రిజిస్ట్రేషన్‌ ఆదాయం అంతంతే!

ABN , First Publish Date - 2022-09-21T06:22:43+05:30 IST

అనకాపల్లి జిల్లాలో స్టాంపులు, రిజిస్ర్టేషన్‌ శాఖ ఆదాయం అంతంతమాత్రంగానే వుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల నుంచి ఆగస్టు వరకు ప్రభుత్వం విధించిన ఆదాయ లక్ష్యంలో 71.83 శాతం మాత్రమే సాధించింది.

రిజిస్ట్రేషన్‌ ఆదాయం అంతంతే!
అనకాపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

జిల్లాలో తగ్గిన స్థిరాస్తి క్రయవిక్రయాలు

2022-23లో ఏప్రిల్‌-ఆగస్టు వరకు లక్ష్యం రూ.152.75 కోట్లు

వచ్చిన ఆదాయం రూ.109.73 కోట్లే!

టార్గెట్‌ కన్నా 28.17 శాతం తక్కువ

96.41 శాతంతో మొదటి స్థానంలో అనకాపల్లి 

51.33 శాతంతో చివరిస్థానంలో ఎలమంచిలి


(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

అనకాపల్లి జిల్లాలో స్టాంపులు, రిజిస్ర్టేషన్‌ శాఖ ఆదాయం అంతంతమాత్రంగానే వుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల నుంచి ఆగస్టు వరకు ప్రభుత్వం విధించిన ఆదాయ లక్ష్యంలో 71.83 శాతం మాత్రమే సాధించింది. జిల్లాలోని పది సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల ద్వారా రూ.152.75 కోట్ల ఆదాయం రావాలన్న టార్గెట్‌కాగా రూ.109.73 కోట్లు మాత్రమే వసూలైంది. ఆదాయ శాతం పరంగా అనకాపల్లి కార్యాలయం మొదటి స్థానంలో వుండగా, ఎలమంచిలి చివరిస్థానంలో వుంది. 

జిల్లాల పునర్విభజన తరువాత ఏర్పడిన అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూముల మార్కెట్‌ విలువ గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్‌ విలువను ఏటేటా పెంచుకుంటూపోతున్నది. దీంతో స్థిరాస్తుల క్రయవిక్రయాలు పెరిగిపోతాయని, తద్వారా రిజిస్ట్రేషన్ల ద్వారా భారీగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఆ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలకు నెలల వారీగా ఆదాయ లక్ష్యాలను విధించింది. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది.  జిల్లాలో పది సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలు వుండగా, ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల కాలంలో ఒక్క కార్యాలయం కూడా లక్ష్యాన్ని సాధించలేకపోయింది. అన్ని కార్యాలయాల నుంచి మొత్తం రూ.152.75 కోట్లు ఆదాయం రావాల్సి వుండగా  రూ.109.73 కోట్లు మాత్రమే సమకూరింది. స్థిరాస్తుల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్‌లు అనుకున్నంతగా జరకపోవడమే ఇందుకు కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం విధించిన లక్ష్యంలో 71.83 శాతం మాత్రమే సాధించినట్టు చెబుతున్నారు. ఆదాయపరంగా చూస్తే.. అనకాపల్లి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం రూ.32.03 కోట్లకుగాను      30.88 కోట్లు (96.41 శాతం) సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఎలమంచిలి కార్యాలయం  రూ.32.25 కోట్లకుగాను రూ.16.55 కోట్లు (51.33) మాత్రమే సాధించి చివరి స్థానంలో నిలిచింది.

 చోడవరం, మాడుగుల, కె.కోటపాడు ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, స్థలాల మార్కెట్‌ ధరకన్నా ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ విలువ అధికంగా వుండడంతో ఆయా ప్రాంతాల్లో క్రయవిక్రయాలు తగ్గినట్టు సమాచారం. జాతీయ రహదారి పక్కన సబ్బవరం నుంచి పాయకరావుపేట వరకు పలుచోట్ల రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేసినప్పటికీ స్థలాల ధరలు చాలా అధికంగా వుండడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపడంలేదు. ఈ కారణాల వల్ల రిజిస్ట్రేన్ల ఆదాయం తగ్గిందని అధికారులు చెబుతున్నారు. 

 


Updated Date - 2022-09-21T06:22:43+05:30 IST