ప్రసవ వేదన

ABN , First Publish Date - 2022-09-30T04:16:47+05:30 IST

ప్రసవ వేదన

ప్రసవ వేదన
నరసన్నపేట వంద పడకల ఆసుపత్రి

- నరసన్నపేట సామాజిక ఆస్పత్రిలో అరకొర సేవలు

- గర్భిణులకు తప్పని ఇబ్బందులు

- ‘ప్రైవేటు’ క్లినిక్‌పైనే వైద్యుల శ్రద్ధ

(నరసన్నపేట)

- కోటబొమ్మాళి మండలం కొత్తపేటకు చెందిన పొందరి జ్యోతి అనే గర్భిణికి ఈ నెల 10న పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే కుటుంబ సభ్యులు నరసన్నపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో వైద్యులు లేకపోవడంతో.. సమీపంలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ సుమారు రూ.25వేల వరకు ఖర్చయింది. 

 

- పోలాకి మండలం దీర్ఘాశి గ్రామానికి చెందిన సీహెచ్‌ యశోద అనే గర్భిణి నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రతినెలా తనిఖీలు చేయించేకునేది. పురిటినొప్పులు రావడంతో ఆగస్టు 9న కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. స్త్రీ వైద్య నిపుణులు పట్టించుకోలేదు. మత్తు వైద్యులు లేరని తామేమి చేయలేమని.. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిపోవాలని ఉచిత సలహా ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను శ్రీకాకుళంలో జీజీహెచ్‌(రిమ్స్‌)కు తీసుకెళ్లగా.. అక్కడ ప్రసవించింది. 


- నరసన్నపేట మండలం కోమర్తి గ్రామానికి చెందిన కింజరాపు ప్రమీల అనే గర్భిణిని జూలై 1న రాత్రి 8 గంటలకు నరసన్నపేట సామాజిక ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. ఆ సమయంలో  డ్యూటీ డాక్టర్‌ లేరు. సిబ్బంది సమాచారం ఇచ్చినా విధులకు హాజరు కాలేదు. మరసటిరోజు వరకు ఆసుపత్రిలో ఉండాలని ఉచిత సలహా ఇచ్చారు. అయితే ప్రమీలకు నొప్పులు అధిక కావడంతో అప్పటి డ్యూటీ డాక్టర్‌కు చెందిన ప్రైవేటు ఆసుపత్రిలోనే   చేర్పించారు. అప్పుడు మాత్రం.. ఆ డ్యూటీ డాక్టరు చకాచకా వచ్చి ఆమెకు ఆపరేషన్‌ చేసి.. బిల్లు వసూలు చేశారు.  

 

నరసన్నపేటలోని సామాజిక ఆస్పత్రిలో వైద్యసేవలు సక్రమంగా అందడం లేదు. ప్రధానంగా గర్భిణులకు ప్రసవ వేదన తప్పడం లేదు. ఈ ఆస్పత్రి వంద పడకలకు అప్‌గ్రేడ్‌ అయిన తర్వాత నలుగురు స్త్రీవైద్య నిపుణులు, ఒక్కో ఈఎన్‌టీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్‌, రేడియాలజిస్ట్‌ను నియమించారు. వీరితో పాటు జనరల్‌ మెడిసిన్‌ ఇద్దరు, ఎనస్థీసియా ఇద్దరు సేవలందించేవారు. సివిల్‌సర్జన్‌ కేటగిరీలో ఒక్కో చిన్నపిల్లల వైద్యుడు, జనరల్‌మెడిసిన్‌, నర్సింగ్‌ సూపరింటెండెండ్‌ను నియమించారు. 24 మంది నర్సింగ్‌ పోస్టులకుగానూ 21 మంది, నలుగురు హెడ్‌నర్సులు ఉన్నారు. టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో ఉన్నారు. కానీ సేవలు మాత్రం అరకొరగానే అందుతున్నాయి. ప్రభుత్వ వైద్యులు సొంతంగా ప్రైవేటు క్లినిక్‌లపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. 


గతానికి.. పూర్తి భిన్నం

గతంలో అధిక ప్రసవాలు చేయించినందుకు ఈ ఆస్పత్రికి రాష్ట్రస్థాయిలో పలుమార్లు ఉత్తమ అవార్డులు వచ్చాయి. ఇప్పుడు పరిస్థితి పూర్తి విరుద్ధం. వైద్యులు సమయపాలన పాటించడం లేదు. కొంతమంది వైద్యులు ఆస్పత్రికి వచ్చి.. బయోమెట్రిక్‌లో హాజరు వేసి.. వెంటనే సొంత క్లినిక్‌లకు వెళ్లిపోతున్నారు. ఏవైనా ఎమర్జన్సీ కేసులు వస్తే ఫోన్‌ చేయాలని సిబ్బందికి సూచిస్తున్నారు. ఒకవేళ అర్జంట్‌ కేసులు వచ్చినా.. ఫోన్‌లోనే సలహాలు ఇస్తున్నారు తప్ప.. విధులకు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. సామాజిక ఆస్పత్రికి రోజుకు 150 నుంచి 200 వరకు ఓపీ ఉండగా, ప్రసూత విభాగమే 60శాతం మేరకు కేసులు వస్తున్నాయి. ఆస్పత్రికి వచ్చిన బాధితులను వైద్యులు తమ సొంత క్లినిక్‌లకు రిఫర్‌ చేస్తున్నారు. మరికొన్ని ఎమర్జన్సీ కేసులను శ్రీకాకుళంలోని జీజీహెచ్‌(రిమ్స్‌)కు రిఫర్‌ చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి వచ్చే స్ర్తీ వైద్య నిపుణులు పట్టించుకోకపోవడంతో రోగులు, గర్భిణులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రి సలహా మండలి జాడ కనిపించడం లేదు. ఆస్పత్రిలో డైటింగ్‌ కూడా సక్రమంగా లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ నిధులు కోట్లాది రూపాయలు వెచ్చించినా.. ఆశించిన స్థాయిలో సేవలు అందడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలాసలో ఇటీవల మంత్రి సందర్శించిన మాదిరి.. ఈ ఆస్పత్రిని కూడా ఎమ్మెల్యే పరిశీలిస్తే వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం బయటపడుతుందని పేర్కొంటున్నారు.  


కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా.. 

నరసన్నపేట వందపడకల ఆస్పత్రిలో   గైనకాలజిస్టుల తీరుపై  నరసన్నపేట మండలం తోటాడ గ్రామానికి చెందిన బుంగ పద్మ, ప్రసాద్‌లు కలెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. సమగ్ర నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. ఇటీవల నరసన్నపేట నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ చేసుకోని వెళ్లిపోయామని గైనకాలజిస్టు ధీమాగా ఉన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపడితే డాక్టరు డుమ్మా తీరు బయటపడుతుందని పలువురు పేర్కొంటున్నారు. నరసన్నపేటలో ప్రైవేటుగా ప్రాక్టీస్‌ చేస్తూ.. అక్కడ ఎలా విధులు నిర్వహిస్తున్నారోనని చర్చించుకుంటున్నారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెండ్‌ జయశ్రీ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. ‘స్ర్తీవైద్య నిపుణులకు గతంలో మౌఖిక ఆదేశాలు ఇచ్చాం. ప్రస్తుతం ప్రసూతి సేవలకు ఇబ్బంది లేదు. వైద్యులు విధులకు డుమ్మా కొడితే మెమోలు జారీ చేస్తున్నాం. అత్యవసర కేసులను జీజీహెచ్‌కు రిఫర్‌ చేస్తున్నా’మని తెలిపారు.  


Read more