా ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు రూ.176కోట్లతో ప్రతిపాదించారు. ఇప్పటికి పరిపాలన, సాంకేతిక అనుమతులతో పాటు జ్యుడిషియల్‌ ప్రివ్యూ పూర్తయింది. నేడు టెండర్లు ఖరారు కానున్నట్టు విశ్వసనీయ సమాచారం. వచ్చేఏడాది వర్షాకాలంలోగా పనులు పూర్తిచేసి ఎత్తిపోతల పథకం వినియోగంలోకి తేవాల్సి ఉంటుంది.

ఉద్దానం ప్రాజెక్టు పనుల గడువు పెంపు

కిడ్నీ రోగాల వ్యాప్తికి కలుషిత నీరు కారణమని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వంశధార ప్రాజెక్టు నుంచి నీటిని ఉద్దానం ప్రాంతానికి తీసుకురావాలని నిర్ణయించారు. ఏడు మండలాల పరిధిలో 807 గ్రామాలకు సురక్షిత నీటిని అందజేయాలని భావించారు. ఈ మేరకు 2020 ఆగస్టులో రూ.700కోట్లతో ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. 363 ట్యాంకులను నిర్మించి.. రిజర్వాయర్‌ నుంచి నీటిని ట్యాంకులకు తీసుకువస్తారు. అక్కడ నుంచి జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా ఏర్పాటు చేస్తున్న ఇంటింటికీ కొళాయిల ద్వారా తాగునీటిని అందించాల్సి ఉంది. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ఉద్దానం ప్రాజెక్టు పూర్తికావాలి. కానీ పనులు పూర్తికాలేదు. ఈఓటీ (ఎక్సెటెన్షన్‌ ఆఫ్‌ టైం) పెంపుదల చేసి.. వచ్చేఏడాది మార్చి వరకు గడువు ఇచ్చారు. ప్రస్తుతం 80 శాతం పనులు అయ్యాయని, రూ.385 కోట్లు బిల్లులు చెల్లించారని అధికారులు చెబుతున్నారు. కాగా.. గత ప్రభుత్వ హయాంలోనే కిడ్నీరోగుల కోసం డయాలసిస్‌ సెంటర్లు, ఎన్టీఆర్‌ సుజల పథకం వంటివి ఏర్పాటు చేశారు. అయితే టీడీపీ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని.. వైసీపీ హయాంలోనే అందరికీ మేలు చేకూరుతోందని సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై అంతా చర్చించుకుంటున్నారు.

ఒక్క ప్రాజెక్టూ లేదు

హిరమండలం: వైసీపీ మూడున్నరేళ్ల పాలనలో జిల్లాలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదు. జిల్లాను సస్యశ్యామలం చేయాల్సిన వంశధార ఫేజ్‌-2, స్టేజ్‌-2 పనులు పడకేశాయి. ఈ క్రమంలో ప్రభుత్వం గడువు పెంచుతూనే ఉంది. వంశధార నీటిని ఇచ్ఛాపురం వరకు మళ్లించేందుకు గత ప్రభుత్వం ప్రయత్నించింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు మరుగున పడింది.

- కాట్రగడ నుంచి హిరమండలం రిజర్వాయర్‌ వరకు వరద కాలువ, సింగిడి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, హిరమండలం రిజర్వాయర్‌కు సంబంధించి మేజర్‌ పనులు టీడీపీ హయాంలోనే అయ్యాయి.

- హిరమండలం రిజర్వాయర్‌ పూర్తి చేసేందుకు 22 గ్రామాలను ఖాళీ చేయించి.. నిర్వాసితులకు అదనంగా రూ.5 లక్షలు చొప్పున యూత్‌ప్యాకేజీ మంజూరు చేసింది. 82శాతం మేర పనులు పూర్తయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. మూడున్నరేళ్లలో పది శాతం మాత్రమే పనులు అయ్యాయి. కాంట్రాక్టర్లకు రూ.10కోట్ల మేర బకాయిలు ఉండడంతో.. మిగిలిన 8 శాతం పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.

- ఈ ఏడాది డిసెంబరు నాటికి వంశధార ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని పాలకులు ప్రకటించారు. కానీ, వచ్చే ఏడాది ఖరీఫ్‌ నాటికి కూడా పనులు పూర్తయ్యే పరిప్థితి కనిపించడంలేదు. ప్రాజెక్టు వ్యయం పెంచినా.. నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు.

- వంశధార నిర్వాసితులకు ఎన్నికల ప్రచార సమయంలో 2013 చట్టం ప్రకారం పరిహారం ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కొద్ది నెలల క్రితం ఎకరాకు రూ.లక్ష చొప్పున ఇచ్చారు. అది కూడా ఇంకా 30 శాతం మంది నిర్వాసితులకు పరిహారం అందలేదు.

- సింగిడి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ సంబంధించి రైతులకు పరిహారం పంపిణీలో తాత్సారం చేస్తున్నారు.

Updated Date - 2022-11-25T00:17:06+05:30 IST

Read more