కొట్టొద్దన్నా వినలేదు

ABN , First Publish Date - 2022-06-12T05:58:31+05:30 IST

బాబూ.. కొట్టొద్దని ఓ మహిళ వారించింది. అయినా ఆ వైసీపీ ఎంపీపీ వినలేదు. ఓ వ్యక్తిని ఇష్టమొచ్చినట్లు చితకబాదారు. స్టాంప్‌ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. ఆదివారంలోపు తమ దారికి రావాలని బెదిరించారు. కోర్టులో ఉన్న ఓ కేసును సెటిల్‌మెంట్‌ చేసేందుకు యత్నించారు. చివరకు అది బెడిసి కొట్టింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎచ్చెర్ల ఎంపీపీ చిరంజీవిపై కేసు నమోదు చేశారు.

కొట్టొద్దన్నా వినలేదు
ఎంపీపీ మొదలవలస చిరంజీవి

సండేలోపు తమ దారికి రావాలని బెదిరింపు

చితకబాది.. సంతకాలు చేయించుకుని..

రెచ్చిపోయిన వైసీపీ ఎచ్చెర్ల ఎంపీపీ 

బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు

(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి) 

బాబూ.. కొట్టొద్దని ఓ మహిళ వారించింది. అయినా ఆ వైసీపీ ఎంపీపీ వినలేదు. ఓ వ్యక్తిని ఇష్టమొచ్చినట్లు చితకబాదారు. స్టాంప్‌ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. ఆదివారంలోపు తమ దారికి రావాలని బెదిరించారు. కోర్టులో ఉన్న ఓ కేసును సెటిల్‌మెంట్‌ చేసేందుకు యత్నించారు. చివరకు అది బెడిసి కొట్టింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎచ్చెర్ల ఎంపీపీ చిరంజీవిపై కేసు నమోదు చేశారు. 

...............


శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ వ్యక్తిని మరో నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ఎంపీపీ బెదిరింపులకు యత్నించడం కలకలం రేగింది. ఇద్దరి మధ్య ఇంటి తగాదా విషయంలో.. జోక్యం చేసుకున్న వైసీపీకి చెందిన ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవిపై శ్రీకాకుళం వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. నగరంలో ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన పొట్నూరు బంగార్రాజుకు తన ఇంటి విషయంలో పొట్నూరు భీమరాజుతో కోర్టులో వివాదం నడుస్తోంది. బంగార్రాజు సోదరుడు బాలసుబ్రహ్మణ్యం ఎవరికీ సమాచారం ఇవ్వకుండా తనతండ్రి పేరున ఉన్న ఇంటిని భీమరాజుకు తనాఖా పెట్టాడు. ఈ విషయం తెలుసుకుని ఇంటిని ఖాళీ చేయాలని బంగార్రాజు.. భీమరాజుకు హెచ్చరించగా వివాదం నెలకొంది. దీంతో బంగార్రాజు కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు కొనసాగుతోంది. కాగా, మూడు రోజుల కిందట నలుగురు వ్యక్తులు తాము పోలీసులమని చెప్పి.. బంగార్రాజును బలవంతంగా తీసుకెళ్లారు. ఎచ్చెర్ల ఎంపీపీ స్వగ్రామం ఫరీద్‌పేటకు తనను తీసుకెళ్లారని బంగార్రాజు పేర్కొన్నారు. అక్కడ ఎంపీపీ తనను కొట్టి.. అనుచరులతో స్టాంప్‌ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. ఇందుకు సాక్ష్యంగా ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన ఓ కుటుంబం కూడా నిలిచింది. ‘బాబూ అలా కొట్టొద్దు’ అని ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన మహిళ కోరినా సరే.. ఇవేవీ ఎంపీపీ వినలేదని.. ఆదివారం వరకు సమయం ఇచ్చానని లేకుంటే అక్కడితో సరి అని హెచ్చరించారని బాధితుడు మిత్రుని తల్లి తెలిపారు.  


హద్దుమీరి.. సెటిల్‌మెంట్‌ చేద్దామనుకుని..

ఓ ఇద్దరి మధ్య నడుస్తున్న వివాదంలో శ్రీకాకుళం నియోజకవర్గంతో సంబంధంలేని ఎచ్చెర్ల ఎంపీపీ జోక్యం చేసుకోవడం వివాదాస్పదమైంది. దీనికి గల కారణాలపై అధికార పార్టీ నేతలు కూడా ఆరా తీస్తున్నారు. బాధితుడి ఆరోపణ నిజమైతే.. ఎంపీపీ హద్దు మీరినట్టేనని పలువురు పేర్కొంటున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో సెటిల్‌మెంట్‌ చేద్దామని భావించి.. బెడిసికొట్టడంతో కేసు నమోదువరకు తెచ్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. నగరానికి చెందిన మరో వ్యక్తి ద్వారా పొట్నూరు భీమరాజు ఎంపీపీ వద్ద పంచాయతీ పెట్టినట్లు.. ఇందుకుగాను జిల్లాలో ఓ మహిళా రెవెన్యూ ఉద్యోగి సూచనలు పాటించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


గోప్యత పాటించిన పోలీసులు!

సామాన్య ప్రజల వివాదాలకు సంబంధించి కేసు నమోదు చేసినా, అరెస్టు చేసినా పోలీసులు స్వయంగా మీడియాకు వెల్లడిస్తారు. కానీ అధికారపార్టీ ఎంపీపీపై ఈ నెల 9న కేసు నమోదు చేయగా.. విషయం బయటకు పొక్కకుండా వన్‌టౌన్‌ పోలీసులు గోప్యత పాటించారు. చివరకు బంగార్రాజు ఇచ్చిన ఫిర్యాదుపై క్రైమ్‌ నంబర్‌, సెక్షన్లతో సహా ఎచ్చెర్ల ఎంపీపీతో పాటు మరికొందరిపై కేసు నమోదై ఆ వివరాలు బయటకు వచ్చేశాయి. జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధి సూచనను పోలీసులు కేసు నమోదు చేశారని విశ్వసనీయ సమాచారం. తన నియోజకవర్గంలో సెటిల్‌మెంట్‌కు పాల్పడిన సదరు ఎంపీపీపై ఆయన గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అయితే పోలీసులు కేసు నమోదుతో సరిపెడతారా..? విచారణలో ముందుకు వెళ్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. బాధితుడు బంగార్రాజు ఎస్పీని కలిసేందుకు శనివారం జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చాడు. సోమవారం వచ్చి ఫిర్యాదు అందించాలని సిబ్బంది చెప్పడంతో వెనుదిరిగాడు.


Read more