జాతర సందడి

ABN , First Publish Date - 2022-09-29T04:18:38+05:30 IST

కోటబొమ్మాళిలో కొత్తమ్మ తల్లి జాతర ఉత్సవాలు రెండో రోజు బుధవారం సందడిగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

జాతర సందడి
కొత్తమ్మతల్లిని దర్శించుకున్న ఎస్పీ రాధిక, తదితరులు

- ప్రశాంతంగా కొత్తమ్మతల్లి ఉత్సవాలు
కోటబొమ్మాళి, సెప్టెంబరు 28 :
కోటబొమ్మాళిలో కొత్తమ్మ తల్లి జాతర ఉత్సవాలు రెండో రోజు బుధవారం సందడిగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన పోలీసు కంట్రోల్‌ రూం నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించారు. కోటబొమ్మాళికి చెందిన వివిధ సేవా సంఘాలు భక్తులకు మంచినీటి ప్యాకెట్లు, ప్రసాదాలు పంపిణీ చేశాయి. కొత్తపల్లి పీహెచ్‌సీ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విద్యుత్‌ దీపాల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎస్పీ జీఆర్‌ రాధిక.. కొత్తమ్మతల్లిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ మేనేజర్‌ వీ.వీ. సూర్యనారాయణ, ట్రస్టుబోర్డు చైర్మన్‌ బోయిన మాధవి ఆమెకు స్వాగతం పలికారు. పురోహితుడు గణపతిశర్మ పూజలు చేయించి.. అమ్మవారి విశిష్టతను వివరించారు. అనంతరం ఆలయ ఆవరణలో కోలాట ప్రదర్శనను ఆమె తిలకించారు. టెక్కలి నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి కణితి కిరణ్‌, తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో టెక్కలి సీఐ సూర్యచంద్రమౌళి, ఎస్‌ఐ షేకర్‌ ఖాదర్‌భాషా తదితరులు పాల్గొన్నారు.

బలవంతపు వసూళ్లు తగదు
కొత్తమ్మతల్లి ఉత్సవాల్లో ఎన్నడూ లేని విధంగా బలవంతపు వసూళ్లు చేయడం విచారకరమని మాజీ సర్పంచ్‌, కొత్తమ్మతల్లి మాజీ ట్రస్టుబోర్డు చైర్మన్‌ బోయిన గోవిందరాజులు అన్నారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘ఉత్సవాలకు ఖర్చుల పేరుతో అధికారుల ద్వారా డబ్బులు వసూలు చేయడం తగదు. ప్రభుత్వ నిధులు, స్వచ్ఛంద విరాళాలతో ఉత్సవాలు చేయాలి. చైర్మన్‌ పేరుతో పదివేల పాసులు ముద్రించి.. వారికి నచ్చినవారికి పంపిణీ చేస్తున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యహరించారు. దీనివల్ల సాధారణ భక్తులు ఇబ్బంది పడ్డారు’ అని తెలిపారు. ఈ వ్యవహారంపై సీఎఫ్‌వో, దేవదాయశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

 
 

Read more