ఎన్నాళ్లీ నిరీక్షణ!

ABN , First Publish Date - 2022-08-01T05:58:16+05:30 IST

జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణం అస్తవ్యస్తంగా మారింది. ఏళ్లు గడుస్తున్నా ఒక కొలిక్కి రావడం లేదు. ఇంకా పనులు కొనసాగుతునే ఉన్నాయి. చాలావరకూ పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. పట్టణ పేదల కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ‘హౌస్‌ ఫర్‌ ఆల్‌’ స్కీమ్‌ కింద శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాల్టీలో వేలాది ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కానీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి, వైసీపీ ప్రభుత్వం రాకతో వీటి పరిస్థితి తలకిందులైంది. - శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో లబ్ధిదారులకు సంబంధించి పాత్రునివలసలో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో పాత్రునివలస-1లో 1,280 ఇళ్ల నిర్మాణం పూర్తయింది.

ఎన్నాళ్లీ నిరీక్షణ!
పలాస-కాశీబుగ్గలో టిడ్కో ఇళ్ల దుస్థితి

 నిర్మించిన ఇళ్లు ఇవ్వరు.. పెండింగ్‌ పనులు పూర్తిచేయరు

 లబ్ధిదారుల ఎంపికలోనూ వివక్షే..

 కేటాయింపుల్లోనూ అస్పష్టతే..

 డీడీలు కట్టిన వారికి తిరిగి చెల్లింపులు లేవు

 రుణాల లింకేజీతో తప్పని వడ్డీ భారం

 జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణం అస్తవ్యస్తం

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

‘నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందించరు. పెండింగ్‌ పనులు పూర్తిచేయరు. కొంతమందికే ఇంటి పట్టాలు అందించారు. మిగతా వారి విషయంలో ఎటువంటి స్పష్టత ఇవ్వరు. వారు చెల్లించిన డీడీలకు మూడేళ్లవుతున్నా అతీగతీ లేదు. మరోవైపు బ్యాంకు రుణాల లింకేజీ పూర్తిచేశారు. లబ్ధిదారులపై నెలనెలా వడ్డీ భారం పడుతోంది’.. ఇదీ జిల్లాలో టిడ్కో ఇళ్ల పరిస్థితి. పట్టణ పేదల కోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్లను మంజూరు చేశారు. కానీ రాష్ట్రంలో అధికార మార్పిడి తరువాత ఆ ప్రభావం ఇళ్ల నిర్మాణంపై పడింది. లబ్ధిదారుల గుర్తింపు పూర్తయినా.. ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి అందించడంలో వైసీపీ సర్కారు విఫలమవుతోంది. ఫలితంగా లబ్ధిదారులకు నిరీక్షణ తప్పడం లేదు.

జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణం అస్తవ్యస్తంగా మారింది. ఏళ్లు గడుస్తున్నా ఒక కొలిక్కి రావడం లేదు. ఇంకా పనులు కొనసాగుతునే ఉన్నాయి. చాలావరకూ పనులు పెండింగ్‌లోనే  ఉన్నాయి. పట్టణ పేదల కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ‘హౌస్‌ ఫర్‌ ఆల్‌’ స్కీమ్‌ కింద శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాల్టీలో వేలాది ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కానీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి, వైసీపీ ప్రభుత్వం రాకతో వీటి పరిస్థితి తలకిందులైంది. 

- శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో లబ్ధిదారులకు  సంబంధించి పాత్రునివలసలో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో పాత్రునివలస-1లో 1,280 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. కానీ ఇతరత్రా మౌలిక సదుపాయాలకు సంబంధించి పనులు కొనసాగుతున్నాయి. పాత్రునివలస-2లో 624 ఇళ్లు మంజూరు అయ్యాయి. ఇందులో 576 ఇళ్లకు సంబంధించి శ్లాబు వేశారు. 48 ఇళ్లకు శ్లాబ్‌ వేయాల్సి ఉంది. ఇటీవలే ఇక్కడ 1,000 ఇళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కూడా పూర్తయ్యింది. 

- ఆమదాలవలస మునిసిపాల్టీలో లబ్ధిదారుల కోసం భైరిశాస్త్రులపేట వద్ద 528 టిడ్కో ఇళ్లు నిర్మాణం చేపట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో శరవేగంగా నిర్మాణ పూర్తయ్యాయి. అప్పటి ఎమ్మెల్యే కూన రవికుమార్‌ లబ్ధిదారులకు ఇంటి పట్టాలు సైతం అందించారు. 10 శాతం పనులు పెండింగ్‌లో ఉండడంతో లబ్ధిదారులెవరూ గృహ ప్రవేశాలు చేయలేదు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి తారుమారైంది.  దాదాపు 50 మంది లబ్ధిదారుల పేర్లను మార్చేశారు. ఇంకా 48 మందికి ప్రొసిడింగ్‌ పత్రాలు ఇవ్వాల్సి ఉంది. ఇళ్ల నిర్మాణానికి బ్యాంకు రుణం లింకుచేశారు. అయితే రుణం అయితే తమకు ఇళ్లు వద్దని 27 మంది తిరస్కరించారు. ప్రస్తుతానికి 400 ఇల్ల నిర్మాణం పూరయ్యాయి. 

- పలాస-కాశీబుగ్గ మునిసిపాల్టీ లబ్ధిదారులకు సంబంధించి  912 ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు.  ఇందులో 346 ఇళ్లకుగాను బ్యాంకు రుణాలు మంజూరుచేశారు. 576 మంది లబ్ధిదారులను గుర్తించారు. భవనాలు పూర్తికాకపోవడంతో 230 ఇళ్లకు గాను బ్యాంకు రుణాలు మంజూరు చేయలేదు. బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో ఏహెచ్‌పీ గృహ నిర్మాణం జరిగింది. ఇంతవరకూ ఒకటి కూడా పూర్తికాలేదు. రోడ్లు, నీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు లేవు. బ్యాంకు రుణాలు ఇచ్చి ఆరు మాసాలు గడుస్తున్నా ఫలితం లేకపోతోంది.

- ఇచ్ఛాపురం మునిసిపాల్టీలో 816 మంది టిడ్కో గృహాలకు డీడీల రూపంలో లబ్ధిదారులు నగదు చెల్లించారు. ఇందులో 192 మందికి  పట్టాలు పంపిణీ చేశారు. 430 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణం గల ఇళ్లు 48, 300 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణం గల ఇళ్లు 144 ఉన్నాయి. అలాగే టిడ్కో గృహాల పక్కన 593 మందికి స్థలాలు కేటాయించి పట్టాలు ఇచ్చారు. ఇంకా మిగిలిన 31 మందికి స్థలాలు ఇవ్వలేదు. 


 డీడీలు వెనక్కు ఇవ్వకుండా... 

అప్పట్లో ఇళ్ల కోసం డీడీలు చెల్లించిన వారిలో చాలా మందికి మొండిచేయి చూపారు. ఎస్‌ఎఫ్‌టీ ప్రకారం ఇళ్లకు నిర్ధేశిత రుసుంను డీడీల రూపంలో చెల్లించారు. అయితే అందులో కొంతమందికే ఇళ్లు మంజూరయ్యాయి. మరికొందరికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇల్లుకానీ.. ఇంటి స్థలం కానీ దక్కని వారికి తిరిగి నగదు చెల్లించలేదు. డీడీలు కట్టి మూడేళ్లు కావస్తున్నా ఇంతవరకూ వెనక్కి ఇవ్వలేదు. అప్పులుచేసి డీడీలు తీశామని... ఎన్నాళ్లు తమ వద్ద ఉంచుకుంటారంటూ లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇళ్లు మంజూరైనా.. అప్పగించనివారి పరిస్థితి మరోలా ఉంది. రుణాలు మంజూరైనవారికి వడ్డీ చెల్లించాలని బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. తప్పని పరిస్థితుల్లో వారు వడ్డీ చెల్లిస్తున్నారు. 


 సౌకర్యాలు అంతంతే..

  శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు మిగతా మునిసిపాల్టీల్లో టిడ్కో ఇళ్ల వద్ద సౌకర్యాలు మెరుగుపడలేదు. మౌలిక వసతులు కానరావడం లేదు. నీటి వసతి లేదు. రోడ్లు ఏర్పాట్లు చేయలేదు. కొన్నిచోట్ల ఇంకా పనులు జరుగుతున్నాయి. కొన్ని ఇళ్లకు ప్లాస్టింగ్‌లు వేయలేదు. విద్యుత్‌ సౌకర్యం కూడా లేదు. దీంతో పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. ఇళ్ల వద్దకు వెళ్లేందుకు సరైన రహదారి సదుపాయం కూడా లేదు. రోజుల తరబడి పనులు నిలిచిపోవడం, కనీసం జంగిల్‌ క్లీయరెన్స్‌ చేపట్టకపోవడంతో ఇళ్ల వద్ద పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. కనీసం అటువైపు వెళ్లేందుకు కూడా వీలుపడడం లేదు. 




Updated Date - 2022-08-01T05:58:16+05:30 IST