సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు

ABN , First Publish Date - 2022-11-24T00:13:58+05:30 IST

సచివాలయాల్లోనే త్వరలో రిజిస్ట్రేషన్లు జరుగుతాయని, సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల మాదిరిగా పని చేస్తాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. బుధవారం నరసన్నపేటలో ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం’ కింద భూహక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు.

సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు
రిజిస్ట్రేషన్‌ చేసి పట్టాను అందజేస్తున్న సీఎం జగన్‌

భూ సర్వేతో సమస్యల పరిష్కారం

కిడ్నీరోగాలు దరిచేరకుండా హిరమండలం నుంచి తాగునీరు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/ నరసన్నపేట, నవంబరు 23: సచివాలయాల్లోనే త్వరలో రిజిస్ట్రేషన్లు జరుగుతాయని, సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల మాదిరిగా పని చేస్తాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. బుధవారం నరసన్నపేటలో ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం’ కింద భూహక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. జగన్‌ చేతుల మీదుగా కొంతమంది రైతులకు శాశ్వత భూహక్కు పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ‘బ్రిటీష్‌ సివిల్‌ వ్యవహారాల్లో 90 శాతం భూ వివాదాలే ఉండేవి. అందువల్ల భూ కబ్జాలు జరగకుండా.. రెవెన్యూ రికార్డులు ప్రక్షాళన చేసేలా టెక్నాలజీ సహాయంతో సర్వే కార్యక్రమం చేపట్టాం. తొలివిడతలో 2వేల గ్రామాల్లో సర్వే పూర్తయ్యింది. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తి చేసి భూ హక్కు పత్రాలు పంపిణీ చేస్తాం. జిల్లాలో ఇచ్ఛాపురంలో ఇప్పటికే కిడ్నీరోగుల కోసం సురక్షిత తాగునీటిని అందించేందుకు రూ.765 కోట్లతో వంశధార రిజర్వాయర్‌ నుంచి నీటిని ఇచ్ఛాపురం తెప్పించేందుకు ప్రాజెక్టును తీసుకువచ్చాం. పలాసలో రూ. 50కోట్లతో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వంశధార ప్రాజెక్టులో నేరడి బ్యారేజీ విషయమై ఇప్పటికే ఒడిసా సీఎం నవీన్‌పట్నాయక్‌తో మాట్లాడాను. గత ప్రభుత్వాలేవీ ఇటువంటి పనులు చేపట్టలేదు. ఎక్కడా లంచాలు లేకుండా పాలన అందిస్తున్నాం. ఎవరైనా లంచం అడిగితే.. జగనన్న ఉన్నాడన్న భయం ఉండేలా చర్యలు తీసుకున్నాం. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలను, ప్రజల ఆరోగ్యం కోసం విలేజ్‌ హెల్త్‌క్లినిక్‌లను ఏర్పాటు చేశామ’ని తెలిపారు.

- సర్వేఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ ఎస్వీ సింగ్‌ మాట్లాడుతూ.. తొలివిడతగా ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర సహాయంతో 10 గ్రామాల్లో సమగ్ర భూసర్వే నిర్వహించి రికార్డులను ఆధునికీకరణ చేశామని, ఈ విధానం దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి భూసర్వే, రికార్డులు ప్రక్షాళన చేశామని తెలిపారు.

- కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన భూసర్వే, రికార్డుల ఆధునికీకరణ విషయాలపై వివరించారు. గ్రామస్థాయిలోనే సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యన్నారాయణ, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాసరావు, వరుదు కల్యాణి, పాలవలస విక్రాంత్‌, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, వి.కళావతి, ధర్మాన కృష్ణదాస్‌, రాష్ట్రస్థాయి అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

పర్యటన సాగింది ఇలా ..

సీఎం వైఎస్‌ జగన్‌.. బుధవారం ఉదయం 10.30కు హెలీకాప్టర్‌లో రాగా.. 11 గంటలకు సభ వద్దకు చేరుకున్నారు. 11.15 వరకు స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం వేదికపై కలెక్టర్‌ శ్రీకేష్‌బాలాజీ లఠ్కర్‌, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, స్థానిక ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, భూసర్వే ఆప్‌ ఇండియా డైరెక్టర్‌ ఎస్పీ సింగ్‌లు మాట్లాడారు. సీఎం జగన్‌ మధ్యాహ్నం 12.08 గంటల నుంచి 12.48 గంటల వరకు వేదికపై ప్రసంగించారు. అనంతరం జమ్ముజంక్షన్‌ వద్ద హెలీప్యాడ్‌ వద్దకు మధ్యాహ్నం 1.35కు చేరుకున్నారు. మధ్యాహ్నం 2.05 వరకు స్థానిక నాయకులు, మంత్రులతో మాట్లాడారు. తర్వాత హెలీకాప్టర్‌లో విశాఖపట్నం బయలుదేరారు.

ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా...!

ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా ముఖ్యమంత్రి ప్రసంగం సాగింది. అదేరీతిన పోటాపోటీగా ధర్మాన సోదరులు జగన్‌ను ఆకట్టుకునేలా.. టీడీపీపై విమర్శల బాణం ఎక్కుపెట్టారు. జగన్‌తో నవ్వులు పూయించేందుకు శాయశక్తులా కృషి చేశారు. నరసన్నపేట బహిరంగ సభలో ఎన్నికల వేళ ఓటర్లను మలచుకునే విధంగా సీఎం జగన్‌ ప్రసంగించారు. ఇచ్ఛాపురం, పలాస ప్రాంతాల్లో కిడ్నీరోగులకు గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని.. చంద్రబాబునాయుడ్ని విమర్శించారు. దత్తపుత్రుడు అంటూ పరోక్షంగా జనసేనాని పవన్‌కల్యాణ్‌ను కూడా విమర్శించారు. గతంలో తాను ఇచ్చిన హామీలు, నిధుల మంజూరుపై ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ విన్నపాల మేరకు సత్వరమే నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇటు పోటాపోటీగా ధర్మాన సోదరులు కూడా అధికశాతం రాజకీయ ప్రసంగాలే చేశారు. వైఎస్సార్‌ హయాంలోనూ, జగన్‌ హయాంలోనే జిల్లా బాగుపడిందని.. కీర్తించారు. మూడు రాజధానుల విషయంపైనా టీడీపీపై విమర్శలు చేస్తూ.. ప్రభుత్వ చర్యలను సమర్ధించారు.

Updated Date - 2022-11-24T00:14:03+05:30 IST