అమానుషం.. మహిళలపై ట్రాక్టర్‌తో కంకర వేసి చంపేందుకుయత్నం

ABN , First Publish Date - 2022-11-07T21:13:55+05:30 IST

ఆస్తి కోసం సొంత పిన్ని, చెల్లెలుపైనే ట్రాక్టర్లతో కంకర వేసి చంపేందుకు ఓ వైసీపీ నాయకుడు (YCP leader), అతని సోదరులు యత్నించారు.

అమానుషం.. మహిళలపై ట్రాక్టర్‌తో కంకర వేసి చంపేందుకుయత్నం

శ్రీకాకుళం: ఆస్తి కోసం సొంత పిన్ని, చెల్లెలుపైనే ట్రాక్టర్లతో కంకర వేసి చంపేందుకు ఓ వైసీపీ నాయకుడు (YCP leader), అతని సోదరులు యత్నించారు. ఈ అమానుష ఘటన శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) మందస మండలం హరిపురంలో సోమవారం చోటుచేసుకుంది. కొట్ర దాలమ్మ, ఈమె కూతురు మజ్జి సావిత్రికి వారసత్వంగా లభించిన స్థలం ఇంటి పక్కనే ఉంది. వారి సమీప బంధువులైన కొట్ర దామోదరం కొడుకు కొట్ర రామారావు, కొట్ర సీతారాం కొడుకులు కొట్ర ప్రకాశరావు, కొట్ర ఆనందరావు దీన్ని ఆక్రమించుకున్నారు. దీనిపై బాధిత మహిళలు 2009 నుంచి పోరాటం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి, పెద్దమనుషులతో పంచాయితీ చేసినా ఫలితం లేకుండా పోయింది. తమ ఇంటిపక్కనే ఉన్న వారి స్థలంలో సోమవారం కొట్ర రామారావు, కొట్ర ప్రకాశరావు, కొట్ర ఆనందరావు అక్రమ నిర్మాణం చేపట్టి కంకర నింపుతుండటంతో మహిళలిద్దరు ఆడ్డుకున్నారు. దీంతో ఆ ముగ్గురు ట్రాక్టర్‌ (Tractor)తో మహిళలపై కంకరను వేయించి చంపేందుకు యత్నించారు. సగం వరకు కంకరలో కూరుకుపోయిన మహిళలు భోరున విలపిస్తూ కేకలు పెట్టడంతో స్థానిక యువకులు పారలతో మట్టిని తొలగించి మహిళలిద్దర్ని రక్షించారు. కొట్ర రామారావు గత సర్పంచ్‌ (Sarpanch) ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుడిగా పోటీచేసి ఓడిపోయారు. గ్రామంలో ఆయన వైసీపీ కీలక నాయకుడు.

ఏళ్లుగా పోరాటం..

కొట్ర సీతారాం, కొట్ర దామోదరం, కొట్ర నారాయణ, కొట్ర లక్ష్మినారాయణ నలుగురు అన్నదమ్ములు. వీరిలో ముగ్గురు ఇప్పటికే మృతిచెందగా.. కొట్ర లక్ష్మినారాయణ ఉన్నారు. వారసత్వంగా వచ్చిన భూములు నలుగురికి సమాన వాటాలు రావాలి. కానీ తన భర్త మృతిచెందాక తనకు కొడుకుల్లేరని, నీకెందుకు భూములంటూ కొట్ర దామోదరం కొడుకు కొట్ర రామారావు, కొట్ర సీతారాం కొడుకులు కొట్ర ప్రకాశరావు, కొట్ర ఆనందరావు అన్యాయం చేస్తున్నారని బాధిత మహిళ కొట్ర దాలమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. తమ అన్నయ్యలే తమ భూమిని అక్రమించి వాటా ఇవ్వకుండా దారుణానికి పాల్పడుతున్నారని దాలమ్మ కుమార్తె సావిత్రి భోరున విలపించింది. భూముల్లో వాటా కోసం నాలుగేళ్ల క్రితం తల్లి, కుమార్తె హరిపురం కూడలిలో నిరశనదీక్ష చేశారు. అప్పట్లో పోలీసులు న్యాయం చేస్తామని హామీనివ్వటంతో దీక్ష విరమించారు. కొవిడ్‌ రాకతో వివాదం అలాగే ఉంది. సోమవారం ఆ స్థలంలో నిర్మాణాలు చేపడుతుండగా దాలమ్మ, సావిత్రి అడ్డుకున్నారు. దీంతో ఆక్రమణదారులు కంకరవేసి చంపేందుకు యత్నించారు.

Updated Date - 2022-11-07T21:13:55+05:30 IST

Read more