ప్రాణాలు విడిచి.. విషాదం మిగిల్చి..

ABN , First Publish Date - 2022-11-30T23:44:16+05:30 IST

జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు విడిచారు. కవిటి, బూర్జ, టెక్కలి మండలాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా, కోటబొమ్మాళి మండలంలో విద్యుదాఘాతంతో ఓ యువకుడు చనిపోయాడు. పొందూరులో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రాణాలు విడిచి.. విషాదం మిగిల్చి..
ప్రకాశరావు(ఫైల్‌)

హోటల్‌ నుంచి ఇంటికి వస్తుండగా..

కవిటి: జగతి గ్రామం హనుమాన్‌ ఆలయం మలు పులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కంచిలి మండలం బూ రగాం గ్రామానికి చెందిన పొన్నంగి ప్రకాశరావు (49) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాలు ప్రకా రం.. ప్రకాశరావు కవిటిలోని ఓ హోటల్‌లో కుక్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి అక్కడే విధులు నిర్వ హించాడు. బుధవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా.. జగతి హనుమాన్‌ ఆలయం వద్ద మలుపులో వాహనం అదుపు తప్పడంతో గోతిలో పడిపోయాడు. బయటకు కనబడని గా యాలు తగలడంతో 108 వాహనంలో కవిటి సామాజిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రకాశరావుకు భార్య విమల, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

ద్విచక్ర వాహనాలు ఢీకొని..

ఆమదాలవలస(బూర్జ): బూర్జ మండలం మర్రి పాడు జంక్షన్‌ వద్ద ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో పాలకొండ పట్టణంలోని బల్లంకి వీధికి చెందిన నాదెళ్ల సంతోష్‌కుమార్‌ (30) అనే యువకుడు దుర్మరణం చెందాడు. సంతోష్‌తో పాటు మరో ఇద్దరు కలిసి మంగళవారం రాత్రి శ్రీకాకుళం నుంచి బైక్‌ మీద పాలకొండకు వస్తుండగా, బూర్జ మండలం మదనాపురం గ్రామానికి చెందిన గొర్లె గోవిందరావు పాలకొండ నుంచి ఇంటికి బైక్‌పై వెళ్తుండగా మర్రిపాడు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ఘటనలో సంతోష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంతోష్‌ కార్పెంటర్‌గా జీవనం సాగిస్తున్నాడు. భార్య అమృత, కుమారుడు హర్షవర్థన్‌, కుమార్తె అనూష ఉన్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

గుర్తు తెలియని వాహనం ఢీకొని..

టెక్కలి రూరల్‌: టెక్కలి జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. హైవేపై వ్యక్తి మృతిచెందాడన్న సమా చారం మేరకు పోలీసులు వెళ్లి పరిశీలించగా మృతదేహం నుజ్జు నుజ్జయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు, పంచాయతీ అధికారుల పర్యవేక్షణలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై ఎస్‌ఐ-2 కె.గోపాలరావు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా టెక్కలికి చెందిన అభయం యువజన సంఘం అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావు సంఘం తరఫున అంత్యక్రియలకు ఆర్థిక సహాయాన్ని పోలీసులకు అందించారు.

లారీ కడుగుతుండగా...

టెక్కలి (కోటబొమ్మాళి): చిన్నబమ్మిడి గ్రామంలో మంగళవారం రాత్రి విద్యుదాఘాతంతో వజ్రపు కొత్తూరు మండలం శివరాంపురం గ్రామానికి చెందిన మామిడి జగదీష్‌ (18) మృతి చెందాడు. జగదీష్‌ చిన్న బమ్మిడికి చెందిన వాన అదినారాయణ వద్ద లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి లారీ కడుగుతుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి లారీ నుంచి కిందకు పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే క్షతగాత్రుడిని చికిత్స కోసం శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఖాదర్‌భాషా బుధవారం తెలిపారు.

అనారోగ్య సమస్యలు భరించలేక..

పొందూరు, నవంబరు 30: నర్సాపురం గ్రామానికి చెందిన గద్దెబోయిన రాము (38) బుధవారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రాము గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆరోగ్యం కుదుటపడకపోవడంతో పొందూరు రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు కింద పడి ప్రాణం తీసుకున్నాడు. రాముకు భార్య అప్పలరాజు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-11-30T23:44:16+05:30 IST

Read more