కొన్నది తక్కువ.. ఆక్రమణ ఎక్కువ

ABN , First Publish Date - 2022-09-27T05:00:44+05:30 IST

పోలాకి మండలంలో రొయ్యల చెరువు సాగు పేరిట.. జోరుగా ఆక్రమణలు సాగుతున్నాయి. ప్రభుత్వ భూములతో పాటు.. వంశధార నది, కాలువ సమీపంలో తక్కువ ధరకు భూములు కొనుగోలు చేస్తున్నారు. ఆపై రొయ్యల చెరువు సాగు చేస్తూ.. సమీప భూములను ఆక్రమిస్తున్నారు. రొయ్యల సాగు కారణంగా ఖరీఫ్‌ సీజన్‌లో వరిపంటకు ముంపు ముప్పు తప్పడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

కొన్నది తక్కువ.. ఆక్రమణ ఎక్కువ
రొయ్యల చెరువుల ఆక్రమణ కారణంగా సుసరాం వద్ద ముంపునకు గురైన వరిపంట(ఫైల్‌)

- రొయ్యల చెరువు సాగు పేరిట అక్రమాలు
- ఖరీఫ్‌లో తప్పని ముంపు ముప్పు
- ఆందోళనలో రైతులు
(పోలాకి)

పోలాకి మండలంలో రొయ్యల చెరువు సాగు పేరిట.. జోరుగా ఆక్రమణలు సాగుతున్నాయి. ప్రభుత్వ భూములతో పాటు.. వంశధార నది, కాలువ సమీపంలో తక్కువ ధరకు భూములు కొనుగోలు చేస్తున్నారు. ఆపై రొయ్యల చెరువు సాగు చేస్తూ.. సమీప భూములను ఆక్రమిస్తున్నారు. రొయ్యల సాగు కారణంగా ఖరీఫ్‌ సీజన్‌లో వరిపంటకు ముంపు ముప్పు తప్పడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. విశాఖపట్నానికి చెందిన వ్యాపారులు దండులక్ష్మిపురం వద్ద ఆక్వాకల్చర్‌ను తొలుత ప్రారంభించారు. అనంతరం అంపలాం, రాజారాంపురం, బెలమర, సుసరాం, సత్రవుపేట గ్రామాల్లో రొయ్యల చెరువుల పెంపకం విస్తరించింది. మండలంలో ప్రస్తుతం సుమారు 4000 ఎకరాల విస్తీర్ణంలో 300 చెరువుల్లో రొయ్యల పెంపకం చేస్తున్నారు. రొయ్యల పెంపకం బాధ్యతను స్థానిక రైతులకు వ్యాపారులు అప్పగించారు. అప్పుడప్పుడు విశాఖ నుంచి వ్యాపారులు వచ్చి.. రొయ్యం పెంపకం పరిస్థితిని పరిశీలిస్తారు. కాగా దాదాపు ప్రతి చోటా తక్కువ స్థలం కొనుగోలు చేసి.. సమీపంలో స్థలాలను ఆక్రమించి రొయ్యల సాగు చేస్తున్నారు. ఆక్రమణల తొలగింపునకు అధికారులు ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ, రాజకీయ నాయకుల ఒత్తిడితో ఆక్రమణలు తొలగించలేకపోతున్నారు. రెండేళ్ల కిందట టీడీపీ మద్దతుదారుడు ఒకరు వంశధార నదిని కబ్జా చేసి.. రొయ్యల చెరువు సాగు చేస్తున్నట్టు వైసీపీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లా నుంచి ప్రత్యేక బృందం వచ్చి ఆక్రమణలు తొలగించింది. కానీ, మిగిలిన చెరువుల్లో ఆక్రమణల జోలికి వెళ్లలేదు. వంశధార కాలువ, నది సమీపంలోనే ఎక్కువగా ఆక్రమణలు జరుగుతున్నాయని మత్స్యశాఖ సచివాలయ ప్రతినిధులు అరవల గోవిందరావు, ఢిల్లీశ్వరరావు పేర్కొన్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. అధికంగా అధికారపార్టీ మద్దతుదారులే ఆక్రమణ చేసి.. రొయ్యల సాగు చేపడుతున్నారు. దీంతో మత్స్యశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు ఆక్రమణలపై చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

రైతులకు నష్టం
రొయ్యలసాగు కారణంగా రైతులకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. ఖరీఫ్‌ సీజన్‌లో ఉప్పునీటి వరద ప్రభావంతో వేలాది ఎకరాల్లో వరి పంట ముంపునకు గురవుతోంది. రొయ్యల సాగు కోసం వినియోగిస్తున్న రసాయనిక పదార్థాలతో పంట పాడైపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి సర్వే నెంబర్ల ప్రకారం ఆక్రమణలు గుర్తించి.. వాటిని తొలగించాలని రైతులు కోరుతున్నారు. రొయ్యల చెరువుల ఆక్రమణ విషయమై తహసీల్దార్‌ కంచరాన శ్రీరాములు వద్ద ప్రస్తావించగా.. కొత్తగా బాఽధ్యతలు చేపట్టానని తెలిపారు. రొయ్యల చెరువుల ప్రాంతాలను పరిశీలించి.. ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపడతామన్నారు.

 

Read more