18 శాతమే ఇళ్లు పూర్తి

ABN , First Publish Date - 2022-11-30T00:08:52+05:30 IST

మూడడుగుల ముందుకు.. ఆరడుగుల వెనక్కు అన్న రీతిలో జగనన్న గృహనిర్మాణాలు సాగుతున్నాయి. ఇప్పటికీ లేఔట్లలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. జిల్లాకు 77,550 ఇళ్లు మంజూరు కాగా 14,063 మాత్రమే పూర్తయ్యాయి.

18 శాతమే ఇళ్లు పూర్తి
పొన్నాడలో జగనన్న ఇళ్ల నిర్మాణాలు (ఫైల్‌)

మంజూరు 77,550.. కంప్లీట్‌ 14,063

లేఅవుట్లలో కనీస సౌకర్యాలు కరువు

నేడు గృహనిర్మాణశాఖ మంత్రి రాక

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

మూడడుగుల ముందుకు.. ఆరడుగుల వెనక్కు అన్న రీతిలో జగనన్న గృహనిర్మాణాలు సాగుతున్నాయి. ఇప్పటికీ లేఔట్లలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. జిల్లాకు 77,550 ఇళ్లు మంజూరు కాగా 14,063 మాత్రమే పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాకు గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌ బుధవారం వస్తున్నారు. 10.15 గంటలకు గార మండలం లింగాలవలసలో జగనన్న లేఔట్లను పరిశీలిస్తారు. అనంతరం 11.30 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకుని.. మధ్యాహ్నం 1.30 గంట వరకు ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై సమీక్షిస్తారు. మధ్యాహ్నం 2.45 గంటలకు విశాఖపట్నం వెళ్లనున్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా జిల్లాలో ఇళ్ల నిర్మాణానికి 672 లేఅవుట్లను ఏర్పాటు చేయగా.. 660 లేఔట్లలోనే ఇళ్ల నిర్మాణం అక్కడక్కడా సాగుతోంది. వీటిలో చాలావరకు కనీస సౌకర్యాలు లేవు.

- జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు 77,550 జగనన్న ఇళ్లు మంజూరయ్యాయి. 11,686 మంది ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించలేదు. గృహప్రవేశాలకు అనుకూలంగా ఉన్నవి 14,063 ఇళ్లు మాత్రమే. 18.14 శాతం మాత్రమే జిల్లా అంతటా పూర్తయ్యాయని నివేదికల ద్వారా స్పష్టమవుతోంది.

- ఆమదాలవలస నియోజకవర్గంలో 9,360 ఇళ్లు మంజూరు కాగా 2,267 మాత్రమే పూర్తయ్యాయి. ఎచ్చెర్ల నియోజకవర్గంలో 11,810 ఇళ్లు మంజూరు కాగా పూర్తయినవి 2,825 మాత్రమే. ఇచ్ఛాపురంలో 10,928 ఇళ్లు మంజూరు కాగా 1,361 మాత్రమే పూర్తయ్యాయి. శ్రీకాకుళంలో 16,295 మంజూరు కాగా పూర్తయినవి 1,544 మాత్రమే. టెక్కలిలో 9,975 మంజూరు కాగా 2,097 పూర్తయ్యాయి. పలాసలో 12,413కు గాను 1,879 మాత్రమే పూర్తయ్యాయి. నరసన్నపేటలో 7,169కి గాను 2090 మాత్రమే పూర్తయ్యాయి.

- శ్రీకాకుళం నగర ప్రజలకు ఎచ్చెర్ల మండలం పొన్నాడ వద్ద ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఇక్కడ బోర్లను తవ్వించినా పూర్తిస్థాయిలో నీరు రావడంలేదు. దీంతో లబ్ధిదారులు నీటికష్టాలను భరించలేక నిర్మాణాలు చేయడంలేదు.

-పాత్రునివలసలో ‘పాత్రునివలస-1’ లేఔట్‌కు వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. ఇక్కడా నగరప్రజలకు ఇంటిస్థలాలను కేటాయించారు. ఎక్కువ మంది ఆసక్తి చూపడంలేదు.

-పాతపట్నం నియోజకవర్గం, నరసన్నపేట నియోజకవర్గం సారవకోట మండలంలో ఒక జగనన్న ఇల్లు కూడా మంజూరు అవ్వలేదు. అప్పట్లో అర్బన్‌ డవలప్‌మెంట్‌ అథారిటీలో చేర్చకపోవడమే కారణం.

- సరిపడా ఇసుక సరఫరా నుంచి.. ఇంటి సామగ్రి ధరలు సైతం పెరిగిపోవడం, నిర్మాణ వ్యయం అధికమవడం, బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం వంటి సమస్యలతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు.

Updated Date - 2022-11-30T00:08:52+05:30 IST

Read more