మంత్రుల వద్ద పనిచేస్తున్నానని చెప్పి..

ABN , First Publish Date - 2022-11-30T23:47:06+05:30 IST

ఓఎస్‌డీ(ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ)గా పని చేస్తున్నానని చెప్పి ఓ వ్యక్తి పలువురు యువకులను నిండాముంచాడు. ప్రభుత్వ కొలువులు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్షలు వసూలు చేసి ఉడాయించాడు. అనుకోని విధంగా మరో చీటింగ్‌ కేసులో శ్రీకాకుళం కోర్టుకు హాజరైన అతనిని బాధితులు పట్టుకుని పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు.

మంత్రుల వద్ద పనిచేస్తున్నానని చెప్పి..
పోలీసు స్టేషన్‌ వద్ద బాధితుల ఆందోళన

శ్రీకాకుళం, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ఓఎస్‌డీ(ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ)గా పని చేస్తున్నానని చెప్పి ఓ వ్యక్తి పలువురు యువకులను నిండాముంచాడు. ప్రభుత్వ కొలువులు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్షలు వసూలు చేసి ఉడాయించాడు. అనుకోని విధంగా మరో చీటింగ్‌ కేసులో శ్రీకాకుళం కోర్టుకు హాజరైన అతనిని బాధితులు పట్టుకుని పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం రూరల్‌ మండలం నవనంపాడు ప్రాంతానికి చెందిన దుంగ రితీష్‌నాయుడు.. తాను మంత్రుల వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్నానని, ఈ జిల్లాకు చెందిన మంత్రుల వద్ద పీఏగా పని చేస్తున్న ట్లు కొందరు యువకులను నమ్మించాడు. విజయవాడలో సెక్రటరియేట్‌ ఉద్యోగినని.. ఏ పనైనా చేయగలనని నమ్మించి తన ఉచ్చులోకి యువకులను దింపాడు. ప్రభుత్వ ఉద్యోగాలిప్పించగలనని.. లక్షల రూపాయలు ముందుగా చెల్లిస్తేనే.. తాను ఈ పనిచేసి పెట్టగలనని రితేష్‌నాయుడు నమ్మించాడు. దీంతో శ్రీకాకుళం రూరల్‌ మం డలంతో పాటు శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, ఆమదాలవలస, తదితర మండలాల యువ కులు రితీష్‌కు లక్షల రూపాయలను ఫోన్‌పే ద్వారా, బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లిం చారు. ఇంకొంత నగదును రితేష్‌నాయుడు అన్న అప్పలనాయుడుకు కూడా అంద జేశారు. ఇదంతా కరోనాకు ముందు. అయితే, డబ్బులు తీసుకున్నాక రితీష్‌ ఆచూకీ లేకపోవడంతో స్థానికంగా ఉన్న అతని అన్నను యువకులు సంప్రదించేవారు. అతడు కరోనా సమయంలో మరణించాడు. దీంతో రితీష్‌ ఆచూకీ కోసం యత్నిం చినా ఫలించలేదు. ఇదిలా ఉండగా.. శ్రీకాకుళంరెండో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో కొంతమందిని మోసగించిన కేసులో రితీష్‌ శ్రీకాకుళం కోర్టుకువచ్చాడు. సమాచారం అందుకున్న బాధిత యువకులందరూ కోర్టు వద్ద కాపలాకాసి రితీష్‌ను పట్టుకొని పోలీసుస్టేషన్‌కు స్టేషన్‌కు తీసు కెళ్లారు. అతనిపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. అయితే, రితీష్‌పై కేసు నమోదు చేయకపోవడంపై బాధితులు ఆందోళన చెందుతున్నారు. తాము ఎన్నాళ్ల నుంచో వెతికితే ఇప్పటికి పట్టుబడ్డాడని, చర్యలు తీసుకోకుంటే తాము ఇచ్చిన డబ్బులు ఎలా వసూలు చేయగలమని బాధితులు వాపోయారు. ఇదిలా ఉండగా.. కొంతమంది ప్రజాప్రతినిధులకు చెందిన అనుచరులు స్టేషన్‌కు వచ్చారని బాధితులు చెబుతున్నారు. సుమారు రూ.2 కోట్లకు పైగానే తామందరి వద్ద నుంచి రితీష్‌ వసూలు చేశాడని, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2022-11-30T23:47:06+05:30 IST

Read more