పసరు మందుతో.. అసలుకే ఎసరు!

ABN , First Publish Date - 2022-09-14T05:19:25+05:30 IST

జిల్లాలో ఏటా సుమారు 600 మంది పాముకాటుకు గురవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 30 నుంచి 40 మంది ప్రాణాలు కోల్

పసరు మందుతో.. అసలుకే ఎసరు!


జిల్లాలో పెరిగిన పాముకాట్లు
మంత్రగాళ్లు, పసర మందులను ఆశ్రయిస్తున్న ప్రజలు
వైద్యం సకాలంలో అందక మూల్యం
అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో యాంటీస్నేక్‌ వీనమ్‌ ఇంజక్షన్లు
సద్వినియోగం చేసుకోవాలంటున్న వైద్యాధికారులు
(హరిపురం/మెళియాపుట్టి)
- ఈ నెల 11న మందస మండలం బసవసాయి గ్రామానికి చెందిన సవర సుజాత అనే మహిళ పాముకాటుతో మృతిచెందింది. ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటు వేయడంతో అస్వస్థతకు గురైంది. తొలుత మంత్రగాడి వద్దకు తీసుకెళ్లగా.. పరిస్థితి విషమించడంతో పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ సుజాత మృతిచెందింది.

- గత నెల 16న టెక్కలి మండలం నరహరిపురం గ్రామానికి చెందిన ఆదియ్య పాముకాటుతో మృత్యువాత పడ్డాడు. పశువులు మేపేందుకు పొలానికి వెళ్లిన ఆదియ్యకు పాముకాటు వేయడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.

- గత నెల 17న పాతపట్నం మండలం సాకిపల్లి గ్రామానికి చెందిన వరదలు అనే వ్యక్తి పాముకాటుతో మృతిచెందాడు. పొలంలో పనిచేస్తుండగా పాముకాటు వేయడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశాడు.


జిల్లాలో ఏటా సుమారు 600 మంది పాముకాటుకు గురవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 30 నుంచి 40 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఎక్కువ మంది వైద్యసేవలు అందడంలో జాప్యం వల్లే మృత్యువాత పడుతున్నట్టు తెలుస్తోంది. పసరు మందు తాగించి, మంత్రగాళ్ల వద్దకు తీసుకెళ్లి వైద్యం అందిస్తున్నారు. పరిస్థితి విషమించిన తరువాత ఆస్పత్రులకు తీసుకెళుతున్నారు. మూల్యం చెల్లించుకుంటున్నారు. పాముకాటు వేసిన తరువాత అనవసర భయాందోళనతో ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారూ ఉన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సర్పాలు, విష జంతువులు పొలాల్లో సంచరిస్తుంటాయి. గట్లపై, పచ్చగడ్డి, తుప్పల మాటున ఉంటాయి. మనిషి సంచరించినప్పుడు భయంతో కాటు వేస్తుంటాయి. అందుకే పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రిపూట వెళ్లే వారు అన్నిజాగ్రత్తలు తీసుకోవాలి.

 భయంతో ముప్పే..
పాము కరవగానే భయపడకుండా ఏ పాము కరిచిందో గమనించాలి. కాటువేసిన భాగాన్ని శుభ్రంగా కడగాలి. రక్తపింజరి కాటువేస్తే మాత్రం చిగుళ్లు, మూత్రపిండాల నుంచి రక్తస్రావం అవుతుంది. నాగుపాము కరిస్తే మాత్రం కళ్లు మూతలుపడడం, వాపురావడం వంటివి ప్రధాన లక్షణాలు. నాగుపాము, కట్లపాము, రక్తపింజరి ఏది కరచినా ఒక మిల్లి లీటరు వరకు విషం కక్కే అవకాశం ఉంది. ఒక మిల్లిలీటరు విషంలో పదో వంతు శరీరంలోకి వెళ్తే వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది. పాము కరచిన క్షణం నుంచి ఆరు గంటలలోగా యాంటీస్నేక్‌ వీనమ్‌ ఇంజక్షన్‌ వేయిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఉంటుంది.

 గణాంకాలివి...
జిల్లాలో ఏటా 600 మంది వరకూ పాముకాటుకు గురవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ నుంచి గత ఏడాది నుంచి ఇప్పటివరకూ అన్ని ఆసుపత్రుల్లో తొమ్మిది వేల యాంటి స్నేక్‌ వీనమ్‌ ఇంజక్షన్‌ అందజేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఇందులో ఎనిమిదివేల రెండు వందల వరకూ డోసులు వినియోగించినట్టు తెలుస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 1,000 యాంటిస్నేక్‌ వీనమ్‌ ఇంజక్షన్లు ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించినట్టు వైద్యఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. పాముకాటు మరణాలు, ప్రమాదాలు అధికంగా ఏజెన్సీ ప్రాంతంలో చోటుచేసుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నాటు వైద్యంపై ఆధారపడుతుండటంతో ప్రాణాలు కోల్పోవలసి వస్తోంది. వారిలో చైతన్యం చేయాల్సిన బాధ్యత అఽధికారులపై ఉంది.

 ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

పాము కాటేస్తే ఆదైర్యపడకూడదు. చాలావరకు సర్పాలు విషపూరితం కానందున దైర్యంతో ఉంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. కాటేసిన భాగం పైన వస్త్రంకానీ, తాడుతోకానీ కట్టివేసి సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలి. జిల్లాలో 250 రకాల పాములు తిరుగుతున్నట్లు ఒక నివేదక చెబుతోంది. వీటిలో 98 ఽశాతం విషపూరితం కానివే. కాటేసిన వ్యక్తిని నడిపించకుండా.. సాధ్యమైనంత వరకూ ఎత్తుకుని లేదా స్టెచ్చర్‌పై తీసుకెళ్లడం మంచిది. రోడ్డుపైన, పొలంగట్లు పైన నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శబ్దం చేస్తూ నడిస్తే పురుగులు, పాములు దూరంగా పోతాయి. చేతిలో కర్ర, టార్చిలైటు ఉంచుకోవడం మంచిది. పాము కాటేసిన తరువాత మంత్రగాళ్లను రప్పించడం, పసరు వైద్యం చేయకూడదు. వెంటనే ఆస్పత్రికి తరలించాలి.

 భయంతో చేటు
పాము కాటువేసిందన్న భయంతోనే ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారు. పాములు ప్రకృతి ప్రసాదించిన వరం. పొలాల్లో పాములు సంచరించడం వల్ల పంటకు హాని కలిగించే ఎలుకలు, ఇతర కీటకాలు అంతమవుతున్నాయి. పంటలకు నష్టం వాటిల్లకుండా పాములు కాపాడుతున్నాయి. అయితే పాము కరిచిన వెంటనే సమీప ఆస్పత్రికి వెళ్లి యాంటీ స్నేక్‌ వీనమ్‌ ఇంజక్షన్‌ వేసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.
-డాక్టర్‌ టి.శైలజ, ప్రభుత్వ వైద్యాధికారి


 జాగ్రత్తలు తీసుకోవాలి
వర్షాకాలంలోనే పాముకాట్లు అధికంగా ఉంటాయి. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాముకాటు వేసిన వెంటనే ఆస్పత్రిని ఆశ్రయించాలి. నాటు వైద్యం పేరిట జాప్యం చేస్తే మాత్రం ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాముకాటుకు సంబంధించి ఇంజక్షన్లు నిత్యం అందుబాటులో ఉంటాయన్న విషయం గమనించుకోవాలి. పాము కరచిన అర గంట వ్యవధిలో ఇంజక్షన్‌ ఇస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.
- జి.గణపతిరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో, టెక్కలి


Read more