అంతా మా ఇష్టం!

ABN , First Publish Date - 2022-04-25T04:33:34+05:30 IST

అంతా మా ఇష్టం!

అంతా మా ఇష్టం!

- జనరిక్‌ మందులను సూచించని ప్రైవేటు వైద్యులు

- కొన్ని దుకాణాల్లో అవే మందులు అధిక ధరకు విక్రయం

- డ్రగ్‌ మాఫియాకు అడ్డుపడేదెన్నడో..

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

- శ్రీకాకుళం నగరం బలగ ప్రాంతానికి చెందిన ఓ హృద్రోగి నెలకు మందుల కోసం సుమారు రూ.2500 ఖర్చు చేస్తున్నారు. శ్రీకాకుళం ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకోగా.. వైద్యులు బ్రాండెడ్‌ మందులే సూచించారు. ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని కొనుగోలు చేసి ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి వ్యక్తులకు వైద్యులు తక్కువ ధరకు అందుబాటులో ఉండే జనరిక్‌ మందులను సూచిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. కానీ చాలా మంది వైద్యులు బ్రాండెడ్‌ మందులనే సిఫారసు చేస్తున్నారు. 


- ఆమదాలవలసకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల జ్వరం, కడుపునొప్పితో శ్రీకాకుళం నగరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి వచ్చాడు. వైద్యపరీక్షల అనంతరం ఆయనకు రూ. 1100 విలువగల మందులను వైద్యుడు రాశారు. ఇందులో కొన్ని జనరిక్‌ మందులు కూడా ఉన్నాయి. కానీ వాటి ధర తగ్గించకుండానే.. ఎమ్మార్పీ ఆధారంగానే మందుల దుకాణదారుడు డబ్బులు తీసుకున్నారు. 


ఇలా జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులు, మందుల దుకాణదారులు రోగులను దోచుకుంటున్నారు. తక్కువ ధరకు అందుబాటులో ఉండే జనరిక్‌ మందులు సూచించకుండా.. బ్రాండెడ్‌ మందులనే సిఫారసు చేస్తున్నారు. దీంతో ఆస్పత్రికి వెళ్లే రోగులు.. ఆర్థికంగా మరింత ఇబ్బందులు పడుతున్నారు.  


ప్రైవేటు వైద్యుల సహకారంతో మందుల దుకాణదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సామాన్యులకు వైద్యం గగనం కాగా..  చాలా మంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు ఆస్పత్రుల్లో పరీక్షలు, మందుల పేరిట రోగులపై అదనపు భారం పడుతోంది. తక్కువ ధరలో అందుబాటులో ఉన్న జనరిక్‌ మందులను ప్రైవేటు వైద్యులు సిఫారసు చేయడం లేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వివిధ కంపెనీలకు చెందిన మందులను రాస్తూ.. పేదలను దోచుకుంటున్నారు. కొంతమంది బ్రాండెడ్‌ మందులను సూచిస్తుండగా.. మరికొందరు పీసీడీ కంపెనీలకు చెందిన మందులను మాత్రమే వారివారి దుకాణాల్లో సిఫారసు చేస్తున్నారు. ఇటు బ్రాండెడ్‌ మందులు ధరలే కాకుండా.. పీసీడీ కంపెనీలకు చెందిన మందులు కూడా ఎమ్మార్పీ అధికంగానే ఉంటాయి. దీంతో ఒక్కో బాధితుడు  మందుల కోసం కనీసం రూ.500 నుంచి రూ.1500 వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ఇదే జనరిక్‌ మందులు అయితే.. చాలా తక్కువ ధరలకే లభిస్తాయి. వీటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ప్రోత్సహించేవి. ఇప్పుడు ప్రచారం అంతంతమాత్రమేంగా ఉండడంతో వీటిని పెద్దగా వినియోగించడం లేదు. 


అడ్డుపడేదెన్నడో...

 ప్రైవేటు ఆసుపత్రుల్లోనే మందుల దుకాణాలు ఉన్నాయి. ఆ దుకాణాల యాజమాన్యాలు కూడా ఆసుపత్రి నిర్వాహకులే. పీసీడీ కంపెనీలకు చెందిన మందులు.. ఇటు జనరిక్‌ మందులు అందులో ఉంటాయి. వైద్యులు రాసిన మందుల చీటీ ద్వారా సంబంధిత మందులను ఇస్తే.. వాటి ద్వారా వచ్చే ఆదాయంలో కొంత కమీషన్‌గా వైద్యులకు లభిస్తుంది. ఈ కమీషన్‌ మందుల కంపెనీలు.. పీసీడీ కంపెనీలయితే ఆ రిప్రజెంటేటివ్‌ వైద్యులకు చెల్లిస్తుంటారు. ఇది బహిరంగ రహస్యమే. డ్రగ్‌ దోపిడీ ఇలా సాగిపోతోంది. కానీ అరికట్టే అధికారి కానీ.. యంత్రాంగం కానీ లేకుండా పోతున్నారు. 


అవే మందులు.. ధరలు అధికం... 

బ్రాండెడ్‌ కంపెనీలు.. లేదా ఇతర ఔషధాల కంపెనీల ప్రచారం లేకుండా సంబంధిత మందులను మార్కెట్‌ చేస్తారు. వాటి ఎమ్మార్పీ కంటే 80 శాతం వరకు తక్కువగా ఉంటుంది. జనరిక్‌ మందులు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉన్న మందుల దుకాణాల్లో లభిస్తున్నాయి. కానీ వాటిని కొంతమంది వైద్యులు సూచిస్తున్నా.. ఎమ్మార్పీకే విక్రయిస్తున్నారు. దీనివల్ల రోగులకు ప్రయోజనం కలుగడం లేదు. ఇక రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న జనరిక్‌ మందుల దుకాణంలో మాత్రమే సంబంధిత మందులు కనిష్ఠ ఎమ్మార్పీలు ఉంటున్నాయి. వీటి వల్ల నేరుగా రోగులకు ఆర్థిక ఫలితముంటుంది. కానీ ఈ మందులను సిఫారసు చేసేవారు కరువయ్యారు. ఇక పలుచోట్ల జనరిక్‌ దుకాణాలు ఉన్నప్పటికీ.. వాటిపై ఎమ్మార్పీ ఎక్కువగా ఉంటోంది. వాటి ధర కొంతమేర తగ్గించి దుకాణదారులు ఇస్తున్నారు. వాస్తవంగా రోగికి ఎంత లాభం కలు గుతోంది.. ఎంత నష్టం చేకూరుతుందన్నదీ ఎవరికీ తెలియదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ.. అటు ఆరోగ్య కార్యకర్తల ద్వారా జనరిక్‌ మందులపై అవగాహన కల్పించడంలేదు. దీంతో ప్రతి కుటుంబం ఆర్థికభారంతో మరింత ఇబ్బందులకు గురవుతోంది. వీటిపై అవగాహన కల్పించాల్సి ఉంది. జనరిక్‌ మందులను సూచిస్తూ.. రోగులకు భారం తగ్గించాల్సిన అవసరం ఉంది. 


నిర్భయంగా వాడొచ్చు

జనరిక్‌ మందులను నిర్భయంగా వాడొచ్చు. మందుల చీటీ ప్రకారం వాటిని కొనుగోలు చేయాలి. దీనివల్ల బాధితులకు ఆర్థిక భారం తగ్గుతుంది. వైద్యులు జనరిక్‌ మందులను సూచించాలి. రోగి ప్రయోజనాన్ని కూడా గమనించాలి. దీనిపై అవగాహన కల్పిస్తున్నాం. 

- అనూరాధ, డీఎంహెచ్‌వో

Updated Date - 2022-04-25T04:33:34+05:30 IST