ఒత్తిడి చేశారు... వదిలేశారు

ABN , First Publish Date - 2022-06-07T06:00:00+05:30 IST

జిల్లాలో వేలాది మంది ఓటీఎస్‌ లబ్ధిదారులు రిజిస్ర్టేషన్‌ డాక్యుమెంట్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. గృహ నిర్మాణ పథకం కింద 1983-2011 మధ్య మంజూరైన ఇళ్లకు సంబంధించి వన్‌టైమ్‌సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జిల్లాలో ఓటీఎస్‌ కింద 2,57,950 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఇందులో సుమారు లక్ష మందికిపైగా ఓటీఎస్‌ కింద నగదు చెల్లించారు. ఇప్పటివరకు 39,139 మందికి మాత్రమే డాక్యుమెంట్లు అందజేశారు. మిగిలిన లబ్ధిదారులంతా రిజిస్ర్టేషన్‌ డాక్యుమెంట్లు అందక ఆందోళన చెందుతున్నారు.

ఒత్తిడి చేశారు... వదిలేశారు
ఓటిఎస్‌ డబ్బులు వసూలు చేస్తున్న సచివాలయ ఉద్యోగులు

డబ్బులు చెల్లించినా అందని డాక్యుమెంట్లు
ఓటీఎస్‌పై వలంటీర్లను నిలదీస్తున్న లబ్ధిదారులు
(మెళియాపుట్టి/ఇచ్ఛాపురం)

 మెళియాపుట్టి భాగ్యనగర్‌ వీధికి చెందిన కప్పా జోగారావుకు కొన్నేళ్ల కిందట గృహ నిర్మాణ పఽథకం ద్వారా ఇల్లు మంజూరైంది. ఓటీఎస్‌ కింద అధికారులు రూ.పదివేలు వసూలు చేశారు. నెలలు గడుస్తున్నా రిజిస్ర్టేషన్‌ చేసిన పత్రాలు ఇవ్వడం లేదని జోగారావు ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి దృష్టికి తన సమస్య తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని వాపోతున్నారు.

 మెళియాపుట్టి మండలం రింపి గ్రామానికి చెందిన సవర పాపారావుదీ ఇదే పరిస్థితి. ఓటీఎస్‌ కోసం డబ్బులు చెల్లించగా.. రిజిస్ర్టేషన్‌ డాక్యుమెంట్లు అందజేయడం లేదు. అప్పుచేసి డబ్బులు చెల్లించానని.. డాక్యుమెంట్లు అడిగితే అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. 

ఇచ్ఛాపురం మునిసిపాలిటీ 21వ వార్డుకు చెందిన ఆటోడ్రైవర్‌ డి.లింగరాజుకు 13 ఏళ్ల కిందట కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఇల్లు మంజూరైంది. ఓటీఎస్‌ కింద రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ కోసం అధికారులు రూ.15వేలు వసూలు చేశారు. నెలలు గడుస్తున్నా.. ఇంతవరకూ తనకు డాక్యుమెంట్‌ ఇవ్వలేదని లింగరాజు వాపోతున్నారు.
 
జిల్లాలో వేలాది మంది ఓటీఎస్‌ లబ్ధిదారులు రిజిస్ర్టేషన్‌ డాక్యుమెంట్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. గృహ నిర్మాణ పథకం కింద 1983-2011 మధ్య మంజూరైన ఇళ్లకు సంబంధించి వన్‌టైమ్‌సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గృహ రుణ బకాయిలు ఉన్నవారు.. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, పట్టణాల్లో రూ.15వేలు చొప్పున చెల్లిస్తే.. కొత్తగా లబ్ధిదారుల పేరున రిజిస్ర్టేషన్‌ పత్రాలు అందజేస్తామని ప్రకటించింది. వీటి ద్వారా బ్యాంకు రుణాలు, వివిధ రాయితీలు లభిస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో  గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారులపై ఒత్తిడి చేశారు. ఓటీఎస్‌ కింద నగదు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నగదు చెల్లిస్తే వెంటనే ఇంటిపై పూర్తిస్థాయిలో హక్కులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. మరోవైపు నగదు చెల్లించకపోతే ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో లక్షలాది మంది లబ్ధిదారులు నగదు చెల్లించారు. జిల్లాలో  ఓటీఎస్‌ కింద 2,57,950 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఇందులో సుమారు లక్ష మందికిపైగా ఓటీఎస్‌ కింద నగదు చెల్లించారు.
శ్రీకాకుళం, పలాస డివిజన్లలో 1,53,618 మంది ఓటీఎస్‌ లబ్ధిదారులును గుర్తించారు. ఇందులో కేవలం 42,986 మంది లబ్ధిదారులు నగదు  చెల్లించారు. కాగా, జిల్లాలో ఇప్పటివరకు 39,139 మందికి మాత్రమే డాక్యుమెంట్లు అందజేశారు. మిగిలిన లబ్ధిదారులంతా రిజిస్ర్టేషన్‌ డాక్యుమెంట్లు అందక ఆందోళన చెందుతున్నారు. నెలలు గడుస్తున్నా డాక్యుమెంట్లు ఎందుకు ఇవ్వడం లేదని సచివాలయ సిబ్బంది, వలంటీర్లను నిలదీస్తున్నారు. వారు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. ఇటీవల ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా వైసీపీ నేతలు పర్యటించగా.. లబ్ధిదారులు ఈ విషయమై వారిని నిలదీశారు. వాళ్లు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రిజిస్ర్టేషన్‌ డాక్యుమెంట్లు అందజేయాలని కోరుతున్నారు.

త్వరలో అందజేస్తాం
రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ఓటీఎస్‌ లబ్ధిదారుల పేరిట రిజిస్ర్టేషన్లు చేశాం. డాక్యుమెంట్లు పంపిణీ చేశాం. సాంకేతిక కారణాల వల్ల కొందరికి రిజిస్ర్టేషన్లు కాలేదు. త్వరలో రిజిస్ర్టేషన్లు పూర్తి చేసి.. సచివాలయాల ద్వారా డాక్యుమెంట్లు అందజేస్తాం. పట్టణాల్లో మునిసిపల్‌ కమిషనర్‌, గ్రామీణ ప్రాంతాల్లో తహసీల్దార్‌ వద్ద రిజిస్ర్టేషన్‌ డాక్యుమెంట్లు ఉన్నాయి. త్వరలో లబ్ధిదారులు అందరికీ డాక్యుమెంట్లు అందజేస్తాం.
- ఉదయ్‌కుమార్‌, జిల్లా సచివాలయ కోఆర్డినేటర్‌

     

Updated Date - 2022-06-07T06:00:00+05:30 IST