సచివాలయ సేవలు పెంచకుంటే చర్యలు

ABN , First Publish Date - 2022-08-17T06:17:38+05:30 IST

గ్రామ సచివాలయాల్లో సేవలను పెంచకుంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ హెచ్చరించారు.

సచివాలయ సేవలు పెంచకుంటే చర్యలు
లుంగపర్తి సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

 నెలకు 400 దరఖాస్తులు సేకరించాలి

- జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశం

- అనంతగిరి మండలంలో విస్తృత పర్యటన


అనంతగిరి, ఆగస్టు 16: గ్రామ సచివాలయాల్లో సేవలను పెంచకుంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ హెచ్చరించారు. మండలంలో తొలిసారిగా మంగళవారం విస్తృతంగా పర్యటించిన ఆయన లుంగపర్తి సచివాలయాన్ని సందర్శించారు. అక్కడి సిబ్బందితో సమావేశమై నెలకు ఎన్ని రకాల సేవలు  అందుతున్నాయి?, ఎన్ని దరఖాస్తులు వస్తున్నాయి? అనే దానిపై ఆరా తీశారు. నెలకు 30 వరకు దరఖాస్తులు వస్తున్నాయని తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లకు దాదాపు నెలకు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, ఆ లెక్కన దరఖాస్తుకు 6 వేలకు పైగా ఖర్చవుతుందన్నారు. సచివాలయ సిబ్బంది తమ పరిధిలో రోజుకో గ్రామానికి వెళ్లి గ్రామసభలు  నిర్వహించి ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలకే  పరిమితం కాకుండా ల్యాండ్‌ మ్యుటేషన్‌, రేషన్‌ కార్డులు వంటి రెవెన్యూ సేవలను గ్రామ సచివాలయాల్లోనే చేసే విధంగా దరఖాస్తులను సేకరించాలన్నారు. నెలకు 400 దరఖాస్తులు సేకరించకుంటే సచివాలయాలకు తాళం వేస్తానని సున్నితంగా హెచ్చరించారు. అంతకు ముందు ఆయన కొత్తవలస బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మరుగుదొడ్లను పరిశీలించారు. వాటి నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల్లో శుభ్రం చేసి తల్లిదండ్రులతో సంతృప్తి చెందినట్టు లిఖితపూర్వక తీర్మానాన్ని అందజేయాలని ఆదేశించారు. పాఠశాలలోని సిబ్బందితో సుమారు గంటకు పైగా సమస్యలపై చర్చించారు. పాఠశాలల్లో సిక్‌రూమ్‌లలో విద్యార్థులకు మంచాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఎంపీపీ నీలవేణి ఆయన దృష్టికి తీసుకు వెళ్లగా తక్షణమే ప్రతీ పాఠశాలకు అయిదు పరుపులతో కూడిన మంచాలు ఏర్పాటుచేసేలా ప్రతిపాదనలు పంపాలని ఏటీడబ్ల్యూఓ వెంకటరమణను ఆదేశించారు. హెక్టాగుడ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరుచేయాలని, రాజుపాక- డెక్కాపురం రహదారి అటవీశాఖ అనుమతులు లేక పనులు ప్రారంభం కాలేదని, ఎంపీడీఓ కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు లేక తుదిదశలో ఉండిపోయిందని ఆమె.. కలెక్టర్‌ దృష్టికి తీసుకు వెళ్లగా వాటిని ఆయన స్వయంగా పరిశీలించారు. హెక్టాగుడ వంతెనకు ప్రతిపాదనలు పంపాలని, ఎంపీడీఓ కార్యాలయ భవనాన్ని పూర్తిచేసేందుకు రూ.15 లక్షలు మంజూరు చేస్తున్నానని ఆయన ప్రకటించారు. అనంతరం లుంగపర్తి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ నాడు-నేడు పనుల తీరును పరిశీలించారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలపై డాక్టర్‌ దివ్యను అడిగి తెలుసుకున్నారు. మలేరియా పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, టైఫాయిడ్‌ పరీక్షలు చేయాలని స్థానికులు కోరుతున్నట్టు ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకువెళ్లగా మండలంలోని నాలుగు పీహెచ్‌సీలలో ముందుగా లుంగపర్తి, పినకోట పీహెచ్‌సీలకు వంద టైఫాయిడ్‌ కిట్లను సరఫరా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. లుంగపర్తి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. గదుల కొరతను గుర్తించిన ఆయన నాడు- నేడు పథకంలో కోటి ఏడు లక్షల రూపాయలు సిద్ధంగా ఉన్నాయని, పనులను తక్షణమే ప్రారంభించాలని ప్రధానోపాధ్యాయుడు పటాసి ప్రసాద్‌ను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్‌ రాంబాయి, ఎంపీడీఓ నగేష్‌, డీఈఈ జయరాం, ఏఈలు మాణిక్యం, గౌతమ్‌, గణేష్‌, ఎంఈఓ ఎల్‌బీ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

Read more