వేలిముద్రలేసి వెళ్లిపోవడమే!

ABN , First Publish Date - 2022-09-25T05:05:57+05:30 IST

పలాస సామాజిక ఆసుపత్రిలో ప్రస్తుతం ఏడుగురు వైద్యులు ఉన్నారు. 50 పడకలు ఉన్నాయి. రోగులతో నిత్యం కిటకిటలాడుతుంటుంది. కానీ మెరుగైన వైద్యసేవలు లేవు. కారణం.. వైద్యులు తమ సొంత క్లినిక్‌లో మునిగి తేలుతుండడమే. ఉదయమే ఆసుపత్రికి రావడం.. వేలిముద్రలు వేయడం.. హాజరుపట్టికలో సంతకం చేయడం.. వెంటనే వెళ్లిపోవడం.. నిత్యం జరిగే తంతు ఇది. వైద్యులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్లీ 2 నుంచి సాయంత్రం 4 వరకు విధుల్లో ఉండాలి. చాలామంది వైద్యులు ఈ వేళలు పాటించడం లేదు. మత్స్య, పశుసంవర్థకశాఖ సీదిరి అప్పలరాజు తనిఖీలో ఈ డొల్లతనమంతా బయటపడింది.

వేలిముద్రలేసి వెళ్లిపోవడమే!
ఆసుపత్రిలో హాజరుపట్టి పరిశీలిస్తున్న మంత్రి అప్పలరాజు

పలాస ప్రభుత్వాసుపత్రిలో ఇదీ తీరు
సూపరింటెండెంట్‌ సహా వైద్యుల గైర్హాజరు
మంత్రి తనిఖీలో బయట పడిన డొల్లతనం
పలాస, సెప్టెంబరు 24:
పలాస సామాజిక ఆసుపత్రిలో ప్రస్తుతం ఏడుగురు వైద్యులు ఉన్నారు. 50 పడకలు ఉన్నాయి. రోగులతో నిత్యం కిటకిటలాడుతుంటుంది. కానీ మెరుగైన వైద్యసేవలు లేవు. కారణం.. వైద్యులు తమ సొంత క్లినిక్‌లో మునిగి తేలుతుండడమే. ఉదయమే ఆసుపత్రికి రావడం.. వేలిముద్రలు వేయడం.. హాజరుపట్టికలో సంతకం చేయడం.. వెంటనే వెళ్లిపోవడం.. నిత్యం జరిగే తంతు ఇది. వైద్యులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్లీ 2 నుంచి సాయంత్రం 4 వరకు విధుల్లో ఉండాలి. చాలామంది వైద్యులు ఈ వేళలు పాటించడం లేదు. మత్స్య, పశుసంవర్థకశాఖ సీదిరి అప్పలరాజు తనిఖీలో ఈ డొల్లతనమంతా బయటపడింది. ఆయన శనివారం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.20 గంటల వరకు ఆసుపత్రిలో వివిధ విభాగాలు తనిఖీ చేశారు. ఈ సమయంలో విధులు నిర్వహించాల్సిన సూపరింటెండెంట్‌ ఎం.రమేష్‌, మరో ఐదుగురు వైద్యాధికారులు వేలిముద్రలు వేసి ఉదయం 9గంటలకే బయటకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని మంత్రి గుర్తించి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను రప్పించి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రం తరువాత అంతటి ప్రాముఖ్యం కలిగిన పలాస ప్రభుత్వాసుపత్రిలో మొత్తం 11 మంది వైద్యులు పనిచేయాల్సి ఉంది. వివిధ కారణాల వల్ల ఏడుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. శనివారం ఒక ఎంబీబీఎస్‌ డాక్టర్‌ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని మంత్రి గుర్తించారు. వీరంతా వారి ప్రైవేటు క్లినిక్‌లకు వెళ్లినట్లు గుర్తించారు. తర్వాత విషయం తెలుసుకున్న వైద్యాధికారులు ఒకరి తరువాత ఒకరు వచ్చి అత్యవస సమావేశం నిర్వహించుకున్నారు. ఆసుపత్రిలో నిర్వహణ లోపాన్ని కూడా మంత్రి గుర్తించారు. 50 పడకల ఆసుపత్రిలో అందుకు తగిన వసతులు ఉన్నా బెడ్లు వేయకుండా ఖాళీగా ఉంచడాన్ని మంత్రి సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు నిర్వహిస్తున్న కారణంగా గదులు వర్షానికి కారిపోతున్నాయని సూపరింటెండెంట్‌ వివరణ ఇచ్చుకున్నారు. బెడ్లు వేసి రోగులకు సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు. వైద్యుల పనితీరుపై రోగుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ను ఆదేశించారు.

పనుల నిర్వహణపై అసంతృప్తి
పలాస ఆస్పత్రిలో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5కోట్లు కేటాయించింది. గడువు సమీపిస్తున్నా పనులు సక్రమంగా చేపట్టడం లేదంటూ మంత్రి సీదిరి అప్పలరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు హెచ్చరించారు. కొన్ని బ్లాక్‌ల్లో నీరు నిల్వ ఉండిపోతోందని, ఇంజనీరింగ్‌ అధికారుల ప్లాన్‌ ప్రకారం పనులు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు డబ్బీరు భవానీ శంకర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబు, మాజీ చైర్మన్‌ కోత పూర్ణచంద్రరావు, మున్సిపల్‌ కమిషనర్‌ టి.రాజగోపాలరావుతో పాటు ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.

 

Updated Date - 2022-09-25T05:05:57+05:30 IST