గోదాములేవీ?

ABN , First Publish Date - 2022-10-03T04:34:04+05:30 IST

జిల్లాకు గోదాముల సమస్య వెంటాడుతోంది. చాలీచాలని గోదాములతో ఏటా మిల్లర్లు అవస్థలు పడుతున్నారు. లెవీ సేకరణ సమయంలో నిల్వలకు సరిపడా గోదాములు లేక.. ఇతర జిల్లాలపై ఆధారపడుతున్నారు.

గోదాములేవీ?
టెక్కలి సమీపంలో ఉన్న ఎస్‌డబ్ల్యూసీ గోదాము

- జిల్లాకు వేధిస్తున్న గొడౌన్ల సమస్య
- మిల్లర్లకు తప్పని ఇబ్బందులు
(టెక్కలి)

జిల్లాకు గోదాముల సమస్య వెంటాడుతోంది. చాలీచాలని గోదాములతో ఏటా మిల్లర్లు అవస్థలు పడుతున్నారు. లెవీ సేకరణ సమయంలో నిల్వలకు సరిపడా గోదాములు లేక.. ఇతర జిల్లాలపై ఆధారపడుతున్నారు. జిల్లాలో సుమారు 4.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. సుమారు 330 రైస్‌మిల్లులకు ఏటా సీజన్‌లో సుమారు 6 లక్షల మెట్రిక్‌ టన్నుల లెవీని మిల్లర్లు అందజేస్తున్నారు. ఈ నిల్వలకు సరిపడా  గోదాములు లేవు. ప్రస్తుతం ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు చెందినవి ఏడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థల గోదాములు తొమ్మిది మాత్రమే ఉన్నాయి. వీటితో పాటు ఇతర ప్రైవేటు గోదాముల్లో సుమారు 2.44 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే నిల్వ చేస్తున్నారు. మిగతా నిల్వల కోసం గోదాములు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎఫ్‌సీఐ ద్వారా ఆమదాలవలస,  నిమ్మాడలో చెరో 30వేల మెట్రిక్‌టన్నులు నిల్వ చేసే గోదాములు ఉన్నాయి. తిలారులో మిల్లర్ల అసోసియేషన్‌ ద్వారా, ఆమదాలవలస ప్రైవేట్‌ గోదాములు, పలాస వంటి ప్రాంతాల్లో చెరో 20వేల మెట్రిక్‌టన్నుల గోదాములు ఉన్నాయి. టెక్కలి సమీపంలోని తామరాపల్లిలో 18వేల మెట్రిక్‌టన్నులు సామర్ధ్యం గల గోదాములు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో ఆమదాలవలసలో రెండుచోట్ల 45వేల మెట్రిక్‌టన్నులు నిల్వ చేసే గోదాములు ఉన్నాయి. కొత్తూరు, కంచిలి, నరసన్నపేట, పొందూరు ప్రాంతాల్లో చెరో పదివేలు మెట్రిక్‌టన్నులు నిల్వ చేస్తున్నారు. పలాసలో 17,500 మెట్రిక్‌టన్నులు, ఆమదాలవలస కేసీఆర్‌ గడ్డెయ్య దగ్గర నాలుగువేల మెట్రిక్‌టన్నుల నిల్వలకు సామర్ధ్యం ఉంది. ఈ గోదాములన్నింటిలో కలిపి 40 శాతం మించి కూడా నిల్వలు చేసుకునే సామర్థ్యం లేదని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిపాదనలకే పరిమితం
గోదాములు ఏర్పాటు చేయాలని మిల్లర్ల సంఘం పోరాడుతూనే ఉంది. దశాబ్దకాలంగా గోదాముల కోసం చేసిన ప్రతిపాదనలు అటకెక్కాయి. ఆమదాలవలస, తిలారు, కోటబొమ్మాళి వంటి ప్రాంతాల్లో గోదాముల నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. జిల్లాలో గోదాముల నిర్మాణానికి అవసరమైన స్థలాలు లేవు. దీంతో వివిధ మార్కెట్‌ యార్డుల్లోని ఖాళీ స్థలాల్లో గోదాములు నిర్మించాలని మిల్లర్లు ఒత్తిడి చేస్తున్నారు. కోటబొమ్మాళి లాంటి మార్కెట్‌ యార్డులో గోదాముల నిర్మాణానికి కావాల్సిన స్థలముంది. కానీ నిర్మాణం చేపట్టేందుకు ఎవరూ చొరవ చూపడం లేదు. గోదాముల సమస్యను పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లామని జిల్లా మిల్లర్ల సంఘం అధ్యక్షుడు ఆర్‌వీఎస్‌ వెంకటేశ్వరరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. గోదాముల నిర్మాణానికి ప్రైవేట్‌గా ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ప్రభుత్వపరంగా గోదాముల నిర్మాణానికి స్థల సమస్యలు ఉన్నాయని తెలిపారు.

 

Updated Date - 2022-10-03T04:34:04+05:30 IST