సిక్కోలు.. సమరయోధులు

ABN , First Publish Date - 2022-08-11T04:54:00+05:30 IST

ఎంతోమంది యోధులు.. బ్రిటీష్‌ అరాచక పాలనపై ఎలుగెత్తారు. లాఠీ దెబ్బలు తిన్నారు. రక్తం ధారపోశారు. జైలు జీవితం గడిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తెల్లవారి పాలన అంతమొందించడమే లక్ష్యంగా సాగారు. బ్రిటీష్‌ వారికి చెమటలు పట్టించి.. సమరయోధులుగా నిలిచారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా.. జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుల గురించి తెలుసుకుందాం.

సిక్కోలు.. సమరయోధులు
నాటి ప్రధాని నీలంసంజీవరెడ్డితో.. గౌతు లచ్చన్న(ఫైల్‌)

- స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించిన జిల్లావాసులు

ఎంతోమంది యోధులు.. బ్రిటీష్‌ అరాచక పాలనపై ఎలుగెత్తారు. లాఠీ దెబ్బలు తిన్నారు. రక్తం ధారపోశారు. జైలు జీవితం గడిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తెల్లవారి పాలన అంతమొందించడమే లక్ష్యంగా సాగారు. బ్రిటీష్‌ వారికి చెమటలు పట్టించి.. సమరయోధులుగా నిలిచారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా.. జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుల గురించి తెలుసుకుందాం.

సర్దార్‌గా.. గౌతు లచ్చన్న
(పలాస/సోంపేట)

స్వాతంత్రోద్యమ యోధుడు... ఆంధ్ర రైతోద్యమ రథసారథి.. బడుగు, బలహీనవర్గాల నాయకుడిగా సర్దార్‌ గౌతు లచ్చన్న కీర్తిప్రతిష్ఠలు పొందారు. సోంపేట మండలం బారువలో నిరుపేద గీతకార్మిక కుటుంబానికి చెందిన గౌతు చిట్టయ్య, రాజమ్మ దంపతులకు 1909 ఆగస్టు 16న లచ్చన్న జన్మించారు. లచ్చన్న దేశ విముక్తి కోసం జైలు పాలై చివరకు స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర వహించి సర్దార్‌గా నిలిచారు. ప్రజలను దోపిడీ చేస్తున్న జమీందారులపై ఉద్యమానికి దిగి మార్గదర్శకులయ్యారు. స్వాతంత్య్ర సమరయోధుడు, సమకాలీన రాజకీయ నాయకుడు, ఎస్టేట్‌ రైతాంగ పోరాటాన్ని నడిపి రైతోద్యమ నాయకుడయ్యారు. స్వాతంత్య్ర పోరాటంలో కోరుగంటి నర్సింహమూర్తి మాస్టారు ప్రేరేపించిన వ్యక్తిగా లచ్చన్న తన స్వీయ జీవితచరిత్రలో రాసుకున్నారు. 1930లో మహాత్మాగాంధీ  పిలుపుమేరకు ఉప్పుసత్యాగ్రహ ఉద్యమంలో చేరి.. జైలు పాలయ్యారు. నౌపడ స్టేషన్‌లో దిగుతుండగా లచ్చన్నను అరెస్టు చేశారు. ‘స్వాతంత్య్ర భారత్‌కు జై’ అనే నినాదం చేయగా నెలరోజుల పాటు లచ్చన్నను, ఆయన అనుచరులను బరంపురం జైలులో బంధించారు. 1938 నవంబర్‌ 7న ఇచ్ఛాపురం నుంచి మద్రాస్‌కు ఆంధ్రరాష్ట్ర రైతాంగ రక్షణ మహాయాత్ర నిర్వహించి చరిత్రపుటల్లోకి మొదటిసారిగా ఎక్కారు. అదే సంవత్సరం పలాసలో కిసాన్‌ మహాసభలు నిర్వహించి దేశం నలుమూలల నుంచి వివిధ నాయకులను ఆహ్వానించిన ఘనత ఆయనకే దక్కింది. గౌతు లచ్చన్న 2006 ఏప్రిల్‌ 19న కన్నుమూశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన పోరాట స్ఫూర్తికి గుర్తుగా ఏటా అధికార కార్యక్రమంగా జయంత్యుత్సవాలను నిర్వహిస్తోంది.

పోరాటాల అడ్డా.. కనిమెట్ట గడ్డ
పొందూరు:
స్వాతంత్య్ర సమరయోధుల అడ్డాగా.. పొందూరు మండలంలోని కనిమెట్ట ఖ్యాతి గడించింది. బ్రిటిష్‌ పాలనను అంతమొందించేందుకు స్వరాజ్య గీతాలతో ప్రతిధ్వనించింది. ఈ గ్రామం పది మంది స్వాతంత్య్ర సమరయోధులకు జన్మనిచ్చింది. నంద కృష్ణమూర్తి, నంద ఆదినారాయణ, కూన ఎర్రయ్య, కూన అప్పలసూరి, బొడ్డేపల్లి నారాయణ, గురుగుబెల్లి సత్యనారాయణ, కూన బుచ్చయ్య, బొడ్డేపల్లి రాములు... స్వాతంత్య్ర ఉద్యమంలో భాగస్వామమయ్యారు. గౌతు లచ్చన్న, చౌదరి సత్యనారాయణ సారథ్యంలో ముందుకు సాగారు. ఊరూరా తిరుగుతూ.. ఉద్యమ గీతాలతో ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్ష రగిల్చారు. ఈ క్రమంలో లాఠీ దెబ్బలను తినడమే కాదు.. చీపురుపల్లి, విజయనగరం ప్రాంతాల్లో జైలు జీవితం గడిపారు. స్వరాజ్య సమరంలో బ్రిటిష్‌వారిని బెంబేలెత్తించిన గౌతు లచ్చన్నను నిర్భందించేందుకు ఆంగ్లేయులు ప్రయత్నించారు. ఈ సమయంలో బ్రిటీష్‌ దొరలకు భయపడకుండా కనిమెట్ట యోధులు లచ్చన్నను తోలాపి, ఎస్‌.ఎం.పురం గ్రామాల మధ్య దట్టమైన చెట్ల మధ్య రహస్య భవనంలో దాచారు.

విప్లవ స్ఫూర్తిని రగిల్చిన నంద
 కనిమెట్ట యోధుల్లో నంద కృష్ణమూర్తిది ప్రత్యేక స్థానం. ఈయన విప్లవ గాయకుడు. స్వరాజ్యగీతాలతో ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చారు. యువకుల్లో స్ఫూర్తి నింపారు. అందుకే ఆచార్య ఎన్‌జీ రంగా స్వరాజ్యగీతాలను ఆలపించేందుకు నందా కృష్ణమూర్తిని తనవెంట స్వాతంత్య్ర ఉద్యమ సభలకు తీసుకువెళ్ళేవారు. సమరయోధులకు గుర్తుగా.. గ్రామస్థులు కనిమెట్ట ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దానిపై గ్రామానికి చెందిన సమరయోధుల పేర్లు రాశారు.

పొందూరు నుంచి..
స్వాతంత్య్ర ఉద్యమంలో పొందూరుకు చెందిన ఉరిటి బుచ్చిబాబు కూడా భాగస్వాములయ్యారు. గాంధీజీ శిష్యుడిగా.. ఆయన అడుగుజాడల్లో నడిచారు. లాఠీదెబ్బలకు భయపడకుండా.. ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు.  

చదువులు వదిలి.. ఉద్యమం వైపు
నందిగాం:
నందిగాం మండలం పెంటూరు గ్రామానికి చెందిన అట్టాడ కృష్ణమూర్తి నాయుడు చదువును వదిలి.. విద్యార్థి స్థాయి నుంచే స్వాతంత్య్ర ఉద్యమంవైపు నడిచారు. ఈయన 1902లో జన్మించారు. 1930లో జరిగిన నౌపడా ఉప్పు సత్యాగ్రహం, 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమం.. ఇలా ప్రతి ఘట్టంలో భాగస్వామ్యులయ్యారు. గౌతు లచ్చన్న, పి.శ్యామసుందరరావు, గుంటముక్కల లింగమర్తి, మల్లిపెద్ది క్రిష్ణమూర్తి తదితర అనుచర గణంతో తమవంతు పాత్ర పోషించారు. ఇదే గ్రామానికి చెందిన అట్టాడ రామినాయుడు కూడా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. ఈయన వారసులు అట్టాడ రవిబాబ్జీ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతుండగా, అట్టాడ అరుణాచలం ఎంపీటీసీ సభ్యులుగా వ్యహరించారు. ఇదిలా ఉండగా ఉయ్యాలపేటకు చెందిన దీర్ఘాసి లోకనాధంరెడ్డి స్వాతంత్య్ర ఉద్యమంలో పాలు పంచుకున్నా.. గుర్తింపు దక్కలేదని ఆయన కుమారుడు కృష్ణారావు పేర్కొన్నారు. జమీందారీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని.. స్వాతంత్య్ర పోరాటానికి బాసటగా నిలిచినా యాంటీ కాంగ్రెస్‌ వ్యవహరించడంతో పెన్షన్‌ సైతం పొందలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

Read more